10-01-గీతా మకరందము
విభూతియోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
శ్రీ భగవద్గీత
అథ దశమోఽధ్యాయః
పదియవ అధ్యాయము
విభూతియోగః
విభూతియోగము
శ్రీ భగవానువాచ :-
భూయ ఏవ మహాబాహో
శ్రుణు మే పరమం వచః |
యత్తేఽహం ప్రీయమాణాయ
వక్ష్యామి హితకామ్యయా ||
తా:- శ్రీ భగవానుడు చెప్పెను - గొప్ప బాహువులుగల ఓ అర్జునా! (నా మాటలు విని) సంతసించుచున్న నీకు హితమును గలుగజేయు నుద్దేశముతో మరల ఏ శ్రేష్ఠమగు వాక్యమును నేను చెప్పబోవుచున్నానో, దానిని వినుము.
వ్యాఖ్య:- గురువాక్యములను శిష్యుడు ఆసక్తితో శ్రవణముచేయుచు ప్రీతిని కనబఱచునపుడు గురువునకు ఉత్సాహము జనించి కరుణతో ఇంకను ఎంతయో మహత్తరమగు బోధను గావించును. కనుకనే శ్రద్ధ అవసరము. అశ్రద్ధతో వినినది విననిదానితో సమానము, ఇచ్చినది ఇవ్వని దానితో సమానము*. అర్జునుడు భగవంతుని వాక్యములను అత్యంతశ్రద్ధతో నాలకించుచు అమృతపానము చేయుచున్నవాని చందమున గీతోపదేశ శ్రవణమున పరమప్రీతి వ్యక్తముచేయుచుండెను. కనుకనే ‘ప్రీయమాణాయ’ (ప్రీతినిబొందుచున్న) అని చెప్పబడెను. శ్రీకృష్ణునిబోధ అర్జునుని బాధను పోగొట్టుచుండెను. అందువలననే అర్జునునకు భగవద్వాక్యములందు ప్రీతి మెండగుచుండెను. ఇదియంతయు గ్రహించి శ్రీకృష్ణమూర్తి ఉత్సాహభరితుడై ఇట్టి శ్రద్ధాళువగు శిష్యునకు ఇంకను భగవత్తత్త్వమును గూర్చి బోధించిన బాగుండునని తలంచి మఱల బోధను ఉపక్రమించుచున్నారు. అందుచే ‘భూయః’ (మఱల) అని చెప్పబడెను. పరమార్థవిద్యను మఱల మఱల శ్రవణముచేయుచు, శ్రవణమొనర్చినదానిని మననము చేయుచు, నిదిధ్యాసనము, గావించుచుండిన, అది లెస్సగ జీర్ణము కాగలదు. పూర్వము చెప్పినదానిని తిరిగి భగవానుడు చెప్పనారంభించుట కిదియును కారణమైయున్నది. అర్జునున కిట్టి పౌనఃపున్యవిచారణచే, అతిశయశ్రవణాదులచే దైవతత్త్వము బాగుగ హృదయస్థము కాగలదను అభిప్రాయముచే నిట్లు చెప్పినదానినే మఱల చెప్పుట సంభవించుచున్నది.
‘హితకామ్యయా’ - శ్రద్ధాళువగు శిష్యునకు గురువు హితమొనర్పదలంచును. అన్నిటికంటె గొప్పహితము బంధవిముక్తియే. అయ్యది ప్రాపంచికపదార్థప్రదానముచే ఎన్నటికిని కలుగనేరదు. ఆధ్యాత్మిక జ్ఞానదానముచేతనే కలుగగలదు. అందువలన అర్జునునకు ఆత్యంతికహితము చేకూర్చదలంచి భగవానుడు తత్త్వబోధ గావింపనుపక్రమించిరి.
‘పరమం వచః’ - అని చెప్పుటవలన శ్రీకృష్ణమూర్తి చెప్పబోవువాక్యములు సామాన్యములైనవి కావనియు జీవుని హృదయస్థమగు అనాది అజ్ఞానాంధకారమును తొలగింపగలవి యనియు స్పష్టమగుచున్నవి. కావున విజ్ఞుడగువాడు తనజీవితమును వ్యర్థములగు ప్రాపంచికవాక్యములను వినుటయందే గడిపివేయక సంసారతరణోపాయములను తెలుపునట్టి ఇట్టి పరమవాక్యములను, పరమార్థజ్ఞానమును వినవలెను.
ప్ర:- శ్రీకృష్ణమూర్తి చెప్పబోవునవి యెట్టి వాక్యములు?
ఉ:- సర్వశ్రేష్ఠములైన వాక్యములు.
ప్ర:- శ్రీకృష్ణు డర్జునునకు పరమార్థజ్ఞానమును మఱల ఏల బోధింపనెంచెను?
ఉ:- భగవద్వాక్యములందు అర్జునుడు పరమాసక్తిని కనబఱచెను. అందుచే నతనికి హిత మొనర్పదలంచి అట్లు చెప్పదొడంగెను.
ప్ర:- ప్రపంచములో అన్ని హితకార్యములకంటె గొప్పది యేది ?
ఉ:- పరమార్థవిద్యావితరణము.
-----------------------------
*అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్, అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ. (17-28)
---------------------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి