16, అక్టోబర్ 2024, బుధవారం

*శ్రీ ఆది శంకరాచార్య చరితము41

 _*శ్రీ ఆది శంకరాచార్య చరితము41 వ,భాగము*_

🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑


శ్రీ శంకరాచార్యులు నీలకంఠుని ఉపన్యాస మంతయు విని, 'ఓయీ! మీ విధానము ననుసరించి మీకు తెలిసి యున్నంతవరకు వచించి యున్నారు.అది సత్యం కానేరదు. ద్వైతమునకుఅతీతమైనది, ఉపనిషత్తులలో నిర్వచించిన అద్వైతము సత్యమై యొప్పారు చున్నది. బ్రహ్మాదులు పరబ్రహ్మ ము కంటే గొప్పవారు కారు. పరాపరమైనది ఆ పరబ్రహ్మమే. అట్టి చైతన్యస్వరూపుడైన పరబ్రహ్మమును మహా వాక్యము స్థిరపరచు చున్నది. జీవునకు ఉపాధి యున్నది. కారణమనే ఉపాధి గలవాడు ఈశ్వరుడు అని శ్రుతి స్పష్టముగ తెలుపుచున్నది. కనుక 'తత్వమసి' జీవేశ్వరు లకు అభేదమునే ప్రతిపాదించుచున్నది. ‘తత్త్వమసి’ మహా వాక్యములో ఆ పరమాత్మ నీవు అను అర్ధమును వివరించు టలో విరోధమే కలుగు చున్నది. ఇందులో జీవేశ్వరులను అంగీక రించుట చేత భేదము కనబడు చూనేయున్నది. చైతన్యపదార్థం ఒక్కటే గాని రెండు కాదు. అది నిత్యమైనది. ఉపాధులు కేవలం కల్పితములు. సత్యం కాదు. కనుక ఉపాధులను లెక్కలోనికి తీసుకొని రాకూడదు.


'తత్-త్వం' అనునవి మాటలు రెండైనా అందు విరుద్ధముగ నున్నదానిని విడచి సత్యమైన దానినే గ్రహించవలెను. చైతన్యం సత్యమైనది గనుక దానినే గ్రహించ వలసి యున్నది. ఇక తత్త్వమసి పరమాత్మనే తెలుపుచున్నది. పరమాత్మ ఒక్కటే కాని ఇన్నిలేవు. ఆనాడెచ్చ టనో కాన్పించిన దేవ దత్తుడు ఈనాడు మరియొక చోట కాన్పించినప్పుడు (సోయం దేవదత్తః) ఆతడే ఈతడు అని చెప్పడంలో తేడాయే లేదు. కాల వ్యత్యాస మందును, రూపు రేఖాదులలోను తేడా గలదు. అట్టి తేడాలు ఉన్నంత మాత్రంచేత ఆతడు వేరుకాక పోలేదు. ఆలాగుననే తత్త్వమసి మహా వాక్యం లో తత్ (నేను), త్వం (నీవు) ఈ రెండు పదములకు భేదము లేదు. ‘సోయం దేవ దత్తః' అను దృష్టాంత ము ఇచట ప్రస్తావనకు ప్రసిద్ధము, సమంజస ము. అందులోగల విరుద్దాంశ ములను విడ నాడినచో దేవదత్తుడు ఒకటిగానే ఉన్నాడు. (ఆనాటి దేవదత్తుడు చిన్నవాడు, ఈనాటి దేవదత్తుడు ముసలి వాడు, గడ్డములు, మీసములు వచ్చి నెరసియున్న వాడు, త్వరలో పోల్చుటకు శక్యం కానివాడు) రెండుగా లేడు. తత్, త్వం పదములు వేరై నను జీవేశ్వరులకు భేదం చూపుట లేదు. రెంటికీ తేడా లేకపోవడ మనేది పరమసత్యం' అని సహేతుకముగా వివరించారు.


శ్రీశంకరపాదుల వచనములు నీలకంఠాచార్యు లువిని, 'శంకరాచార్య స్వామీ! జీవుడు కొద్దిపాటి జ్ఞానం కలవాడు. ఈశ్వరుడు సర్వజ్ఞాని. జీవుని రూపంచిన్నది. ఈశ్వరుని రూపం పెద్దది. పైగా వారిరువురి రూపములు కంటికి కన్పించుట లేదు. అందువలన గుణములను బట్టి జీవేశ్వరురులకు భేదా భేదములు నిర్ణయించవలసి యున్నది. కనుక లక్షణములను బట్టి తత్త్వమసి యందు తేడా ప్రబలముగ నున్నది. అందువలన జీవేశ్వరులకు అభేద మనుట మీ వంటి వారికి తగునా?’


అంతట నీలకంఠుని జవాబువిని, శ్రీశంకర పాదులు, 'నీవనుకొన్నది కల్పితం కాని నిజం కాదు. ముత్యపు చిప్ప లోవెండి కనుపించు చున్నది. అది నిజమా? కాదు. అది కేవలం కల్పితం. పరమాత్మ స్వరూపంలో జీవుని రూపం ముత్యపు చిప్ప లోని వెండి వలె కల్పితమేయగుచున్నది. కల్పిత వస్తువు ఒకటి ఉన్నప్పుడు, అకల్పిత వస్తువునకు నిజమైనది ఒకటి ఉండితీరవలెను. జీవేశులు కల్పితము లైనప్పుడు అందుకు నిజమైనది వచించియున్నారు.అది పరమాత్ము నిగా అంగీకరించ వలెను. త్రాడును చూచి పామనుకొన్నప్పుడు త్రాడుని మించి పాము ఎట్లుండునో కల్పితము (త్రాడు) నకు అధిష్ఠానమైనది పామే కనుక జీవేశ్వరు లకు స్వరూప నిర్ణయం చేయకూడదు. 'అల్పుడు, విజ్ఞుడు’ అనడం కేవలం కల్పితమే యగు చున్నది. సద్వస్తువును అందరు అంగీకరించి తీరవలెను. 'దేహాది ఉపాధులు జీవునకు స్వరూపం. దీనికి అధిష్ఠానం పరమాత్మ' అని ఒప్పుకొని తీరవలెను. ఈ కనబడు శరీరము, అందున్న ఇంద్రియములు జడములే యగు చున్నవి. ఈ జడవస్తువులకు అధిష్టానమైనది జీవుడు. అది జీవ స్వరూపంలో ఉన్న చైతన్యం సర్వలక్షణ మైనది; ఏకరూపములో నున్నది; అద్దానినే పరమాత్మ అందుము. ఆ పరమాత్మ స్వరూపమే ఈ జగత్తు. జగత్తు పరమాత్మకు మాయో పాధి. అందువలన అది నిజం కాదు. ఈ జగత్తంతా జడమై యున్నది. దీనికి అధిష్ఠాన మేదియో తెలిసికొన వలసి యున్నది. అదే సత్యవస్తువు. ఆ సత్య వస్తువే పరమాత్మ. జీవేశ్వరులకు

ఉపాధులు కల్పించడమేయని ఇదివరలో చెప్పబడి యున్నది. అది చైతన్యం మాత్రమే. శుద్ధస్ఫటికం వద్ద ఒక ఎఱ్ఱని పుష్పమున్న ప్పుడు అప్పుడా శుద్ధస్ఫటికం ఎఱ్ఱగా ఉన్నట్లే కన్పించును. అట్లా స్ఫటికం ఎఱ్ఱగా కనుపించినా స్ఫటికములో మాత్రం ఎరుపు లేదు. దాని నిజమైన రంగు తెలుపే గదా! అట్లుగనే కల్పించబడిన ఉపాధులను బట్టి చైతన్యం జీవేశ్వరులుగ తోచును. కనుక జీవేశ్వ రులవలె కాన్పించుచున్న చైతన్యమునకు మూఢత్వము లేదు, సర్వజ్ఞత్వము లేదు. అది కేవలం నిర్గుణమే. జీవేశ్వరులకు భేదముందనుకొనువానికి మోక్షం రాదుసరికదా మృత్యువు ప్రాప్తించును. అట్టి వానికి సంసారసాగరం తప్పదు. జీవేశ్వరులకు భేదం లేనట్టి వారికి మోక్షం కలుగుచున్నది. ఇట్టి విధముగ శ్రుతులు తెలుపు చున్నవి. జీవేశ్వరులకు భేదము కన్పట్టుచుండిన వానికి తత్త్వశాస్త్ర శ్రవణం లేదన్నమాట. చంద్రుడు ఆకసమున కాస్త గోచరించును. బహుదూరమందుండుట వలన అట్లు చిన్నదిగ కాన్పించుట భ్రమ మాత్రమే.


విచారించగ చంద్రుడు చిన్న  వాడు గాడని తేలుచున్నది. అట్లుగనే 'నేను శివుడనుగాను' అను కోవడం భ్రమ మాత్రమే యగుచున్నది. ఈ భ్రాంతి పోవలయు నన్న వేదాంత తత్త్వ విచారణ చేయవలెను. భ్రాంతి సత్యంకాదు కదా! కనుక 'తత్త్వ మసి' జీవేశ్వరులకు భేదము లేదనునది సత్యమే యగుచున్నది. అంతట నీలకంఠుడు, 'శంకరా! కపిలుడు మొదలయిన మహర్షులు జీవుని స్వరూపమును, ఈశ్వరుని స్వరూపమును బహు స్పష్టముగ వివరించి యున్నారు. వారిరువురికి ఉండు భేదమును గూడ బాగుగ వివరించి నిరూపించి యుండగ తాము దానిని వ్యతిరేకించి, రెండూ ఒకటే యనుచున్నారు. పదుగురాడు మాట పాడియై చెల్లవలెను గదా! మీ ఒక్కరి మాట నేనెట్లు ఒప్పుకొన గలను?' శ్రీశంకరా చార్యులంతట, నీల కంఠాచార్యుని సంశ యము నివారణ చేయ 'శ్రుతులకు, స్మృతులకు విరోధము వచ్చినపుడు శ్రుతి వాక్యమునే అంగీకరించవలెను. దుర్బలమైన స్మృతివాక్యం అంగీకరించకూడదు. ఇదే న్యాయము. కపిలుడు మొదలయిన మహాత్ము ల వాక్యములకంటె 'తత్వమసి' బలమై యున్నది అని తెలిపారు. 


'తత్త్వమసి' బలమై యున్నది'  అనితెలియ జెప్పిన శంకరులతో,  నీలకంఠాచార్యులు, 'శంకరాచార్యా! వేదములకు విరోధముగ నున్న స్మృతి వాక్యములు విడిచిపెట్ట మనడంలో సబబు గాన రాదు. మహర్షుల పలుకులు యుక్తియుక్తమై యున్నవి. అవి వేదములతో సమముగా నుండును. కనుక మహర్షుల వాక్యములు వృథా అనడం పాడి గాదు. జీవుడు సుఖము వేరుగను, దుఃఖము వేరుగను అనుభవించుచున్నాడు. అందులో ఒక జీవుడు సుఖమును, ఒక జీవుడు దుఃఖమును అనుభవించు చుండుట అందరు ఎరిగినదే! అందరు సుఖంగా ఉండుట లేదు. ఈ శరీరములలో ఉండు జీవాత్మలు వేరుగను చాలగను ఉంటున్నవి. ఆత్మఉన్నపుడు  అలాజరుగదు. కనుక ఆత్మలు కూడ అనేకమని తేలినది. లేనిపక్షమందు లోకమందు జరుగుచున్న వ్యవహారములన్నియు ఒకేరీతిని ఉండవలెను.


అందుకనే మహర్షుల లందరు ఒకటి కాదని నిశ్చయించారు. ఒకే ఆత్మ అయిననాడు అంతా దుఃఖముతో నైనను ఉండ వలెను. లేకున్న అందరు సుఖముగనైనను ఉండవలెను. అలా ఉంటున్నారా? ఒకరిని సుఖీ అని, వేరొకరిని దుఃఖీ అని అనుచున్నా రెందుకు? ఒకరికి ముక్తి వచ్చిన అందరికీ వచ్చును. ఇదంతా అందరు ఎఱిగినదే. కాదనుటకు ఎవరును లేరు. యతివర్యా! ఇది యటుండ వేదాంతులు ఆత్మను, 'అకర్త, అభోక్త' యనుచున్నారు. కర్త అయినను, భోక్త యైనను అంతఃకరణమే యనుదురు. ఇవి ఆత్మకు లేవనుచున్నారు. జీవునకు చైతన్య మున్నది గనుక కర్త, భోక్తగూడ అతడే. అంతఃకరణము జడము, జ్ఞానము లేనిదియును. అట్టి దానిని కర్త, భోక్త యనుట సమంజస ముగలేదు. యతీశ్వరా! మరొక్క విషయమును తెల్పెద నాలకించుము! మోక్షము సుఖము నిచ్చునని తెలుపు చున్నారు. లోకములో ఎక్కడ జూచినను సుఖమున్నచోట దుఃఖమే కనుపించు చున్నది. సుఖము, దుఃఖమును వెంట బెట్టుకొనియే యున్నది. ఆలోచింపగ సుఖము సుఖము కాదనియే తేలుచున్నది. విష మిళితమైన ఆహారము నెట్లు విసర్జించవలెనో సుఖము నావిధముగనే విడిచిపెట్టవలెను. సర్వ దుఃఖములు నాశన మైన నాడే మోక్షం లభించునని మేము తెలుపుచున్నాము. మీరు మాటాడునది మోక్షము కానేరదు’. 


అంతట శంకరాచార్యు లు, ‘పండితోత్తమా! సుఖమునైనను, దుఃఖమునైనను పొందునది మనసే. మనస్సున కట్టి ప్రభావము ఉన్నది. అది ఇంకను బహు విచిత్రమైన ప్రభావం గలది. ఆత్మకు అట్టి ధర్మములు లేవు. అంతఃకరణములు తేడాగా నుండును గాని ఆత్మ కట్టి ధర్మములు లేవు. ఆత్మ ఒక్కటియే. స్థూల,సూక్ష్మ శరీరములు రెండును జడము లయినను చైతన్య సంయోగము కర్తృత్వ మును కలుగజేయు చున్నది. చైతన్య సంయోగము లేనిచో ఇంద్రియములు కదలనే కదలవు. సూర్యుని కాంతితో ప్రాణులన్నియు తమతమ దైనందిన వ్యాపారములు ఎట్లు నిర్వర్తించుకొన గలుగు చున్నవో ఆ సూర్యుడు అందరికీ ఎట్లు సాక్షీ భూతుడుగ నుంటున్నాడో ఆత్మ సూర్యుని వలెనే సాక్షియై వెలయుచున్నాడు. వెలుగునిచ్చు చున్న సూర్యునకు కర్తృత్వం లేదు. సాక్షీభూతుడైన ఆత్మ కును కర్తృత్వ భోక్తృత్వములు లేవు. చైతన్యములేని శరీరములను శవము లందురు. సుఖము లన్నియు దుఃఖములతో కూడి యున్న వనునది సత్యము. ఐతే అది మామూలుగ జరుగుచున్నపని. అసలు సుఖమనగ దుఃఖము లేనిది. ఆనందముతోగూడినది బ్రహ్మసుఖము. అది ఎక్కడో లేదు, తనలోనే యున్నది. అది దేని వలన కలుగునది కాదు. దుఃఖం

నశించినంత మాత్రమున మోక్షము రానేరదు. స్వానుభవం వలననే బ్రహ్మసుఖం కలుగును. వచ్చినది ఎన్నటికీ పోదు. అది అనంత మైనది' అని నీలకంఠా చార్యుల పూర్వపక్షములన్నియు ఖండించి, ఆయన అనుమాన పిశాచములను పార ద్రోలి, పరమ ప్రమాణ ములతో ద్వైతమును కాదని అద్వైతమతము  స్థాపించారు. అంతటితో నీలకంఠాచార్యులు చెప్పునది లేకపోయెను.


శ్రీశంకరాచార్యులు నీల కంఠుని చేతిలో ఓడిన పోవడం నిశ్చయమను కొన్నవారు నిస్పృహ జెంది శ్రీజగద్గురువుల అఖండ ప్రజ్ఞకు అబ్బుర పడిరి. ఆవార్త దేశమంతట వ్యాపించినది. ఆ క్షణమందు శిష్యులు కూడ, నీలకంఠునితో పాటు ద్వైత భావమును వీడి శైవ భాష్యమును శ్రీశంకర పాదుల కర్పించి పాదాక్రాంతులై శిష్యులు అయ్యారు.


నీలకంఠాచార్యుల గురువు ఉదయనా చార్యుడు. ఆయన అద్వైతమతమును వ్యాప్తి చెందకుండ అణగద్రొక్క నెంచిన వారలలో ఉద్దండుడు. శిష్యులు, ప్రశిష్యులు శ్రీశంకరపాదులకు శిష్యులైనారనిన వార్త విని, అడలిపోయి నిర్వీర్యుడై ఆహారం సహించక శల్యగతు డయ్యాడు.


స్వామి ఆ ప్రాంత మంతయు అద్వైత మత స్థాపన జేసి మరికొన్ని దినములకు ద్వారకా నగరమునకు ప్రయాణ మైనారు.


*కాలడి శంకర కైలాస శంకర*

*శ్రీ ఆది శంకరాచార్య చరితము 41వ, భాగము సమాప్తము*

కామెంట్‌లు లేవు: