*20 - భజగోవిందం / మోహముద్గర*
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🔥
*భజగోవిందం శ్లోకం:-18*
*సురమన్దిర తరుమూల నివాసః శయ్యా భూతల మజినం వాసః|*
*సర్వ పరిగ్రహ భోగత్యాగఃకస్య సుఖం నకరోతి విరాగః భజ 18.*
*ప్రతి||* విరాగః = రాగములేని తనము---అనగా--వైరాగ్యము; కస్య = ఎవనికి; సుఖం = సుఖమును; న కరోతి = కలిగించదు? ( విరాగులందరికీ కలిగిస్తుంది); సురమన్దిర = దేవాలయములందు; తరుమూల = చెట్లమొదళ్ళలో; నివాసం = నివసించే వానికి; భూతల = నేలమీదనే; శయ్యా = పడక కలిగినవానికి; అజినం = చర్మమును; వాసః = ధరించిన వానికి సర్వపరిగ్రహః = ఏదిగాని తనకయి వుంచుకోవట మనే ఊహను; భోగ = అనుభవించాలనే ఊహను; త్యాగః = త్యజించి వేసినవాడు (వీళ్ళందరికీ సుఖాన్ని కలిగిస్తూనే వుంది).
*భావం:-*
దేవాలయాల్లోనూ, చెట్ల క్రింద తలదాచుకొంటూ వట్టి యిసుక మీద పడుకొంటూ మృగ చర్మం ధరిస్తూ ఏ వస్తువుగాని పరిగ్రహించక అనుభవించే కోరిక కూడా లేక వుండే వారందరికి సహా వైరాగ్యమనేది ఎవరికి సుఖమీయదు?
*వివరణ:-*
వెనుక శ్రీ హస్తామలకులవారు మిథ్యాచారులైన సన్యాసి వేషధారుల సంగతి ప్రసంగించారు. ఈ శ్లోకంలో శ్రీ సురేశ్వరాచార్యుల వారు బాహ్య ప్రపంచములోని విషయములమీద కోరికలన్నిటినీ త్యజించినట్టి సత్య నిత్య సన్న్యాసి సంగతి ప్రస్తావిస్తున్నారు.ఉద్రేకాలు, కోరికలు నిజంగా నశించి పోవటమనేది జరిగినట్లయితే ఎవనికయినా ఆ వైరాగ్యస్థితి సుఖాన్నే యిస్తుంది. లేకపోతే దుఃఖం తప్పదు. చక్రవర్తులు దుఃఖిస్తూ వుండడం, ధనవంతులూ బాధపడుతూనే వుండటం; అధికారులు ఆదుర్దా పడుతూనే వుండడం చూస్తాము.
యోగ్యత సంపాదించినవాడు అసూయ పడుతూనే వుంటాడు. అంతా సుఖం లేనివారే, మరీ వైరాగ్యం వారికి లేదుకదా! అందుకని ఎవరినైనా సుఖపడే వాడెవరని అడిగితే అతడు ఇంకొకరి వంక చూపిస్తాడు, అతడు సుఖపడుతున్నా డంటాడు. తనది బాధ అనుకొన్నప్పుడు ఇంకొకడి సుఖాన్ని చూడ బుద్దవుతుంది. తను సుఖుడని చెప్పుకోగలిగిన వాడు- అలా నమ్మేవాడు ఎవడంటే అంతరాంతరాల్లో సహా కోరికను కోరికను (అనగా) సక్తతను వదిలివేయటానికి అలవాటు పడ్డవాడు, అలాటి వాడు ఒకడు నేను "సీజరులోని సీజరును" అన్నాడట. నేను రాజులోని రాజరికాన్ని అన్నాడట! అతడికి యీ బాహ్య వస్తువులవల్ల సంతోషమేమీ కలగనే కలగదు. (అంటే దుఃఖం కలుగుతుందని కాదు. అసలవి అతడిని కదిలించవని ధ్వని) క్షణభంగుర మైన భ్రాంతి పూర్ణమైన ప్రమోదాలకు చలించడు.
అలాంటి మనిషికి స్వంతమయిన ప్రదేశముండక పోవచ్చు, యే దేవాలయం లో చెట్టు క్రిందనో నేలమీదనో పడుకొని నిద్రపోతాడు. దుస్తులేమున్నా చింతలేదు, లేడి చర్మం చుట్టుకొనైనా వుంటాడు, ఏ వస్తువైనా కావాలని అతడి కుండదు. ఇచ్చినా వదిలేస్తాడు. అసలు మనసులోనే “ఇది నాది" అనే భావన వుండడం మానేసిందిగదా! ఎప్పుడూ స్వయం సమృద్ధిగా వుంటాడు. బాహ్య ప్రపంచానికి సంబంధంలేని వాడు. తన అంతరాంతరాల్లో ఒక మంచి సంతోషం అనే ఊట బావిని కనిపెట్టాడు. నిష్కపటమైన సంతృప్తి అనేది అడుగునుంచి పెల్లుబకటంవుంది. అతడిలో ఇలాంటి మనస్తత్వం కలిగిన వాడెవడు సుఖుడై వుండడు? అని సురేశ్వరాచార్యులు ప్రశ్నిస్తారు.
త్యాగమనేది వట్టి బాహ్యవస్తువుల విషయం మాత్రమే అయి, యింకా విషయలాలన అంతరాంతరాల్లో వుంటే జీవితముయొక్క నిజమైన సంతృప్తి ఎవడు గాని పొందలేడు. ఒక కుశంక ఉదయించవచ్చు. ఈ త్యాగం తపస్సు చేసిన వానికి దానికి ప్రతిఫలంగా యే సంతోషంగాని యివ్వటమనేది లేదన్నమాట అని , అనగా ప్రతిఫలం అననేది లేదు. కనుక సంతోషమూ అతడికి లేదనటం - యిది సరికాదు. మన పూర్వ గ్రంథాలు అలా యెక్కడా చెప్పలేదు. అవి చెప్పేదానికి యీ ఊహ వ్యతిరేకమైనది.
నిజమైన విరాగికి అంతర్గతంగా జీవితం పట్లవుండే అభిప్రాయమూ బాహ్యం గా అతడు ప్రదర్శించే స్వభావమూ ఎలా వుంటాయో యీ శ్లోకంలో చెప్పబడింది. అతడు కోరిక అనేది యేదీకూడా లేని స్థితికి చేరివుంటాడు. ఈ స్థితి అతడికి ఎలా కలిగింది? జీవితం నుంచి పారిపోయినందువల్ల మాత్రం కలగలేదు. లోలోపల స్వయం సమృద్ధిని అనుభవించి దానితో అతడు కలిసి బ్రతకటం చేత కలిగింది. ఈ స్థితిని గీతాకారుడు స్థిత ప్రజ్ఞుడి లక్షణాలు చెప్పేటప్పుడు బాగా వర్ణించారు. * ప్రజహాతి యదాకామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్! ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే” ( గీత 2 అ. 55 శ్లో॥ ) ఎవడయితే కోరికలన్నిటినీ త్యజించి ఆత్మను చూసి సంతోషపడుతూ ఆత్మలోనే విలీనమై వుంటాడో అతడు స్థిత ప్రజ్ఞుడు అన్నారు.
లోపల నిధులుండాలి. బయటివేవీ వద్దనే వాడికి బయట పేద తనం లోపలి సంపదతో సరితూగ లేనప్పుడే అతడు అంతర్గతమైన సమృద్ధికోసం బయటి సర్వం వదలి వేస్తాడు. లేకపోతే అలా వదలటం ఎంత కష్టం? సంభవమా? యదార్థమేదో బయటనే చూడటం చేత కావాలంటే సహించటం తెలిసి అంతర్గతంగా చూడటం చేతనయినప్పుడే అది సంభవం. దీన్ని సాధకుడు సాధించాలి. సత్యపదార్థం కోసం అంతర్గతంగా చూడటం అనేది అందుకే చాలా ప్రధానమైనది.
సన్యాసికి అతడి జీవితం నిరాడంబరమైందిగా వుంటుంది. చెట్టుక్రింద పరుండినా ఎక్కడ నిద్రించినా అతడు చక్రవర్తులకు చక్రవర్తిగా చింత లేకుండా నిద్రిస్తాడు. మనసులో చింతలు లేవు కనక హాయిగా నిద్రిస్తాడు పడక మెత్తగా వుండక పోయినాసరే, అతడికి మాయ తెలీదు. అందరినీ ప్రేమిస్తాడు - ఆ ప్రేమతో శాంతియుతంగా గట్టి నేల మీదయినాసరే సుఖంగా నిద్రిస్తాడు. అతడికి మెత్తని తనం ఎక్కడిది? అది అతడి హృదయంలోని పవిత్రతలోనిది. మంచి తనంలో జన్మించినట్టిది.
అతడు సుఖవంతుడు, సందేహంలేదు. ఐతే ఇక నెవడు సుఖవంతుడు కానిది? ఇతరులంతానని చెప్పాలి. వాళ్ళకు ఎంతో ఆస్తి వుండవచ్చు కాని వాళ్ళ మనసుల్లో కోరికలనే కొఱుకు పుండ్లున్నాయి. వారి తెలివిలో మోసగించటమనే రాచ పంది. అందుకే మాండూక్యోపనిషత్తుతో *"త్యాగేనైకేన అమృతత్వమానశుః*' త్యాగంవల్లనే అమృతత్వం పొందగలగవలెనని అన్నారు.
మరొక యుపనిషత్తులో కూడ *"వైరాగ్యమేవా భయం”* వైరాగ్యం వల్లనే అభయమనేది కలుగుతుందన్నారు.
*ఇధి సురేశ్వరాచార్య కృత శ్లోకం.*
*సశేషం*
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి