13, నవంబర్ 2024, బుధవారం

జయ జయ జగదంబ శివే*

 *జయ జయ జగదంబ శివే*

*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*

*జయ జయ మహేశదయితే* 

*జయ జయ చిద్గగన కౌముదీధారే||*

...............................................................

*శ్రీ మూకశంకర* విరచిత  *మూక పంచశతి*

🔱 *శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన*🔱


▪▪▪▪▪▪▪▪▪▪▪

శ్లోకము:-

*పౌష్టిక కర్మవిపాకం పౌష్పశరం సవిధ సీమ్ని కంపాయాః*

*అద్రాక్షం ఆత్తయౌవనం అభ్యుదయం కంచిత్ అర్ధశశిమౌళేః II 24 ||*

▪▪▪▪▪▪▪▪▪

ప్రతిపదార్థం

కమ్పాయాః = కంపానది యొక్క

సవిధ-సీమ్ని = సమీప ప్రదేశమున

పౌష్ప-శరమ్ = మన్మథునకు సంబంధించిన

పౌష్టిక-కర్మ-విపాకమ్ = పౌష్టిక కర్మల పరిణామమైన

ఆత్త-యౌవనమ్ = యౌవనమునొందిన

కఞ్చిత్ = ఒకానొకదానిని

అర్ధ-శశిమౌలేః = శివునియొక్క

అభ్యుదయమ్ = అభ్యుదయమును

అద్రాక్షమ్ = చూచితిని



*‌భావము:* 

కంపానదీ సమీపమున మన్మధుని పౌష్టిక కర్మల పరిపాకముగా యౌవనము పొందిన అర్ధచంద్రమౌళి యొక్క ఒకానొక అభ్యుదయమని చెప్పదగిన అమ్మవారిని చూచితిని.

*****

*వివరణ*

పౌష్టికకర్మలని, శాంతికర్మలని వైదికకర్మలు రెండువిధములు.వానిలో శాంతికర్మలు ( పూర్వజన్మచంచితమైన దానిని శాంతింపచేసి ఈ శరీరమును కల్పించుట ద్వారా) పాపములను ప్రారబ్ధకర్మల ద్వారా కలిగించునట్టివి. పౌష్టీకములు మంగళములను కలిగించునవి.ఆయుర్వేద శాస్త్రముననూ శరీరపుష్టిని కలిగించు ఔషధముల కర్మలు వాజీకరణములు రోగములను శమింపచేయు ఔషదకర్మలు ఉన్నవి.

ప్రస్తుతం మన్మధుడు కొన్ని పౌష్టిక కర్మలొనరింప తత్పరిపాకమున అమ్మవారికి యౌవనము కలిగినది.ఇప్పుడు దానిచేత తన పూర్వ విరోధి ఐన శివుని గెలువవచ్చని సంతోషించిటకు ఆమె యౌవనము కారణమైనది.ఇప్పుడు తన పుష్ప బాణములకు సాన పెడుతున్నాడు.అమ్మవారి శరీరమంతయూ పుష్పగంధము పుష్పసుకుమారము అనగా అది మన్మధునకు అమ్ములపొది ఐ‌నది. దీనిని చూడగానే శివుడు తన ఓటమిని సంతోషముతో అంగీకరించినాడు.ఇది తన అభ్యుదయముగా భావించినాడు.తాను వియోగకాలమున చేసిన తపమంతయూ ఫలించినది అనుకున్నాడు.నాడు మన్మధుని దహించి సంపాదించిన పాపమును ఇక కడుగుకొనవచ్చని అనుకున్నాడు.పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం వేసినట్లు పుష్పశరుని ప్రళయకాలభీల పాలనేత్రాగ్ని వృష్టిని కురిపించి కాల్చివేయుట శివునకు ధర్మము కాదు! అనురీతిన వచ్చిన అపకీర్తిని తొలగించుకుని మన్మధసామ్రాజ్యము ఏలుకొనవచ్చు అనుకున్నాడు.

ఇహపరలోకముల కలుగు సౌఖ్యము అభ్యుదయమనబడును.చంద్రమౌళి కామాక్షిని గూర్చి దాంపత్య ధర్మము అవలంబించుటకు వీలును కలిగించునట్టిది అమ్మవారి యౌవనము. కావున దానిని అతడు అభ్యుదయముగా భావించినాడు.

{ఈ శ్లోకమున శివుడు అర్ధశశిమౌళి గా పేర్కొనబడినాడు.}


🙏 *ఆ తల్లి పాదాలకు నమస్కరిస్తూ..*🙏

కామెంట్‌లు లేవు: