16, అక్టోబర్ 2024, బుధవారం

*శ్రీ ఆది శంకరాచార్య చరితము 44

 *శ్రీ ఆది శంకరాచార్య చరితము 44 వ భాగము*

🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕🌕


శ్రీ శంకరాచార్యులకు వచ్చిన వ్యాధిని నిర్లక్ష్యము చేయవలదని శిష్యులాడిన మాటలు విని శ్రీగురుదేవులు పలుకాడలేదు. అంతట వారలు దిగులొంది, 'దీనదయాళో! దేహాభి మానం కించిత్తైనను తమకు లేని కతమున వ్యాధి యననేమొ తెలియ రాకున్నది. ఇందు ఆవంతైనను అసత్యం లేదు. మేము తమ వ్యాధిజూచి సహించ జాల కున్నాము. బాంధవా! ఈ వ్యాధిని కుదర్చగల భిషగ్వరులు ఉన్నారు. వాళ్ళు పరీక్షిం చుటకు అనుమతి నొసంగుడు. కన్నులార గాంచి మిన్న కుండుట తమకు ధర్మం కాదు. దానిని నయంజేయు నుపాయమును అన్వేషించకుండ నుండటయు మాకు పాడిగాదు. తమకీ ధర్మములు తెలియనివి గావు.పుష్పములనుఆశ్రయించు కొని తుమ్మెదలు అందున్న మధువును ముదముతో పీల్చు మాడ్కి, తమ పాద పద్మముల నాశ్రయించు కొని వాక్సుధారసము నాస్వాదించుచు సుఖముగ కాలము గడుపు చున్నారము. తమకు ఏలాటి అస్వస్థత లేకుండ నుండవలెనని కోరుచుందుము గదా! కావున మా మాట మన్నించి వ్యాధికి తగు చికిత్సకై త్వర పడుదురని వేడుకొను చున్నారము!' అని ప్రార్ధించిరి. 


అప్పుడా శిష్యుల పలుకులు విని శ్రీశంకరా చార్యులు, 'బిడ్డలారా! నిజమును గ్రహించుడు. రోగ మనునది గతజన్మలో చేసిన పాపకర్మ ఫలితమను రహస్యము మీరలు ఎరిగియున్నారు. అనుభవించిన నయమగును గదా! ఏ కారణము వలననైనను కర్మఫలము  పూర్తిగ అనుభవించ కున్నచో శేషించిన దానికై మరి జన్మనెత్త వలసి యుండును. వ్యాధి నశించుటతో కర్మఫలము పూర్తియగును. ఈవిధాన మంతయు శాస్త్రముల యందు విపుల పరచబడి యున్నది. మీకింత తొందరేల? ఇందు మరియొక రహస్యము ఇమిడి యున్నది, వినుడు! గతజన్మలోని పాపకర్మవలన సంభవించు రోగము చికిత్సల వలన నయము కాదు. నా వ్యాధి అట్టిదగుటచే దాని ననుభవించిన నిర్మూల మగును. దీనికి వేరొక మార్గము కానరాదు. ఈ వ్యాధితో ఈ శరీరము పోయినను నాకు భయము లేదు. ఇది ఎప్పటికైనను పోవు నదే గనుక అట్టిదానికై విచార మేల?'అనివివరించారు. అంత మాత్రాన శిష్యులు ఊరుకొందురా?


*చికిత్స:*


శ్రీశంకరపాదులు భగందర వ్యాధికి చికిత్స నంగీకరింప కుండుట వలన శిష్యులకు ఆందోళన హెచ్చి, 'పరమాత్మా! తమవంటి వారలకు తామన్నట్లు తనువులపై ఆశలుండక పోవుట నిజము, సహజము కూడ. దానిని కాదన జాలము. ఆర్తత్రాణ పరాయణా! మా మనవివిని కాదనకుడు. మమ్ములను కరుణించుడు! తమ శరీరము మావంటి శరీరము కాదు. పరమ పవిత్రమైనది. మా శరీరములు పాంచభౌతికములు. తమది,దివ్యశరీరము. అలాంటి తమశరీరము బహుకాల ముండవలెనని మేమెల్లప్పుడు కోరుచుందుము. జలచరములకు నీరము ఎట్లాధారమో తమ శరీరము మాకట్లు ఆధారమై యున్నది. అట్టి యోగప్రదమైన మీ శరీరమును రక్షించుకొనడమే మా విధి. అదియే మాకు పరమ రక్షణ. తమ రక్షణ మాకు లేనినాడు మాకు వినాశమే గతి. దయా సముద్రులు మమ్ములను కాపాడవలెనన్న తమ శరీరము నకు రక్షణ అవసరం గదా! తమకు కావలసిన దేదియు లేదు. కాని లోకమును రక్షించుటకు శరీరరక్షణ ముఖ్యావసర మగుచున్నది. ప్రభో! లోకంతో పాటు మమ్ములను గూడ రక్షించుడు! జగద్రక్షకా! తప్పక ఈ వ్యాధికి చికిత్స చేయుటకు అనుమతించుడు!’ అని పరిపరి విధముల గురుదేవులను  అర్ధించారు. 

 

శ్రీశంకర గురువర్యులు శిష్యుల సంతాపము సహించనొల్లక దయ గలిగినలు దిక్కులకు పోయి భిషగ్వరులను గొని తెండని శిష్యుల కానతిచ్చిరి. పేదకు దొరికిన పెన్నిధి వలె ఉప్పొంగి గుర్వాజ్ఞను శిరసావహించి అందుకు సమర్ధులైన శిష్యులు కొందరు సమర్థులైన వైద్య శిరోమణులకై పయనమైపోయిరి. కొంత దవ్వేగునప్పటికి అనుభవము గల వైద్యులను వెదకి పట్టుకొనిరి. వారితో జగద్గురువుల స్థితి దెలిపి అంగీకరింప జేయగ శిష్యులు భిషగ్వరులను వెంట నిడుకొని గురువుల కడకుదెచ్చిరి. శిష్య గణము వైద్యులను తగు విధముగ గౌరవించి శ్రీశంకర పాదులను జూపిరి. అంతట భిషగ్వరులు శంకరుల కడ నిలువబడి వినయ విధేయతలతో నమస్కా రములర్పించి, స్వామీ! మీ వ్యాధి వివరింపుడు. మేము చేయగలిగిన దంతయు చేయ సిద్దముగ నుంటిమి. సెలవిండు! అని విన్నవించిరి.


'భిషగ్వరులారా! ఈ వ్యాధి లోపల ఉత్పత్తి కాబడి ఆసన సమీప మందు బహిర్గత మగు చున్నది. దీనికేదైన మందు  ఉన్నచో ప్రయో గించుడు! పూర్వజన్మ కృత పాపకర్మఫలితముగ ఈరోగమంకు రించినదని నాయొక్క నిశ్చయము. అనుభవిం చినచో నయమగునని నా నిశ్చయము. అందులకై చికిత్స నిచ్చగింప కుంటిని. శిష్యుల బలవంతంతో మిమ్ము  రావించితిని. మీకేదైన అనువుగనుపించిన మీ పని మీరు చేయుడు!' అని శంకరులు తెలియ జేశారు.


అంతట అశ్వనీదేవతల వంటి వైద్యశిఖామణులు తమకు  ఉన్న అనుభవ మును పురస్కరించుకొని శాస్త్రీయమైన చికిత్స జేసిరి. వారలెంతటి శాస్త్రజ్ఞానం గలిగియున్నా ఎట్టి అనుభవము గలవారైనను ఎట్టి మందులు ఉపయోగిం చినను మందుల దారి మందులది. రోగం దారి రోగానిది అయినది. పైగా రోగము ఆ క్షణమున కాక్షణము తీవ్రరూపం  దాల్చుచున్నది. అట్లైనను వేయికండ్లతో కనిపెట్టు కొని చికిత్స జేయుచునే యున్నారు. అట్లయినను భిషగ్వరులు విఫలమనో రథులైనారు.


అంతట శ్రీశంకరాచార్య స్వామి, వారి ముఖవైఖరి కనిపెట్టి, వైద్య శిఖామణులారా! చింత నొందకుడు! రోగములు సాధ్యా సాధ్యములుగ నున్నవి. అసాధ్యమేరికి శక్యము? మీరిచ్చోటు జేరి బహుదినము లైనది. మీ కొఱకెందరెందరో వేచి యుందురు. మీ రాకకై వారెదురు జూచు చుందురు. మీరచ్చట లేని లోటు ఎంతైన నుండును’ అని మెల్లగ పలికిరి.


అంతట వైద్యులు ముకుళిత హస్తులై, సంయమివరా! తాము

వచించినదంతయు సత్యమే. రోగ మని భ్రమించి చికిత్స నొసంగితిమి. ఇయ్యది మా అనుభవం మేరకు రోగము వలె గన్పట్టుట లేదు. ఇది కర్మ ఫలితమువలె గోచరించు చున్నది. మిమ్ములను విడనాడి పోవజాల కుంటిమి. అనేక మంది మిమ్ముల నాశ్రయించుకొని తమ వాగమృతమును పానం జేయుచున్నారు. మాకట్టి యోగ్యత ఎప్పటికి ప్రాప్తించునో కదా! అనుగ్రహించిన నిజ నివాసములకు జేరగల'మని విధేయులై విన్నవించగ శంకరులు నారాయణ స్మరణలు పలికిరి. అంతట వారు నిజనివాసములు జేరు కొనిరి.


పద్మపాదుడు గురుదేవులను వదలునా? గురు దేవులవ్యాధి తొలగుటకు ఉపాయ మాలోచించెను.


*పద్మపాదుడు యోగశక్తిచే వ్యాధి కుదుర్చుట:*


శ్రీజగద్గురువులకు చికిత్స కావలెనన్న కోరిక వైద్యులరాక తీరినను వైద్యులు చేయునది లేక తిరిగిపోవడంజూచి నిస్పృహజెంది యున్నారు సంయమీంద్రులు శరీర మునుమరచి నిర్వికల్ప సమాధిలో తమనిజ రూపమును లోపలి దృష్టితో చూచుకొను చున్నారు. అది శిష్యులను మరింత కలవర పరచినది. శిష్యకోటి క్రుంగిపోవుట పద్మపాదుడు కనిపెట్టి తదేక దృష్టితో యోచించెను.


'శంకరుడే శ్రీశంకరా చార్యులై యవతరించెను. అట్టివానికి పురాకృత పాపము ఎట్లు రావీల గును? శ్రీగురుదేవులన్నది సరికాదు. అది శాస్త్రవిషయ ధర్మము. మహావైద్యులు ఇది రోగము కాదనిరి. అట్టివారలను కాదను  అవకాశము గలదా? సరే! ఇంక రోగ మంకురించుటకు హేతువేమై యుండ వలెను? దేశ మంతయు కలయదిరిగి తిమి. స్వామి మంత్ర తంత్రజ్ఞులైన వారి నెందరినో జయించి యున్నారు. అశ్వనీదేవతలను మించిన వైద్యుల పలుకులు, నా అనుమా నమునకు బలము చేకూర్చు చున్నవి. సందేహమేల! ప్రభువర్యులకెవరో దుర్మార్గుడు ఏదో మారణహోమం ప్రయోగము చేసి యుంటాడు. లేకున్న ఇంతఘోర మేల?” అని నిశ్చయించి తన ఇష్టదైవ మయిన శ్రీ నరసింహస్వామిని మనసా ఒక్కసారి ధ్యానించి ప్రార్థించాడు. ఆయనకు ఉపాసనా బలం చేత

భగవదనుగ్రహం గలుగుటతో, 'శ్రీగురు దేవులకు చేసిన ప్రయోగం వెనుకకు మరలుగాక!' అని సంకల్పం చేశాడు పద్మ పాదుడు. ఆయన కోరిక శ్రీనరసింహ స్వామి మన్నించారు. అందులకు శంక యేల? ఆ క్షణంలో శ్రీశంకరులకు అంకురించిన భగందర వ్యాధి వెనుకకు మరలి ప్రయోగం చేసిన కపట శిష్యుడై యున్న అభినవ గుప్తుని ఆవహించినది. శంకరాచార్యస్వామి అద్భుతముగ కోలుకొను చున్నారు. అభినవ గుప్తుడు వ్యాధికి బలి అయ్యాడు. పిమ్మట పరిపూర్ణ ఆరోగ్యము శ్రీ శంకరునిలో ఉదయించినది. ఆ ప్రాంగణ మంతా ఆనందసాగర మందు మునిగితేలియాడి పద్మపాదుని వేనోళ్ళ కొనియాడిరి.


*శ్రీ గౌడపాదాచార్య స్వామి:*


ఒకానొక సాయం సమయాన గంగాతీర సైకత స్థలములలో శ్రీశంకరాచార్య స్వామి సుఖా సీనుడై నిమీలిత నేత్రుడై పరమాత్మ ధ్యానంలో నుండియున్న సమయమున శ్రీగౌడ పాదాచార్యస్వామి కాషాయాం బరములు ధరించి దండ కమండ లములను చేతబూని దేదీప్యమానముగ వెలు గొందుచు శంకరులను చూచుటకై సమీపించుచున్నారు. శ్రీశంకర పాదులది గ్రహించి పరమభక్తితో ఎదురేగి స్వాగతమిచ్చి పరమ గురువులకు సాష్టాంగ పాదాభి వందనము లాచరించి వినమ్రుడై ప్రక్కచాటుగ నిలువబడి వినయముతో

తలఒకించుక వంచి యున్నారు. 


శ్రీగౌడపాదులకు శంకరులను జూచినంత ఆనంద బాష్పములు వరదలై ప్రవహించినవి. గృహస్థులు కలిసికొనినప్పుడు సాంసారిక గోష్ఠులు వెడలబోసి కొనెదరు. భూపాలుర కలయిక లో పరిపాలనా వ్యవహారములు ముచ్చ టించుకొందురు. యతులన్న బ్రహ్మజ్ఞాన సంపన్నులగుట జేసి తత్త్వవిషయములు విచారించెదరు. అట్లనే శ్రీశంకర గౌడపాదుల కలయికలో తత్త్వరహస్య ములను, లోక క్షేమమును, తత్త్వ ప్రచార సంపూర్తిని గురించి ముచ్చటించు కొన్నారు. అంతట శ్రీ శంకరాచార్య స్వామి, 'పరమగురు వర్యా! మహాత్ముల దర్శనభాగ్యం లభ్యమైన నేడు సుదినము! తమ అనుగ్రహ ప్రభావముతో మూగలు వాచాలురగు చున్నారు. కుంటివారలు కొండలు దాట గలుగు చున్నారు. పాపులు పుణ్యాత్ములగుచున్నారు. సకాములు నిష్కాములై సంయమీంద్రు లగుచున్నారు. కార్యములు నిర్విఘ్నములగు చున్నవి. తమ అపార కృపను వర్ణింప వీణావతి వెరచును. తమ నామ స్మరణ సర్వపాప హరమై అనంత పుణ్యప్రద మగుచున్నది. తమ జ్ఞానం అనంతం! అఖండం! సకలసద్గుణ సంపన్ను లగుటజేసి శ్రీశుకమహర్షికి ప్రియశిష్యు లయ్యారు! అపారకరుణా సాగరులైన శ్రీగోవింద భగవత్పాదా చార్యుల వారిని శిష్యునిగా జేసికొని తమ విజ్ఞాన సర్వస్వమును ఆయన కందించినారు. నేను వారి కటాక్షముతో సకల శాస్త్రములను సాకల్యముగ తెలిసికొన గలిగితిని. నా పూర్వ పుణ్యం కొలది తమ దర్శన భాగ్యం కలిగి పావనుడ నైతిని. అను గ్రహించుడు!' అని నిగర్వియై విన్నవించెను.


*శ్రీగౌడపాదుల ప్రశంస:*


శిష్యుడు గొప్పవాడగుట కన్న వేరొక భాగ్యము ఉండదు సద్గురువులకు. శ్రీగౌడపాదులకు శ్రీశంకరా చార్యులు ప్రశిష్యుడు. తపోభూములయందు వసించు వారలకు రవి తేజము కనుపించదా?  శ్రీ శంకర సుభాషితములు వినుటతో తనలో గల ఆనందం పెల్లుబికి, 'బిడ్డా! నీ అపార సుగుణ సంపత్తి, నిర్వికల్ప ప్రవృత్తి, అసమాన విజ్ఞాన విక్రమము, పరమ శాంతము నన్నెంతగనో ముగ్ధుణ్ణి చేసి నీకడకు రప్పించినవి. నిన్ను జూడగనే మున్నెన్నడు కలుగని ఆనందమును పొందితిని. నాయనా! నే రచించిన మాండూక్యోపనిషత్తు కారికలకు నా కోరికతో భాష్యరచన చేసితివట! ఆ రచన అత్యంతం అద్భుతముగ నున్నదని శ్రీగోవిందపాదులు జెప్పగ వినియున్నాను. అద్దానిని విందామన్న కోరికతో వచ్చాను' అని వ్యక్తం చేశారు శ్రీగౌడపాదులు.


అంతట శ్రీ శంకరులు శ్రీగౌడపాదకారికలకు తానురచించిన భాష్యమును చక్కగ చదివి వినిపించారు. గౌడపాదులు మైమరచి విన్నారు.బంగారమునకు పరిమళమబ్బినట్లు భాష్యరచన జేసినందులకు శ్రీశంకరులను మెచ్చుకొని వరమొకటి ఈయ సంకల్పించి తన యభిమతమును వ్యక్తం జేయగా 'స్వామీ! తమ దర్శన భాగ్యమును మించిన వరము నాకేల! అయినను తమ కోరికను మనసా అంగీకరించు వాడను. నిశ్చింతతోడి మనసుతో సర్వదా స్వస్వరూప పరమాత్మ యందు విహరించునట్లు అనుగ్రహించుడు!' అని వినయముతో శ్రీశంకరులు వెల్లడించెను. శ్రీశంకరులు కోరిన వరమునకు మిక్కిలి సంతసించి నారాయణ స్మరణ జేయుచు గౌడపాదు లంతర్ధాను డయ్యెను. ఆనాటి రేయి ఆ గాథ నంతయు శ్రీశంకరాచార్యులు తమ శిష్యులకు వెల్లడించారు. అంతలో అరుణోదయ మయ్యింది.


*కాలడి శంకర కైలాస శంకర*

*శ్రీ ఆది శంకరాచార్య చరితము 44 వ భాగముసమాప్తము*

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

కామెంట్‌లు లేవు: