12, నవంబర్ 2024, మంగళవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*విరాట పర్వము పంచమాశ్వాసము*


*193 వ రోజు*

*అర్జునుడు ద్రోణునితో తలపడుట*

అర్జునుడు నవ్వి " ఉత్తరకుమారా! భయం వలదు నేనున్నాను నిర్భయంగా రధాన్ని ద్రోణుని వైపు మళ్ళించు ఎర్రని గుర్రాలు పూన్చిన రధాన్ని అధిరోహించి వారే ద్రోణుడు, నాకు గురువు నాకు హితుడు బహు శస్తాస్త్ర కోవిధుడు రాజ ధర్మంగా ఇప్పుడు నేను ఆయనతో పోరాడవలసి వచ్చినది " అన్నాడు. ఉత్తరుడు అలాగే చేసాడు. అర్జునుడు గురువును చూసి " గురుదేవా! నమస్కారం. అడవులలో పన్నేండేళ్ళు , అజ్ఞాతంలో ఒక ఏడు గడిపి ఎన్నో బాధలు పడ్డాము. ఇది మంచి తరుణం అని ఎంచి మీ ముందుకు వచ్చాను. నా మీద కోపగించకండి ముందుగా మీ పై బాణప్రయోగం చేయలేను ముందుగా మీరే నాపై బాణప్రయోగం చెయ్యండి " అని వేడుకున్నాడు. అతని మాటలకు సంతోషపడి ద్రోణుడు అర్జునినిపై పది బాణాలు ప్రయోగించాడు. అర్జునుడు వాటిని మధ్యలో త్రుంచి వేసాడు. ఇప్పుడు అర్జునినికి ద్రోణుడికి ద్వంధ యుద్ధం ఆరంభమైంది. అతిరధులు, అస్త్రకోవిదులు, పరాక్రమోపేతులైన వీరి యుద్ధాన్ని కౌరవ సేనలు కుతూహలంతో చూస్తున్నాయి. ద్రోణుని అస్త్రాలను సమర్ధంగా ఎదుర్కొని అర్జునుడు వాటిని నిర్వీర్యం చేస్తున్నాడు. కురుసేనను తనుమాడుతున్న అర్జునిని చూసి ద్రోణుడు ఆశ్చర్య చకితు డౌతున్నాడు. కురు సేనలు తరిగి పోతున్నాయి. అర్జునిని గెలవడం అసాధ్యమని అనుకున్నాడు. అర్జునుడు ద్రోణుని శరీరాన్ని, కేతనాన్ని, సారథిని ఒక్క సారిగా బాణాలతో కొట్టాడు. కురు సైన్యాలు హాహాకారాలు చేసాయి. తండ్రి పరిస్థితి చూసి అశ్వథ్థామ అతనికి సాయం వచ్చాడు.*


*అశ్వథ్థామ కృపాచార్యులతో అర్జునిని యుద్ధం*


అశ్వథ్థామ విల్లందుకుని అర్జునిని గాండీవంలోని అల్లెత్రాటిని కొట్టాడు. అల్లెత్రాటిని బిగిస్తున్న అర్జునినిపై అశ్వథ్థామ ఎనిమిది బాణాలు ప్రయోగం చేసాడు. అర్జునుడు అల్లెత్రాటిని బిగించి అశ్వథ్థామ బాణాలను మధ్యలోనే త్రుంచాడు. అశ్వథ్థామపై అర్జునుడు శరపరంర సంధించాడు. అశ్వథామకు అర్జునిలా అక్షయతుణీరం లేదు కనుక అర్జునిపై బాణ ప్రయోగం చేయలేక పోయాడు. ఇది గమనించిన కృపాచార్యుడు అశ్వథ్థామకు సాయంగా వచ్చాడు. అర్జునుడు కృపాచార్యునిపై బాణప్రయోగం చేసాడు. కృపాచార్యుడు విజృంభించి అర్జునుని కపిధ్వజాన్ని కొట్టి జయధ్వానాలు చేసాడు. అర్జునుడు కోపించి కృపాచార్యుని రథాన్ని విరగకొట్టి, గుర్రాలను చంపాడు. విరధుడైన కృపాచార్యుడు ధైర్యంగా శక్తి ఆయుధాన్ని అర్జునినిపై విసిరాడు. అర్జునుడు శక్తి ఆయుధాన్ని ముక్కలు చేసాడు. కృపుడు చేసేది లేక కత్తి డాలు తీసుకుని అర్జునిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు కృపుని కత్తి విరిచాడు. కృపుడు అశ్వథ్థామ రథం ఎక్కాడు*


*కురుసేనలను ఛేదిస్తూ అర్జునుడు భీష్మునితో తలపడుట*


కృపాచార్యునికి పట్టిన గతి చూసి కురు సేనలు భీష్ముని వెనుక చేరాయి. ఇది చూసి వృషసేనుడు అర్జునిని ఎదుర్కొన్నాడు. అర్జునుడు బల్లెం తీసుకుని వృషసేనుని విల్లు విరిచి అతని గూడెలపయి పొడిచాడు. ఆ దెబ్బకు వృషసేనుడు పారి పోయాడు. పక్కనే ఉన్న దుర్ముఖుడు, వివిశంతి, దుశ్శాసనుడు, వికర్ణుడు, శకుని ఒక్క సారిగా అర్జునిని చుట్టుముట్టారు. అర్జునుడు వారి రథాలను, విల్లును విరిచాడు. అర్జునిని ధాటికి తాళ లేక వారంతా పారి పోయారు. అర్జునుడు " ఉత్తర కుమారా ! ఇక మా తాత గారైన భీష్ముడు మాత్రమే మిగిలి ఉన్నాడు. తాళవృక్ష కేతనమున్న భీష్ముని వైపు రధాన్ని పోనిమ్ము " అన్నాడు. ఉత్తరుడు భీష్ముని వైపు రథం పోనిచ్చాడు. అర్జునుని చూసి భీష్ముడు శంఖం పూరించాడు. రెండు వృషభముల వలె వారు ఒకరిని ఒకరు చూసుకున్నారు. భీష్ముడు బాణాలతో కపిధ్వజాన్ని, దాని వెంట ఉన్న భూతములను, రథసారథిని కొట్టాడు. ఆ బాణముల్సన్నిటిని మధ్యలోనే అర్జునుడు తుంచేసాడు. అర్జునుడు తన బాణాలతో భీష్ముని కప్పాడు. అర్జునుడు వేసే ప్రతి బాణాన్ని భీష్ముడు తునాతునకలు చేసాడు. అర్జునుడు తన అస్త్రాలను తాతగారి ముందు ప్రదర్శిస్తుంటే వారు బాగున్నాయి ఇంకా చూపించు అన్నట్లుంది వారి యుద్ధం. అర్జునుడు కోపించి తాత విల్లు విరుగకొట్టాడు. తాతగారికి కోపం వచ్చి మనుమడిపై శరపరంపరను కురిపించారు. అర్జునుడు తాతగారి బాణాలను అన్నీ తుంచి భీష్ముని ఆయన రథాన్ని, సారథిని, గుర్రాలను కొట్టాడు. భీష్ముడు మరొక విల్లు తీసుకునే లోపు అర్జునుడు భీష్ముని గుండెలపై కొట్టాడు. భీష్ముడు రథంపై సోలి పోయాడు. సారథి రథాన్ని పక్కకు తొలిగించాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: