73. " మహాదర్శనము "--డెబ్భై మూడవ భాగము--వారికీ సద్గతి అయినది.
73. డెబ్భై మూడవ భాగము --వారికీ సద్గతి అయినది.
భగవానులకు ఆ దినము సభ అర్పించిన కానుక సుమారు పది లక్షలకు పైనే ఐంది. రాజు అదంతా తీసుకొని వెళ్ళి రాజ భండారములో ఉంచి , భగవానుల ఆజ్ఞ ప్రకారము ఉపయోగించవలెను అని ఆదేశించినారు. భగవానులు తల్లిదండ్రులూ , పత్నీ శిష్యులతో పాటూ ఇంటికి వచ్చినారు. రాజు , దేశాధిపతులూ , విద్వాంసులూ భగవానుల వెనకే వచ్చి వారిని ఇంటికి చేర్చి , వారి అనుమతితో వెనుతిరిగినారు. అందరికీ ఉత్సవమే ఉత్సవము. ఒక జీవము మాత్రము మంటకు చిక్కిన అరిటాకువలె ముఖము మాడిపోగా భగవానుల వెనకే ఇంటిలోపలికి వచ్చింది. మైత్రేయీ , కాత్యాయనీ , ఆలంబిని ఆమెను విశ్వాసముతో ఆహ్వానించినారు. ఆమెకు భగవానులను చూస్తే ఎక్కడలేని ఏడుపూ వచ్చింది. దెబ్బతిని వెక్కుతూ ఏడ్చు పాప వలె గోడుమని ఏడ్చింది. అందరికీ ఆశ్చర్యమే ఆశ్చర్యము. గార్గి ఏడ్చుటను కాదు , ఆమె నిస్తేజమగుటను కూడా ఎవరూ చూచియుండలేదు. అదీకాక, భగవానులు ఆమెను నిండు సభలో భగవతి అని పిలచినారు. మరి ఆమె దుఃఖమునకు కారణమేమి ?
ఇంటివారందరూ అనునయించినారు. దేవరాతుడు అభిమానముతో , ’ ఎందుకమ్మా ? ఏమయినది ? " అని విచారించినారు. భగవానులు మాత్రము , ఏమీ మాట్లాడక , శాంతముగా ఉన్నారు. చివరికి కొంతసేపు ఏడ్చిన తరువాత , గార్గి , భగవానుల పాదములపైన పడింది. ఏడుపు మధ్యలోనే ఏమో చెప్పబోతుంది , అలాగే ఇంకా కొంత సేపయింది.
చివరికి భగవానులు , ’ ఏమైందని భగవతి ఇంతగా ఏడుస్తున్నారు ? "అన్నారు. వారి శబ్దమును వినగానే మేఘములు తొలగగా ప్రకాశించిన సూర్యుని వలె భగవతి ఏడుపు నిలచిపోయినది.
ఆమె కాత్యాయని తెచ్చిచ్చిన నీటితో ముఖమూ , కాళ్ళు చేతులూ కడుక్కొని శుద్ధాచమనము చేసి కూర్చున్నది. అదే సమయములో మిగిలినవారు కూడా వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని శుద్ధాచమనము చేసి కూర్చున్నారు. దేవరాతుడు ఆసనములో కూర్చున్న తరువాత భగవానులు కూడా కూర్చొని భగవతిని విచారించినారు.
భగవతికి ఏడుపు ఆగిపోయింది. అయినా శోకపు వేడిమి ఆరలేదు. ఆమె అడిగినారు, " విదగ్ధుల గతి యేమైనది ?"
భగవానులు నిట్టూర్చి అన్నారు: " వారు వచ్చినపుడు వేదికపైన వారికి నేను చూపిన గౌరవము చూసి , వారిని చూచి నేను బెదరిపోయి అలాగ చేస్తున్నాననుకున్నారు. అప్పుడే ఆదిత్య అగ్ని వాయువులు కోపగించినారు. అప్పుడు నేను శాంతింపజేసినాను. అనంతరము శాకల్యులు దేవతల విచారము నెత్తినారు. మనము కంటికి కనపడరు అన్న కారణము చేత దేవతలు లేరు అనుకుంటాము , భగవతీ. కానీ , వారు పరోక్షప్రియులు. కనిపించని చేయిగా ఉండి అన్ని పనులనూ చేయిస్తారు. దేవతా విభూతి సంకోచములను అడుగుతున్నట్లల్లా దేవతల రుద్ర రూపమైన తేజస్సు అక్కడ సంభృతమగుతూ వచ్చింది. ( ఆవహించుటకు సిద్ధముగా , పెరుగుతూ వచ్చినది ). ప్రాణపు వికాసములను గురించి చెప్పునపుడు విదగ్ధుల లోనున్న ప్రాణము విద్రుతమైనది ( కరగి, తగ్గినది ) దానిని తిరిగి తనలోపలికి ఆకర్షణ చేసుకోనీ యని నేను దిక్కుల విచారమునెత్తినాను. వారు గమనింపలేదు. చివరికి అన్నిటినీ సరిపరచు ఔపనిషదిక పురుషుని విచారము నెత్తినాను. అప్పుడు కూడా వారు దానిని అందుకోలేదు. అంతవరకూ సంభృతమయిన తేజస్సు ప్రకటమైనది. దానికి వారు ఆహుతి అయినారు. "
గార్గి ఆ వేళకు శాంతురాలై ఉండినది. అన్నది , " భగవాన్ , అసలే పార్థివ దేహము , చాలదన్నట్టు జరా జీర్ణమయినది. ఎప్పుడైనా పోవలసినదే. పోయింది. దానికోసము నేను వ్యథ పడుట లేదు. అయితే , వారికి సద్గతి అయినదో లేదో ? అన్నదే నా వ్యథ. "
" తమ వ్యథ సాధువైనది . అయితే తమరెందుకు ఆలోచించలేదు ? దేవతల కోపానికి పాత్రులైనవారికి సద్గతి ఎక్కడిది ? "
భగవతి అది విని దుఃఖమును తట్టుకోలేకపోయినది. " భగవాన్ , కాపాడవలెను. విదగ్ధులకు దుర్గతి పట్టకూడదు. కాపాడవలెను. " అని గోడుపెట్టింది." కావలెనన్న , ఈ జన్మలో నేను ఆర్జించిన పుణ్యమునంతా ఇచ్చివేస్తాను. వారికి బ్రహ్మజ్ఞులకు కలుగు సద్గతి కలగవలెను "
భగవానుల హృదయము పసిపిల్లవాడి వంటిది. ఎప్పుడూ ఆనందముతో నిండి రసార్ద్రముగానే ఉండును. అది భగవతి గోడును విని కరగక ఎలాఉండును ? అన్నారు :" భగవతీ , ఇప్పుడు వారికి దొరకు దుర్గతి కూడా బహుకాలముండదు. ఆ దుర్గతియొక్క స్వరూపమేమో తెలుసా ? శరీరమే తాననుకొని , శరీరమునకగు బాధలన్నిటినీ తనవనుకొని , సుఖ దుఃఖానుభవము పొందును. దుఃఖానుభవమునకై వేరే లోకమున్నది. అది నరకము. ఇదంతా మీకు తెలుసు. కావాలంటే ఇక్కడే ఉండి దానిని చూడవచ్చును. అక్కడ కొంతకాలము విదగ్ధులు ఉండవలసినది. అయితే మీరు అడ్డువచ్చినారు. వారికి సద్గతి కావలెనంటిరి. తప్పకుండా కానీ. అందరి ఆత్మ ఒకటే అన్నట్టయితే , మనము అది తెలిసినవారమైతే , మన ఆత్మే అయిన విదగ్ధుల ఆత్మ ఎందుకు లేని భ్రాంతికి లోనై నలగవలెను ? బ్రహ్మ లోకము సదా ఆత్మదర్శనమగు లోకము. అక్కడికి వెళ్ళువాడు అక్కడే శాశ్వతముగా ఆత్మదర్శనము వలన బ్రహ్మానందమును పొందుతూ ఉంటారు. చివరికి బ్రహ్మలో తృప్తి పొంది బ్రహ్మమును పొందును. ఇంతయితే చాలుకదా ? "
భగవతి భగవానుల వచనములను విన్నది. ఆమెకు సంతోషమయినది. విదగ్ధులకు నరకవాసము తప్పి, శాశ్వతమైన బ్రహ్మలోకము దొరికినది కదా అన్న సంతోషముతో భగవానులకు నమస్కారము చేసి , " అట్లయిన చాలు. వారు మా గురువులు. దానికోసమే ఇంత కష్టమును పొందినాను, క్షమించవలెను " అన్నది. భగవానులు నవ్వి , " ఇటువంటి సూటి చర్చ మాకు వద్దనిపించలేదు " అన్నారు.
భారమైన హృదయముతో సంకట పడుతూ వచ్చిన భగవతి లఘువైన హృదయముతో బయలు దేరింది. భగవానులు ఆమెను నిలిపి , " వరమును అడిగి పొందినవారు ప్రతిగా ఒక వరమును ఇచ్చి కదా వెళ్లవలసినది ? " అన్నారు. బయల్వెడలిన ఆమె, ’ పరిపూర్ణ బ్రహ్మయై , ఆప్త కాములైన వారు వరమును అడిగితే , బెల్లపు గణపతికి బెల్లమే నివేదన అన్నట్టవుతుంది , అంతే కదా ? ఈ ముఖముతో అడుగుతారు , ఇంకొక ముఖముతో ఇస్తారు. దానికేమి ? తప్పకుండా " అన్నది.
భగవానులు గంభీరముగా అన్నారు :" ఇక మీదట భగవతి ఎప్పుడూ కూడా దేహోహం భ్రాంతికి లోనుకాకుండా ఆత్మాహం మతి తో వర్తించవలెను. ఈ వరమును ఇవ్వవలెను "
భగవతి కళ్ళు ఆనందముతో హర్షించగా అన్నారు : " ఇది తమరు ఇచ్చిన వరమా ? అడిగిన వరమా ? దేవతలు ఇచ్చినది సుఖమునకూ కావచ్చు, దుఃఖమునకూ కావచ్చును. అయితే సాధువులు ఇచ్చునది ఎల్లపుడూ సుఖమునకే అవుతుంది అని విన్నాను. ఇప్పుడు అది నిజమయినది. ఇది నిజంగా వరమే. ఎప్పుడూ ఇలాగే ఉండునట్లు అనుగ్రహించండి " అని నమస్కారము చేసినది.
Janardhana Sharma
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి