74. " మహాదర్శనము "--డెబ్భై నాలుగవ భాగము --ఖండము అఖండమయితే
74. డెబ్భై నాలుగవ భాగము-- ఖండము అఖండమయితే
గార్గి వెళ్ళిపోయిన తరువాత, ఆడవారంతా ఒక్కొక్కరుగా అక్కడనుండీ వెళ్ళిపోయినారు. కాత్యాయనికి భగవానులను సర్వజ్ఞులని అందరూ , లోకమే ఒప్పుకున్నదని సంతోషము. మైత్రేయికి , భగవానుల సర్వజ్ఞత్వము ప్రకటమై బహిరంగమగు దినము వచ్చినది కదా! యని సంతోషము. ఆలంబినికి తన కొడుకు లోకోత్తరుడైనాడని శరీరమంతా ఉబ్బిపోవునంతటి సంతోషము. ఆమెకయితే ఎన్నిసార్లు ఆనందముతో కనులు చెమర్చినాయో తెలియదు.
ఇద్దరు శిష్యులు వచ్చి నమస్కారము చేసి, చేతులు జోడించినారు. భగవానులు , " ఏదో ఉన్నట్లుందే ? ఏమిటి ? " అన్నారు. " జ్ఞాన సత్రములో జరిగినది ఉపనిషత్తు. దానిని లిపిబద్ధము చేసి శాశ్వతము చేయుటకు అనుమతి కావలెను. " అన్నారు. భగవానులు , " ఆలోచించండి. ఇదొక అధ్యాయము. సరే , రాసి ఉంచండి. అయితే ఇంకా రెండు అధ్యాయములు మిగిలినవి. కానిమ్ము , అవికూడా సకాలములో అవుతాయి, తొందర లేదు. " అన్నారు.
దేవరాతుడికి కొడుకుకు సర్వజ్ఞాభిషేకమైనది ఎక్కడలేని ఆనందాన్నిచ్చింది. ఇంటికి రాగానే కొడుకును హత్తుకొని ముద్దాడవలెననుకున్నాడు. అయితే గార్గి ప్రసంగము అడ్డు వచ్చింది. భగవానులు ఆమెతో ఆడిన ప్రతిమాట ఆ వృద్ధునికి తనను గురించే చెప్పినట్లు తోచింది. అందులోనూ చివరగా వారు ఆమెను అడిగిన వరమైతే తనను గురించే చెప్పినట్లు నమ్మకముగా అనిపించింది. " ఇప్పుడు కొడుకుతో కూచొని మాట్లాడవలెనంటే ఎందుకో దిగులవుతుంది. తాను కూడా శాకల్యుడి వలెనే దేవతలను ఎవరికి వారు ప్రత్యేకము అనుకొని ఆరాధించినాడు. అఖండమొకటి ఉందని శాస్త్రము చెప్పుచున్ననూ దానిని అంతగా గమనింపక ఖండ ఖండములనే ఉపాసన చేసినాడు. అఖండోపాసకుడైన కొడుకు దగ్గర తానెలా మాట్లాడేది ? మాట్లాడునపుడు హెచ్చుతక్కువగా తనకూ శాకల్యునికి అయినట్టే అయితే ? శాకల్యునికైతే సద్గతి దొరకవలెనని కోరుటకు గార్గి ఉంది. తనకెవరు ? "
దేవరాతుని భ్రాంతులకు అంతులేకుండా పోయింది. ఏమేమో ఊహించుకున్నాడు. చివరికి అందరూ వెళ్ళిపోయి , తానూ కొడుకూ ఇద్దరే కూర్చున్నపుడు ఇక విధిలేక , ఎంత భయమగుచున్ననూ కొడుకుతో మాట్లాడినాడు, " ఏమయ్యా , అట్లయితే ఖండోపాసన వలన ప్రయోజనమే లేదా ? "
భగవానులు వెంటనే , వినయమును వదలకనే , గురువుకు పాఠమును అప్పజెప్పు శిష్యుడి వలె అన్నారు : " ఖండోపాసన కామ్యమైతే మాత్రమే చెడ్దది. కామములేని ఆ వస్తువును ఉపాసన చేసినపుడు ఏ కామమును కోరుట ? "
" అయితే ఈ యజ్ఞయాగాదులన్నీ కామమేనేమి ? "
" కాక మరేమిటి ? బ్రాహ్మణుడైతే , తన ఆస్తి యైన దేవానుగ్రహము పెరగనీ , తాను చేసిన ఆశీర్వాదములు సఫలము కానీ , అని యజ్ఞ యాగాదులను చేయును. ఇతరులైతే తమకు నేరుగా ఫలము దొరకనీ అని చేయుదురు. ఇలాగ పరార్థ , స్వార్థములు రెండూ లేక , యజ్ఞయాగాదులను చేయువారు ఎవరు ? ఎందుకు చేస్తారు ?"
" అట్లయితే , దేవతలూ మనుష్యులూ పరస్పరము భావిస్తూ , ఇద్దరూ సుఖముగా ఉండవలెను అంటారు కదా ? "
" నిజము , అయితే ఆ సుఖముగా ఉండుట అన్నారు కదా , అక్కడే ఉంది మర్మము. చూడండి , సుఖముగా ఉండుట అంటే ఇంద్రియ ప్రపంచము కదా ? ఇది రాజాధిరాజులకు సంభావన ఇచ్చి , వారిని గొప్పవారిని చేసి తానూ గొప్పవాడయినట్టే ! మనము వద్దన్నా , కావాలన్నా , ఏదో ఒక రూపములో ఇది లోకములో జరుగుతున్నదే కదా ? "
" అయితే మరి లోకోద్ధారమంటే ఏమిటి ? "
" అది భారీ వర్షమును కురిపించునట్టిది. ఖండోపాసన అంటే మన తోటకు మనము నీరు పెట్టుకున్నట్టు ! కానీ భారీ వర్షము అంటే దేశమంతా తడవడము మాత్రమే కాదు , బావులు , చెరువులూ, తటాకములూ , నదులూ అన్నీ నిండుతాయి. అలాగ , అఖండోఫాసన వలన మాత్రమే అగును. అదే లోకోద్ధారము. "
" మనము ఖండము నుండీ అఖండమునకు వెళ్ళుట ఎలాగ ? "
" మీరు తెలియని వారివలె నన్నడిగితే నేనేమి చెప్పేది ? మనసులో కామము నుంచుకొని, అఖండోపాసన చేసినా , అది ఖండోపాసనే. కామము లేక దేనిని ఉపాసన చేసిననూ అది అఖండోపాసనే! లేదా, మీరడిగిన దానికి నేరుగా ఉత్తరము నివ్వవలెనంటే , స్వార్థమే కామము . అది తన వరకే ఉండవచ్చును , లేదా , తన కుటుంబము , తన దేశము , తన లోకము, ఏదైనా సరే , కామము కామమే! ఆ కామము ఉండువరకూ చూచునదంతా వేరే వేరే ! అప్పుడు అన్నీ ఖండ ఖండములే. దానిని వదలిపెట్టితే , ఇంటిని కట్టు గోడలను పడగొట్టితే , ఇల్లు పోయి బయలగునట్లు, అంతా ఒకటవును. అప్పుడు ప్రవాహము వచ్చి , ఎక్కడ చూసినా నీరే నీరు అగునట్లు , ఖండము అఖండమగును. "
కొడుకు మాటలు వింటుంటే తండ్రికి తాను కూర్చున్న చోటి నుండీ ఎవరో , తనను మోసుకొని పోయి ఏదో ఆకాశ సముద్రములో వేసినట్లు , అక్కడ ’ తాను ’ అన్నపుడు నిండిన కుండ వలె , తాను లేనన్నపుడు పగిలిన కుండ వలె, తోచుచున్నది. ఎక్కడెక్కడ చూచినను ఏదో నిండుదనము , ఏదో శూన్యము. అయితే ఆ శూన్యము , ఖాళీగా ఉన్న శూన్యము కాదు. ఇంకేమీ లేనందువలన , అంతా తానే అయినందువలన కనిపించు నిండిన శూన్యము. అక్కడ ఏమీ అర్థము కాదు. అర్థము కాదా అంటే , ఆ అర్థమేమో తెలియకున్ననూ అర్థమయినట్లే ఉంది. అర్థమే తానైతే , అర్థమయింది అనవలెనా ? లేక అర్థము కాలేదు అనవలెనా ?
దేవరాతునికి అదివరకూ అట్టి అనుభవము ఎప్పుడూ అయి ఉండలేదు. తానొక కలకండ ముక్కగా మారి నీటిలో పడినట్లు , ఆ ముక్క ఘడియ ఘడియకూ కరగిపోవు చున్నట్లు అనిపిస్తున్నది. తాను ఎన్నో వర్షముల నుండీ సంపాదించుకున్న ఆస్తి అంతా వానకు చిక్కిన పచ్చి ఇటుక వలె కరగి పోవుచున్నదే యని దిగులవుతున్నది. దానితో పాటే , ’ పోనివ్వు , మట్టి , మట్టిలో కలసిపోయింది , నష్టమేమిటి ? ’ అని ధైర్యము కూడా ఉంది. అయినా ఆ భీతి-ధైర్యములు ఏదో సముద్రములో లేచే కెరటములవలె , తాను ఆ సముద్రపు అడుగున ఉండి , పైనా కిందా , లోపలా బయటా , చుట్టూరా అంతటా నీరే నీరై చలనములేక ఘనమైనట్టు అనిపిస్తున్నది.
దేవరాతుడు మేలుకున్నాడు. అంతవరకూ చూసినది కల కాదు. జాగ్రత్తు అసలే కాదు . కనులు తెరచినాడో , మూసినాడో తెలీదు. అయితే విచిత్రానుభవము అయినదని బాగా జ్ఞాపకము ఉంది. ఆ అనుభవము ఇంకా అయితే బాగుండును అన్నట్టుందే కానీ , ఇక వద్దు అనిపించలేదు.
ఠక్కున ఒక ఆలోచన తట్టింది. " ఇది ఈతడి సన్నిధానములో ఉన్నందు వలన అయినదా ? " అనిపించింది. " దీనిని పరీక్షించెదను. ఈ అనుభవము ఈతడి సాన్నిధ్యము వల్లనే అయి ఉంటే , నేను ఆశ్రమమునకు వెళ్ళి ఇతడితో పాటే ఉంటాను. " అనుకున్నాడు. భగవానులు అక్కడే ఉన్నారు.
ఆచార్యునికి బహిర్ముఖ స్థితి సంపూర్ణముగా కలిగి , " సంధ్యా స్నానపు కాలము ’ అనిపించినది. కొడుకుతో , ’ ఏమిటయ్యా , స్నానానికి వెళదామా ?’ అని అడిగినాడు. సరేనని వారు కూడా లేచినారు.
" మరచాను , రేపు రాజ భవనమునకు మనమే వెళదామా ? లేక వారు రానీ అని వేచిఉందామా ? " అన్నారు.
" వారు వచ్చి పిలిస్తే వెళదాము , తొందరేమిటి ? వారు ఎలాగ చేస్తే అలాగ సరి యని ఉంటే సరిపోతుంది. " అని సమాధానము వచ్చింది.
Janardhana Sharma.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి