16, అక్టోబర్ 2024, బుధవారం

*శ్రీ ఆది శంకరాచార్య చరితము45

 *శ్రీ ఆది శంకరాచార్య చరితము45 వ భాగము*

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️


*సర్వజ్ఞపీఠ దక్షిణ ద్వారము:*


ఆనాటి ఉదయముననే గంగానదీ పవిత్ర జలములలో శ్రీశంకరాచార్యులు స్నాన మాచరించి నిత్య అనుష్ఠానము ముగించుకొని శాంతమూర్తియై మందహాస వదనుడై యుండుట పద్మపాదాది ప్రముఖ శిష్యులు చూచి వందనపూర్వకంగా 'ప్రభో! ఈ భరత ఖండములో వాయవ్య దిశగా ప్రఖ్యాతి చెందిన కాశ్మీర దేశములో శారదా పీఠమునకు నాలుగు మండపములు గలిగి నాలుగు ద్వారములు ఉన్నవట. దానినే సర్వజ్ఞ పీఠమని అంటారు. సర్వజ్ఞులైన వారలు మాత్రమే ఆ పీఠముల నధిరోహించుటకు అర్హులని చెప్పుదురు. దాని కున్న నాలుగు ద్వారములు నలుదిక్కు లకు నాలుగు ముఖములుగ అమర్చబడి యున్నాయి. తూర్పు ద్వారపీఠము తూర్పు దేశమును, పశ్చిమ ద్వార పీఠము పశ్చిమ దేశమును, ఉత్తరద్వార పీఠము ఉత్తర దేశమును, దక్షిణద్వార పీఠము దక్షిణ దేశమును రక్షించునని ప్రతీతి. ఏ దిశనున్న పీఠమును ఆ దేశస్థుడైన సర్వజ్ఞుడే అధిరోహించ వలెను. ఏ పీఠాధిపతి యైనను లేకున్న ఆ పీఠద్వారము మూసి వేయబడును.ఎంతో కాలము నుండి దక్షిణ ద్వార పీఠమును పరిపాలించువారు లేక మూయబడియున్నది. అందుచేత దక్షిణదేశ పరిరక్షణ లేకున్నది. అది దాక్షిణాత్యులకు అవమాన కరము కాదా? దాక్షిణాత్యులలో సర్వజ్ఞుడు పుట్టలేదని దాని అర్థం. ఈ పరిస్థితిని చక్కచేయు భారము తమయందు గలదని నివేదించు వారము' అని ప్రోత్సహించారు.


*పీఠారోహణ పరీక్ష:*


విశాలహృదయం గల వారలకు విశ్వమే కుటుంబమగును. అట్టి వారు తన కుటుంబ అవమానమును భరించగలరా? కాశ్మీరదేశమందు గల సర్వజ్ఞపీఠ దక్షిణ ద్వారమును తెరచి దాక్షిణాత్యుల అవమానము రూపుమాపుటకు నిశ్చయించారు శ్రీ ఆచార్య స్వామి. ఆయన కష్టసుఖముల నెఱుగని ధీరుడు. జయాపజయ ములను ఆయన యెఱుగడు. ఎన్ని భరించిను తనవారి బాధలుమాత్రం భరించెడి వాడు కాడు. అదే ఆయనలో గర్భితమై యున్న విశ్వప్రేమ. మత్తేభములను మించిన అద్వైతతత్త్వజ్ఞులు, సింహ శార్దూలములను క్రుంగదీయు విజ్ఞులు శ్రీశంకరాచార్య శిష్యగణ మందు లెక్కకు మిక్కిలిగా నున్నారు. లంకాపతిని సంహరించుటకు నరకులపతి తోడ కపికులపతి, కపికులములు వెంట నంటినట్లు శ్రీశంకర శిష్య గణము శ్రీగురు దేవుల ననుసరించి, జయజయ ధ్వానములు సల్పుచు ఆనందవారాశిలో మునుగుతూ కాశ్మీరమునకు పయనమై పోవుచున్నారు. కొలది దినములకు కాశ్మీరదేశం జేరుకొని సర్వజ్ఞ పీఠ ప్రదేశమును తెలిసి కొనిరి. సర్వజ్ఞపీఠ దక్షిణ ద్వారము తెరచుటకు అనేక అవరోధములు గలవని ప్రతివాదులు చెప్పగా విన్నారు. తెలుపబడిన అడ్డములు అవరోధములు గావని నిశ్చయించి మొదటి అడ్డమునుజేరుకొన్నారు. అచ్చట, 'ఎవరయ్యా మీరు? మహా ఒడిదుడు కుగ వస్తున్నారు? ఆగండి! చాలమంది రావడం, వెళ్ళడమైంది. ఇక్కడ ఒక పరీక్ష గలదు. అందు నెగ్గివెళ్ళాలి. నీకేమైన మా పరీక్షకు తట్టుకొను ధీమా ఉన్నదా? ఉంటే మాపరీక్షకు సిద్ధపడు! మా సర్వజ్ఞ పరీక్షలో నెగ్గినప్పుడు మార్గావరోధం లేకుండ చేస్తాము' అన్నారు అచ్చట ఉన్న ప్రతివాది బృందము. 


శ్రీజగద్గురువులా పలుకు లాలకించి, ఓహో! అదా మీఅభ్యంతరం! మీరడిగే దేదోఅడగండి. నేనందులకు సిద్ధముగ నుంటిని’ అన్నారు. ప్రతివాదులు 'మిమ్మల్ని పరీక్షించు వారు రానై యున్నారు. తొందర పడకుడు. వారు వచ్చుదనుక కొలది సేపు ఇచ్చట విశ్రమిం చండి' అని శ్రీశంకరులను ఆపుజేసిరి.

శ్రీశంకరులరాక అందరికీ  తెలిసినది. వారందరు శ్రీఆచార్యస్వామిప్రభావం వినిన వారుకాదు. పరీక్షా ధికారులకు వర్తమానం పంపగా కఠినపరీక్ష జరుపుటకుఆయత్తపడుటతో వేళ తప్పినది. అంతవరకు సమీపంగా  ఉన్న ఒక దిబ్బమీద శ్రీ ఆచార్య దేవులు విశ్రమించారు. ఆ మిట్టను 'శంకరమిట్ట' యని పిలుస్తారు. కాణాద మతమునకు చెందిన పరీక్షాధికారి వచ్చిశ్రీ శంకరులను పరీక్షకు పిలచెను. అంతట ఈ దిగువరీతిని పరీక్ష జరిగింది.


కాణాదుడు: ఏమయ్యా! నీవేనా పరీక్షకు వచ్చావు? బాగున్నది! మా మతరహస్యములను ఎఱుగుదువా? లేక పారి పోతావా?


*శంకరాచార్యులు: సంశయమేల?*


కాణాదుడు: పారిపోవుటకా?

శంకరాచార్యులు: మిమ్ములను జయించుటకు!


కాణాదుడు : సరే! షడ్భావములు చెప్పగలవా?


శంకరాచార్యులు: ద్రవ్య, గుణ, కర్మ సామాన్య, విశేష,సమవాయము లను నారింటిని కాణాద మత మందు షడ్భావము లందురు.


కాణాదుడు: సంయోగం పొందిన పరమాణు ద్వయము నుండి సూక్ష్మమైన అణుద్వయం ఉత్పన్నమైనదని మామత మందు గల రహస్యము. ఆద్యణుక మును ఆశ్రయించు కొని మహా సూక్ష్మమైన అణువు దేనివలన జనించుచున్నది?


శంకరాచార్యులు: అదియా! చెప్పెద వినుడు! ద్విత్వసంఖ్యలే అందుకు కారణము.


కాణాదుడు : స్వామీ! సర్వజ్ఞత్వం తమకే గలదు! తాము విజయ మును సాధించిరి. సర్వజ్ఞ పీఠము నధిరో హించుటకు సమర్ధుల య్యారు.


కాణాదులట్లు ప్రకటించుటతో అచ్చోటనున్న వారందరు జయజయ ధ్వానములు మిన్ను ముట్టునట్లు గావించారు. ప్రధమ అవరోధము ఈ విధముగ లీలగ దాటిపోవుచుండ కొంత ఉదవ్వేగు నప్పటికి, నైయాయకుడడ్డు తగిలి, ‘ఆచార్య స్వామీ! తమ ప్రభ కొంచెం విన్నాను. కాణాద మతస్థులను జయించారట! బాగున్నది! కాని మా మతమును గురించి పరీక్షనిచ్చి అందుత్తీర్ణులై ఈ గట్టు దాటవలెను.


శంకరాచార్యులు: కానిండు


నైయాయికుడు :కణాద ముని మతము (కాణాదము)నకును, గౌతమ మతమునకును ముక్తి విషయమందున్న భేద మేమున్నదో చెప్పండి!


శంకరాచార్యులు: గుణ సంబంధము నాశనమయినగాని ముక్తిరాదు అందురు కాణాదులు. గుణసంబంధము నాశన మయినను అందు జ్ఞానముండి యుండ వచ్చును. అట్టిస్థితినే మోక్షమనుచున్నారు గౌతమ మతస్థులు. ఇరు మతములలో గుణనాశము, ఆకాశ సదృశస్థితి సమాన ధర్మములు.


(1) గౌతమ మతమందు 'జ్ఞానము కలిగియుండ వలె'నన్నది హెచ్చుగ నున్నది.

(2) ఈ రెండు మతములలోను పదార్థ భేదము సమానము. పరమేశ్వరుడు నిమిత్త కారణం గలవాడని ఇరుమతముల వారు అంగీకరిస్తారు.


నైయాయికుడు : బాగుగా చెప్పితివయ్యా! చాల దిట్టవలె కన్పట్టు చున్నావు. సర్వజ్ఞుడ వైతివి! సర్వజ్ఞ పీఠాధి రోహణకు వెళ్ళుమా!


అట్లు రెండవ అడ్డమును తొలగించుకొని ముందుకు జనునంత సాంఖ్యులడ్డు తగిలి పరీక్షనిచ్చి, తృప్తిపరచమనిరి. అందులకు ఆచార్య స్వామి సంసిద్ధుడే కదా!

సాంఖ్య పరీక్ష -


సాంఖ్యుడు: శంకరాచార్యస్వామీ! మూలప్రకృతి స్వతంత్రముగ జగత్కారణ మగుచున్నదా? లేక పరమాత్మ నాశ్రయించి జగత్తునకు కారణమగు చున్నదా?


శంకరాచార్యులు: మూలప్రకృతి సర్వ జగత్కారణమని సామాన్యముగ అందరనేమాట. సాంఖ్యులు గూడ అట్లే పలుకుదురు. వేదాంతులట్లు గాక అస్వతంత్రముగ జగత్కారణ మగుచున్నదని తెలుపుదురు. అయితే పరబ్రహ్మమేసర్వమునకు కారణమని న్యాయ ధర్మము.


సాంఖ్యుడు: యతీశ్వరా! మీ సమాధానము మమ్మెంతో సంతస పరచినది. ఇంక నీ ఇచ్ఛ చొప్పునపోయి సర్వజ్ఞ పీఠము నధిరోహించ నగును. సర్వజ్ఞుడవు! శెలవిండు!


ముందుకు చరచర పోవుచుండగా శ్రీశంకరులకు బౌద్ధుడు  అడ్డు తగిలి,


'ఏమయ్యా! శంకరా చార్యా! ఆ వేగం తగ్గించు! చాల అడ్డములు దాటి వస్తివి. అవన్నియు అడ్డములు కావు. మా అడ్డమే గడ్డు! ఆగి, మా పరీక్షకు సమాధానములు పలికి మమ్ములను తృప్తిపరిచి మరీ పోవలెను.


శంకరాచార్యులు : మీ యభీష్ట మేదియో వివరించండి.


బౌద్ధపరీక్షాధికారి: యతీశ్వరా! బాహ్య పదార్ధములెన్ని? అవేవి?


శంకరాచార్యులు: సౌత్రాంతకములు, వైభాషికములను రెండు తెరగులనున్నవి.


బౌద్ధపరీక్షాధికారి: ఆ రెండింటికి గల భేదమేమి?


శంకరాచార్యులు: సౌత్రాంతికములో వేద్య జాత మంతయు అనుమాన గమ్యముగ జెప్పబడియున్నది. ఈ రెండు వైభాషికము ప్రత్యక్ష ప్రమాణముగ చెప్పబడి యున్నది. ఈ రెంటికి క్షణ భంగురత్వం సమానమని చెప్పబడు చున్నది.


బౌద్ధపరీక్షాధికారి: మా విజ్ఞానమునకు వేదాంతుల విజ్ఞానమునకు గల భేదము చెప్పగలవా?


శంకరాచార్యులు:విజ్ఞానములో క్షణికత్వము, బహుత్వము ఉన్నదని మీ విజ్ఞాన వాదు లందురు. జ్ఞానము ఏకత్వమని స్థిరత్వము గలదియని వేదాంతుల నిశ్చయము. ఇదియే వారిరువురకు గల తారతమ్యము.


అని వివరించుటతో బౌద్ధపరీక్షాధికారి మెచ్చి తన అభ్యంతరము తొలగించెను. అంతట శ్రీ జగద్గురువులు ముందునకు పోవుచుండ జైన మతస్థుడడ్డు తగిలి పరీక్షలిచ్చి అందుత్తీర్ణుడై జనుమనెను.


జైనుడిటుల ప్రశ్నించెను.


‘యతీశ్వరా! మీకు తెలియని రహస్యము లుండవు. ఈ ఒక్క రహస్యమును బహిర్గత మొనరించండి. అదినిజ మైనచో మీ మార్గమున కవరోధముండదు.


శంకరాచార్యులు: కానిండు.


జైనుడు: అస్తి కాయ శబ్దము వివరించుడు!


శంకరాచార్యులు: జీవాస్తి కాయము, పుద్దలాస్తి కాయము, ధర్మాస్తి కాయము, ఆకాశాస్త్రి కాయము, కాలకాయము అనునవి అయిదు. ఈ పంచాస్తి కాయములు మీ మతమందు ప్రధానము.


అంతట జైన మతస్థులు శ్రీ శంకరాచార్యుల యెడ అపరిమితం ఆనందము ప్రకటించుచు జయజయ ధ్వానములు గావించిరి.


దారి ఇచ్చుటతో శ్రీ ఆచార్యస్వామి ముందునకు సాగుచుండిరి. అంతలో  నొక జైమిని మతస్థుడు ప్రత్యక్షమై,


జైమినీయుడు: మాకు వేదము ప్రధానమైనది. ఎరుగుదువా? మేము జైమినీ మతములోని వారము. మా మతము నందు శబ్దస్వరూపమేది? ఆ శబ్దము ద్రవ్యమా? గుణమా? చెప్పి దాటుము!


శంకరాచార్యులు: అకారాది అక్షరములు అంతటా వ్యాపించి యున్నవి. ఇవి చెవులకు మాత్రము వినబడునవి. ఈ అక్షర సముదాయము గుణము కాదని ద్రవ్యమేయని మీ మత స్థులనుచున్నారు. ప్రళయము వచ్చినను శబ్దములు నశించవు. వేదములు గూడ నిత్యము గావని వేదాంత ములోని మాట. పరమాత్మ ఒక్కడే నిత్యమైన వాడు. ఉపనిషత్తులు గూడ పరమాత్మ జ్ఞానం కలిగిన తరువాత సచ్చిదానంద పరబ్రహ్మమే నిత్యమైనది, మిగిలిన వన్నియు కనబడునవి యగుటచే నాశంకలవియగుచున్నవి. ఇది వేదాంత మతము యొక్క పరమ రహస్యము.


జైమినీయుడు: శ్రీశంకరాచార్యా! ఇంతటితో మీ సర్వజ్ఞత లోకమునకు వ్యక్తమాయెను. ముందు మీకడ్డములు లేవు. ఇదియే ఆఖరి పరీక్ష.


మహానుభావా! మీ మహిమ వర్ణించ ఈనాటివారి తరమా! ఆచారముననుసరించి పరీక్ష జరుప బడినదిగాని మిమ్ములను పరీక్షించ మా తరమా! ఈ క్షణము లోకమునకుపండుగైనది .( పండగ అయింది )


అంతలో పద్మపాదుని చేయి పట్టుకొనియుండ,,వారల కిరుపార్శ్వముల యందు వింజామరలు వీచుచుండిరి. ఛత్రముల పట్టి బహుపరాకులు  పలుకుచుండగ శిష్య,ప్రశిష్యులు జయజయ నినాదములు భూన భోంత రాళములలో ప్రతిధ్వ నించుచుండ శ్రీశంకరావతార మూర్తి చిద్విలాసుడై సర్వజ్ఞ పీఠాధిరోహణకు నిరాటంకముగ జనుచున్నారు.


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ ఆది శంకరాచార్య చరితము 45 వ భాగము సమాప్తము*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: