6, డిసెంబర్ 2023, బుధవారం

తలచియు దలచని తలపుకు*

 *#కృష్ణా_నీ_మీద_మనసాయెరా   #గోపికావిలాపము* 


 ( కందములలో శతకము - 07 )


🌺🍃 *----------------* 🍃🌺


🌹🙏🌹


*తలచియు దలచని తలపుకు* 

*వలచియు వలవని వలపులె వరముగ దక్కున్ !*

*దలచితి సంపూర్ణముగా*

*వలపంతయు గోరుచున్న వనితను గృష్ణా !*

    

(  61 ) 


🌹🙏🌹( భావము )


ఏదో తలచామా తలచలేదా అన్న తలపులకు ,

దక్కినదా దక్కలేదా అన్నట్లుగానే నీ ప్రేమము దక్కుట సమంజసమే ! 🙏


*కానీ కృష్ణా !* 

పరిపూర్ణముగా నేను నీ ధ్యాసలోనే బ్రతుకుచున్నాను . మరి నీ సంపూర్ణమైన ప్రేమను ఈ వనిత కోరుకొనుట ఉచితమే కదా *కృష్ణా ?*🙏


🌹🙏🌹


*ఆవిరులైనది  తనువున-*

*నీ విరులన్నియును వాడె నిట్టే కృష్ణా ,*

*పావురములెగిరి పోయెను*

*నా విరహపు వేదనగని ననువిడి కృష్ణా !*


(  62 )  


🌹🙏🌹( భావము )


తనువంతా వేడి ఆవిరులుగా ఉండుటచే ,

నా మీద నున్న ఈ పువ్వులన్నీ, ఇట్టే వాడి పోయి నేలరాలి పోతున్నాయి *కృష్ణా !*🙏


నా చెంతనే ఎంతో మచ్చికతో ఉండే పావురాలూ , గువ్వలు అన్నీ,

 నా విరహ తాపమునోర్వలేక , నన్ను విడిపోయి ఎక్కడికో ఎగిరిపోయాయి *కృష్ణా !*🙏


🌹🙏🌹


*ఘననీలి మేఘ మాకస-*

*మున నున్నను వర్షముబడు ముంగిట నందే !*

*కనరా మేఘశ్యామా ,*

*మనసున ప్రేమ కురిపించు మనవిదె కృష్ణా !!*  


( 63 )


🌹🙏🌹( భావము )


ఎంత గొప్ప నల్లటి మేఘమైనా ఆకాశములోనే వర్షాన్ని కురిపించదు కదా !  🙏

అది చక్కగా నేల మీద ఉన్న వనాలపై ,మొక్కలపై ,పూవులపై చిగురులపై అతి ప్రేమముతో చినుకులు కురిపించును కదా ! 🙏


నీవు నీలమేఘశ్యాముడవైన దయ అనబడే నల్లటి మేఘము లాంటి వాడవు .🙏

నిన్ను కోరుకున్న నా వంటి వనిత హృదయముపై వర్షించరా నీ దయనంతయూ ! ఇదియే నా మనవి *కృష్ణా !*🙏


🌹🙏🌹


*కొలనున గువలము నవ్వుచు*

*గలువలఱేని మురిపెమున కడువిర బూసెన్ ,*

*జెలికాడు లేని యీ నా*

*చెలువము విరబూయు టెపుడొ చెప్పర కృష్ణా  !!*  


( 64 )


🌹🙏🌹( భావము )


అదిగో ఆ కొలునులో ఉన్న కలువ ,

ఆ కలువరేడు చూపించిన ప్రేమకు మురిసిపోయి ,

ఎంత గొప్పగా విరబూసినదో !🙏


నా చెలికాడవైన నీవు లేని ఈ నా సౌందర్యము ,

ఎప్పుడు విరబూస్తుందో కాస్త చెప్పు *కృష్ణా ?*🙏


🌹🙏🌹


*నాటకమా నీ చేతలు ?*

*బూటకముల ? మాటలు మరి పొందులు కృష్ణా ?*

*మాటల మాయాజాలమ ?*

*తేటగ నొకతీరునుండు దిరముగ కృష్ణా !* 

   

( 65 )


🌹🙏🌹( భావము )


అసలు నువ్వు చేసే పనులన్నీ నాటకాలేనా ?

నీ మాటలు , నీ సహచర్యమూ అంతా అసత్యమేనా ?🙏


లేక మాట్లాడుచున్నట్లుగా , చేతలు చేయుచున్నట్లుగా అగుపించే ఇంద్రజాలమా ?🙏


అవన్నీ వద్దు *కృష్ణా !*  సారముగా ఒకే రీతిలో ప్రేమిస్తూ చక్కగా స్థిరముగా నా యెడల ఉండు *కృష్ణా !*🙏


🌹🙏🌹


*గుట్టుగ నుండెడి దానను,*

*బట్టనురా పంత మెపుడుఁ బదుగురి యెదుటన్ !*

*దట్టముగ నిను బొగడుటకె*

*కట్టుబడి మసలుచు నుండు , గాంతను కృష్ణా !*


( 66 )


🌹🙏🌹( భావము )


సడి సేయక మౌనంగా ఉండే దానను ! 

నీ మీద బాహాటముగా పదుగురి ఎదుటా ఏ పంతములకూ పోను ! 🙏


బహువిధముల సారముగా నిన్నే పొగుడుచూ ఉండెడి దానను ! 🙏

ఈ విధముగానే నేను నీకు కట్టుబడి , జీవనము సాగించుచున్న కాంతను *కృష్ణా !*🙏


🌹🙏🌹


*పొగడంగ నుబ్బిపోదువు*

*మగువలు నిన్నెరిగితిరయ , మల్లడవన్చున్*

*దెగపొగడి రతులు సల్పిరి !*

*తగునైన వనితను విడువ దగునా కృష్ణా !!*

 

( 67 ) 


🌹🙏🌹( భావము )


కొద్దిగా పొగిడితే చాలు ఉబ్బిపోతావు !


ఈ కిటుకు ఎరిగి అదిగో అ నెరజాణలందరూ ,

 నిన్ను మల్లడవని ( గట్టి  పట్టు కలవాడవని ) బాగుగా పొగిడి,

వారి వాంఛలన్నీ తీర్చుకుంటున్నారు .🙏


అటువంటి నేర్పులు నేర్వని తగునైన గుణవంతురాలిని నేను . నన్ను విడచుట నీకు తగునా *కృష్ణా ??*🙏


🌹🙏🌹


*ఎన్నడు దెలియునురా? నీ-*

*కెన్నడు నా మనసు తెలియు నింపుగ కృష్ణా ?*

*మన్నన నుండిన యింతిని*

*మన్నించగ నది కరుగని మనసా కృష్ణా ??*  


(  68 )


🌹🙏🌹( భావము )


ఏనాటికి తెలుస్తుందిరా నీకు ?

ఎప్పటికి నా మనసును నీవు అందముగా అర్థము చేసుకుంటావు *కృష్ణా ?*🙏


మర్యాదగా నిన్ను తలచుకునే ఆడదానిని ,

ఆదరించలేక పోతున్నావు ! నీది రాయి వంటి కరుగని మనసా *కృష్ణా ??*


🌹🙏🌹


*తెగువను జూపగ లేనయ ,*

*తగుమర్యాదలు గలిగిన తరుణిని కృష్ణా !*

*జగడము లాడగ లేనయ*

*తెగడనని యలుసు తగదయ తెలియుము కృష్ణా !*


( 69 )


🌹🙏🌹( భావము )


తెగించి ధైర్యముగా బయటపడలేని దానను .🙏

సరియైన మర్యాదలు గలిగిన భయస్తురాలనైన కోమలిని *కృష్ణా !*🙏


నీతో తగవులు పడలేను అస్సలు .

నిన్ను ఏమీ చెడ్దమాటలు అననని ,నన్ను అలుసుగా చూచుట నీకు తగని పని ! ఇది తెలుసుకో *కృష్ణా !!*🙏


🌹🙏🌹


*కోతులకు బంచ వెన్నను ,*

*నీ తీరది  చిన్న నాడె నిజముగ దెలిసెన్*

*నాతిని నీకై యుండగ,*

*బ్రీతిగ గోకుల వనితలె  ప్రియమయె కృష్ణా !!*


( 70 ) 


🌹🙏🌹( భావము )


అవునులే నీ సుద్దులేమిటో  నీ చిన్ననాడే తెలిసిపోయాయి .🙏


కోతులన్నిటినీ పిలిచి మరీ ముద్దుగా వెన్న పంచావటకదా !🙏


చక్కనైన దానిని నేనుండగా  గొల్లభామలే నీకు , ఇష్టసఖులగుటలో ఆశ్యర్యమేమునదిలేవయ్యా *కృష్ణా !*


🌹🙏🌹


*హరే కృష్ణ ! హరే కృష్ణ !!*🙏


పద్యములు  71 to 80  రేపటి శీర్షికలో .....


మీ ఆశీర్వాదములను కోరుకొనుచూ ..


మీ సూచనలు అభిప్రాయములు సదా స్వాగతిస్తూ ...


భవదీయుడు 

✍ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది*

కామెంట్‌లు లేవు: