16, అక్టోబర్ 2024, బుధవారం

*శ్రీ ఆది శంకరాచార్య చరితము43

 *శ్రీ ఆది శంకరాచార్య చరితము43 వ భాగము* 

🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄


అర్హుడను జైనుడు:

శ్రీశంకరాచార్యస్వామి శిష్య గణంతో బాహ్లికదేశమందు ప్రవేశించి శిష్యులకు తాము రచించిన భాష్యములను బోధించుచుండిరి. జైనులువచ్చి శ్రీశంకర పాదుల బోధలు వినుచుండెడివారు. కాని అవి వారికినచ్చి యుండలేదు. జైనమతము 'అర్హత' మనుపేరుతో వ్యవహరింప బడుచున్నది. ఒకనాడు అర్హుడొకడు శ్రీశంకరులను సమీపించి 'మా మతవిధా నము తమరొక్కసారి వినిన మీ మతమును విడిచి మా మతమును స్వీకరించగలరు! అప్పుడు మాకు శిష్యుడవై వెలుగొంద గలవు!' అని మెల్లగ వచించెను. అంతట శ్రీ శంకర పాదులు సప్త పదార్ధ ములెట్టివో వివరించ మనగ అర్హతుడు, ‘సప్తపదార్ధ విజ్ఞానముండిన గాని మోక్షము లభించదని మా మతము గాఢవిశ్వాసము గలది. ఆ సప్త పదార్ధములను సప్తభంగిచే నెఱుగవలెనను నియమముతో గూడినది మా అర్హమతము' అనివివరించి సప్తపదార్ధ వివరణము, సప్తభంగి తెఱగులు విశద పరిచెను. అంతట శంకరుడు జీవాస్తికాయము ఎట్టిదని ప్రశ్నించారు. అర్హతుడంత, 'జీవుడు దేహతుల్య మానముతో గూడి ఎనిమిది రకములైన కర్మలచే బద్ధుడైయున్నా' డనెను. అంతట శ్రీశంకర పాదులు, 'ఓయీ! శరీర పరిణామకుడైన జీవుడు మహత్తుకానేరడు.అణువుగూడ గాడు. ఘటాదులు గూడ మహత్పరిణామం గాని అణు పరిమాణం గలవి గావు. జీవుడే విధముగను రెండునుగాడు. జీవుడు మధ్య పరిణామం గలవాడు. శరీరములు చిన్న, పెద్ద, పొట్టి, పొడవుగ నుండుచు ఒకేస్థితిలేకున్నవి. మానవ జీవుడు చనిపోయిన తరువాత మానవ శరీరమును విడచి ఏనుగు శరీరమును ప్రవేశించినపుడు ఆ గజశరీర మంతటను వ్యాపించ గలడా? మానవ శరీరమెంత పరిణామం గలిగి యుండునో ఆ కొలతను బట్టి అంతవరకే గజశరీరమందిమిడి యుండి మిగిలిన గజశరీరము నిర్జీవముగ నుండవలెను. అట్లే తేనెటీగ శరీరమును ప్రవేశించినపుడు తేనెటీగ యంత పరిమాణమే ప్రవేశించి తక్కినది బయట నుండవలెను. అట్లు జరుగు చున్నదా? లేదు. కావున జీవుని పరిణామం నిశ్చితమైనది' అని శంకరులు ఖండించగ అర్హతుడు అనేక విధముల తన మతమును ప్రతిష్ఠించుటకు ప్రయత్నించి విఫలుడ య్యెను. శ్రీశంకరులు మరియొక విషయమును గురించి తెలిసికొన గోరి, ‘అర్హతుడా! ఆత్మావ యవములు చేతనములా? అచేతనములా? చేతనము లనియెదవా అప్పుడవి పరస్పరవిరుద్ధ భావములు గలిగియుండి ఐకమత్యం లేకపోవుట వలన శరీరమును బాధించుచున్నవి. లేక జడము లనెదవా మానవ దేహ పరిమితి గలవాడు జీవుడైనందున పూర్తిగా శరీరమును చైతన్యవంతం చేయజాలక పోవును గదా! ఇంక అవయవములలో చైతన్యం లేకున్నచో వృద్ధి క్షయములుండవు' అని విషయమును అందిచ్చెను. అర్హతుడదివిని, 'యతి వర్యా! గుఱ్ఱముల నేకములుగ నున్నను ఒకే విధముగ ఐకమత్యంతో రథము నెట్లు లాగుకొని పోవుచున్నవో ఆత్మావయవములు అనేకములుగ నున్నను చైతన్యం పొంది పరస్పర విరోధభావం లేకుండ ఈ శరీరమును నడుపుచున్నవి అందువలననే శరీరావయవములు శత్రుత్వం లేకుండ వృద్ధి నొందుచున్నవి. అదే విధముగ తగ్గుచున్నవి అని సమాధానమిచ్చెను. శ్రీశంకరాచార్యస్వామి విని, ‘అర్హతుడా! రథమును గుఱ్ఱములనేకము గలసి శత్రుత్వం లేకుండ సంఘీ భావంతో ఒకేసారి లాగుచున్నవని వచించితివి. అది బాగున్నది. అట్లా గుఱ్ఱములు లాగుటకు కారణము వేరుగ నున్నది. తోలువాడే కారణుడు. రథమును నడిపే చాకచక్య మంతయు రథసారధి యందు మాత్రమే గలదని తెలిసి కోవాలి. కావున చేతనా  మయమైన శరీరము రథమును బోలి యున్నది. సారథి లేకున్న గుఱ్ఱములు విరోధంలేక సంఘీభావంతో ప్రవర్తించలేవు గదా! అదే విధమున సారథి అనే ఆత్మలేకున్న అవయవములు పనిచేయజాలవు. ఆత్మావయవములు ఆత్మ కన్న వేరుగలేవు, అందు వలన గమనా గమనములు కలుగుచున్నవి. కావున ఆత్మ నిత్యము కాదందు వేమొ ఆత్మకు ప్రత్యేకత కలదని తెలిసికొనుము.జీవావయవములు పెరిగేవి, తరిగేవి కావు. ఏనుగు దేహములోజీవుడు ప్రవేశించుటతో జీవావయవములు వృద్ధి జెందు చున్నవి. కీటకాదులలో సంకోచము నొందుచున్నవి. జలగ తనకు అవసర మగునపుడు సాగు చున్నది. అవసరం లేనప్పుడు కురుచయగు చున్నది. అట్లుగనే జీవుని పరిమాణం నియమితమై యుండుటలేదు. జీవుని అవయవములు వృద్ధిక్షయ ములు నొందుచున్నవనినను ఈ జీవావయవములు విస్తరించడం, ముడుచుకొని పోవడం అనునవి జెందుచున్నవి. అదే విధమున ఘటాది పదార్ధములు మారుపాటు జెందే స్వభావం గలవి యగుటచే నిత్యములు గాక నాశమొందు విధమున జీవావయవములును నశించే స్వభావం గలవియే యగుచున్నవి. అందుచే జీవునకు నిత్యం లేక ఆత్మ గూడ నశించగా సంచిత ప్రారబ్ధ ఆగాములను దోషములు సంభవించుచున్నవి. జీవుడు నిత్యత్వం కానందున పూర్వజన్మ కృత పాపకర్మ ఫలితములు ఈ జన్మలో సంభవించక పోవలసి యుండును. ఇది కృతనాశ దోషమగును. అట్లయిన ఈ జన్మలో చేయబడిన కర్మఫలితం సంభవించక క్రొత్త కర్మాను భవమే కలుగ వలెను. ఇది చేయని కర్మ ఫలితమును అనుభవించుట యగును. జీవుడు నిత్యుడు గాకున్నచో చేసికొన్న కర్మల వలన సంసార సముద్రములో మునిగిపోవు జీవునకు ఆనపకాయ బుఱ్ఱ నీటి మీద తేలియాడు మోక్షం రానేరదు. బంధమైనను మోక్షమైనను జీవునకే ఉన్నవని జెప్పవలెను. జీవుడు నిత్య మైనచో కర్మలున్నప్పుడు బంధము గల వాడగుననియు, ఆ బంధము లేకపోయిన ముక్తుడగునని చెప్పవీలు గాదు.


కర్మలు నిత్యం కానట్లే జీవుడు గూడ నిత్యుడు గాకున్నచో మోక్ష మెవరికి కలుగును? కావున మీ మతమందు అతీతమైన ముక్తి నిత్యం గాని జీవునకు అంట గట్టడం ఏలా శక్యమగునో అగమ్యగోచరము! కాబట్టి జీవునకు సంకోచము, ముకుళితము ఉన్నవనుట ఎన్నటికిని అంగీకరింప వీలులేదు. కావున మీ విధానములన్నియు పర స్పర విరోధములు గలవి యగుటచే అవి పరమాత్మను పొందుటకు సాధనములు గాజాలవు' అని గంభీరోపన్యాస మిచ్చారు. అంతట జైనులు, అర్హతులు గర్వములుడిగి  వారై  శ్రీ శంకరాచార్య స్వామికి పాదా క్రాంతు లయ్యారు. అట్లు విజయుడై నైమిశారణ్య పుణ్య భూములకు వెళ్ళారు. ఆ ప్రాంతమందు గల దరద, భరత, శూరసేన, కురు, పాంచాల మొదలగు దేశములందున్న పండితులు శ్రీశంకరపాదుల దివ్య దర్శనం చేసికొనిరి. వారి నందరిని ప్రస్థానత్రయ భాష్య ప్రభావముతో జయించి అద్వైతులను జేసి అసమాన ప్రతిభను ప్రదర్శించి ప్రఖ్యాతి వడసిరి.


పిమ్మట శ్రీహర్షుడను మహా పండితుడు సకలశాస్త్రములలోను నిధియై, అజయుడై మహా గర్వముతో వెలయు చుండెను. అట్టివానిని గురువైన ప్రభాకరుడు కుమారిలభట్టు ఓడించ లేక పోయిరి. కాని వానిని శ్రీ శంకరాచార్యులు తమ వశం జేసికొన్నారు. పిమ్మట కామరూప దేశస్థుడైన అభినవ గుప్తుడను శాక్తేయుడు శ్రీశంకరులకు శిష్యుడయ్యెను. అదెట్లనగా :


*అభినవగుప్తుడు:*

కామరూప దేశమందు అభినవగుప్తుడను శాక్తేయు డొకడుండెను. ఆతడు వారి మత గ్రంథమునకు భాష్యరచన చేసినగ్రంథకర్త. అతడు శ్రీశంకరాచార్యుల అఖండ ప్రభావం విని క్రుంగి దారి తెన్నులు గానకుండెను. శ్రీశంకర పాదుల చేతులలో ఓడిపోవడం స్థిరమను కొనెను.ఆతడిటుల తలపోసెను.' వేదమనినను దాని భావమనినను శంకరులకు మంచినీళ్ల ప్రాయము. వేదబాహ్య మతములను ఆయన అంగీకరించడు. అట్టితరి ఆయనను కాదనుటెట్లు? త్రిమూర్తులు సాయమైనను వాదమందాయనను ఓడించుట కడు దుర్లభం. ఆయన కత్తికి అడ్డులేదు. కొమ్ముటేనుగులు ఆయన కడ క్రుంగిపోయినవి. శ్రీశంకర దివ్యతేజమునకు జడిసి భల్లూకములు పారిపోయెను. త్రిలోకములందు  ఆయనకు సాటియైనవాడు కానరాడు. ఆయనను జయించుటకు వేరు మార్గములేదా! నా మంత్ర ములు తంత్రములు వృథా కావడమేనా?


నా మతస్థులను శిష్యులను విడచి ఒక్కణ్ణి విడి పోయిన లోకం హర్షించ గలదా! శ్రీశంకరులతో వాదించి ఓడిపోవుట కంటే ముందుగనే దాసోహమని వారి శిష్యగణమున జేరి పోయిన ఉభయతారకముగ నుండును గదా! బయటినుండి

నేజేయునది ఏమియు నుండ జాలదు' అని నిశ్చయించి తన శిష్య వర్గమును విడనాడి శ్రీశంకర శిష్య గణమందు పరమభక్తుని వలె ప్రవర్తించు చుండెను. తన కుట్ర సాగునని కులుకుచుండెను. కపట శిష్యుని కనిపెట్టువారు లేరైరి. క్రూరుడు అదను దొరికినప్పుడు నిర్దయుడు కాకుండునా?


పిమ్మట శ్రీ శంకరాచార్యులు అంగ వంగ కళింగాది దేశములలో అద్వైతమత ప్రచారము చేసి అందందు గల కుమతముల నెల్లను అద్వైతమతమునకు ద్రిప్పి నిరుపమ యశస్సునార్జించి ప్రకాశించుచు గౌడ దేశ మందు గల మురారిమిశ్రుని, ఉదయ నాచార్యుని, ధర్మగుప్తుని జయించి శిష్యులనుగా జేసికొని దేశమందు స్థిరముగ శాంతిని నెలకొల్పుటకు  సంకల్పించిరి.


*శ్రీశంకరాచార్య స్వామికి భగందర వ్యాధి:*


శ్రీ శంకరదేశికేంద్రులు విశ్వప్రేమతో దేశమందంతటను అద్వైత మతమును స్థాపన చేసి ముముక్షు జనులకు, భక్తులకు, పండిత లోకము నకు పరమహంసయై ఆధారభూతుడై దేదీప్యమానముగ వెలుగొందు చున్నాడు. అట్టి లోకబాంధ వునకు భగందర వ్యాధి అంకురించినది. దాని ప్రభావం సామాన్యమైనది గాదు. నిరంతరం మర్మ స్థానము నుండి రక్తస్రావ మపారంగాజరుగుచున్నది. శ్రీ స్వామి ధరించిన కౌపీనములు, శాఠీలు రక్తసిక్త మగుచుండెను. ఎప్పటి కప్పుడు అవి తీసి మంచివి ధరించుచుండు వారు. ఆపని తోటకా చార్యుడు కడు భక్తిశ్రద్ధలు కలిగి పరిశుభ్రం చేయుచుం డెడివాడు. అంతభయానక రోగమంకురించిప్రకోపించినను దానిని నయం చేసుకొందామన్న మాటయే లేదు శ్రీజగద్గురువులకు. శిష్యులు వేయి చేతులతో సకలోపచారములు చేయు చున్నను వ్యాధి ఆరోజు కారోజు అభివృద్ధి నొందు చునే యున్నది. శిష్యులది గాంచి ఆందోళన జెంది జగద్గురువులను జేరి, 'సర్వరక్షకా! జగదోద్దారకా! జగద్గురో! తమకు తెలియని విషయములు, ధర్మములు గానరావు. తమ పరిస్థితి జూడ మాకు ఆదుర్దా కలుగుచున్నది. మాకు కలుగు చున్న దుఃఖములు వెల్లడించక తప్పింది కాదు. కరుణించుడు! తామెట్టి విధమైన సంకల్ప వికల్పములు లేక నిశ్చింతగ ఆత్మతత్త్వమందు మునిగి ప్రకృతిని మరచియున్నారు. కేవలం జ్ఞానస్వరూపమును పొందియున్నారు. శరీరములు స్థిరములు గావని, బుద్బుధప్రాయ  మని తాము దృఢమైన ఎఱుకతో నున్నారు. శరీరములకు సంభవించు వ్యాధులు, కష్టసుఖములు అనుభవించ వలసినదేయనిమహానీయు లందురు. ఈనాడు చేసుకొనిన కర్మను బట్టి వ్యాధులు సంభవించేవి కావని శాస్త్రములు తెలుపు చున్నవి. పుణ్యపాప కర్మ ఫలితాలని పెద్దలందురు. అయినను అట్టి విధానము అంత మంచిది కాదని విన్నవించు వారము. ఋణ శేషము, శత్రు శేషము, రణశేషము ఉండరాదని పెద్దలనుచున్నారు. స్వామీ! తమకు కలిగిన వ్యాధి తీవ్ర రూపము దాల్చి యున్నది. అట్టిది నిర్లక్ష్యం చేయడం మంచిది కాదని మా యభిమతమైయున్నది. గురుదేవా! దీని కేదైనా ఉపాయ మాలోచించుడు! అని వినయముగ వేడు కొనిరి.


*కాలడి శంకర  కైలాస శంకర*

*శ్రీ ఆది శంకరాచార్య చరితము* 

*43 వ భాగముసమాప్తము* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: