యమునానందము
మ: ముదితా! యేతటినీ పయఃకణములన్ మున్ వేణువింతయ్యె నా
నది, సత్పుత్రునిఁ గన్నతల్లి పగిదిన్ నందంబుతో నేఁడు స
మ్మద హంసధ్వని పాటగా వికచ పద్మశ్రేణి రోమాంచమై
యొదవన్ తుంగ తరంగ హస్త నటనోద్యోగంబుఁ గావింపదే.
భాగవతము- దశమస్కం- 778 పద్యం. బమ్మెఱపోతన మహాకవి!
అర్ధములు: తటిని- నది; పయఃకణములు-నీటితుంపురులు; వేణువు- వెదురు (కృష్ణుని చేతిలోని మురళి ) పద్మశ్రేణి-తామరపూల సముదాయము; రోమాంచము-పులకలు; తుంగ-ఎత్తయిన; తరంగములు-కెరటములు; నటనోద్యోగంబు- నాట్యమాడు ప్రయత్నము;
భావము: కృష్ణయ్య బృందావనంలో యమునాతీరంలో భువన మోహనంగా వేణువు నూదుతున్నాడు. అదిచూచి యమునానది ఆనంద నాట్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఉన్నదట! ఇంతకూ యెందుకా ఆనందం? ఆకన్నయ్య చేతిలో ధరించిన ఆవెదురు గొట్టము ,( అదే ఆవేణువు ) చిన్న మొలకగా తన నదీతీరంలో మొలచి , తన నిరు త్రాగి , పెరిగి పెద్దదైనది. దానియదృష్టము యెంతగొప్పదో! చెప్పరానిది. అదికన్నయ్య హస్తమునలంకరించు భాగ్యమును పొందినది. అందువలన యమునకు సత్పుత్రుని గన్నతల్లివలె మనమందు ఆ నందము నిండిపోయినది. (ఆనందవశమున శరీరమున పులకలు మొలచుట యును
నాట్యమాడుకోరికయును గలుగుట సహజము.) యమునానదికిగూడ పద్మ సముదాయములను పులకలు గలిగినవి. నదిలో కెరటములుగాలికి పైకెగసిపడుచున్నవి.
అవి యామెకు హస్తములవలెనైనవి. ఆ యానంద సమయమున నీప్రయత్నములతో యమున నాట్యమాడ ప్రత్నంచు
వనితవలెఁ గన్పడుచున్నదట!
చూచితిరా? పోతన చిత్రించిన యమునానందమును
చైతన్య రహితమైన ప్రకృతియంతయు సచేతనమై పరవశించుచున్న దన్నమాట!
ఆహా! కన్నయ్యా! యెంత భువన మోహనముగా మురళిని మ్రోగించినావయ్యా.! నీమురళీ రవళి పోతనగారి చెవిని బడినది గాబోలును. ఆయన పరవశించి భాగవత పాఠకుల నెల్లరను పరవశింపఁ జేసినాడు. నమోస్తు పోతన కవీంద్రా నీకీర్తి యజరామర మగుఁగాక!
స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి