🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
*గౌతమ బుద్ధుడు బోధించిన అయిదు విషయాలు!!*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
*మనోబలం..*
*పురుషులు, స్త్రీలు, గృహస్థులు, సన్యాసులు- అందరూ ఈ అయిదు విషయాలపై తప్పనిసరిగా దృష్టి నిలపండి!*
🔹*ఏదో ఒక రోజున నాకు వృద్ధాప్యం కలుగుతుంది- దాన్ని నేను తప్పించుకోలేను.*
🔹*ఏదో ఒకనాడు నేను అనారోగ్యం పాలవుతాను- దాన్ని నేను తప్పించుకోలేను.*
🔹*ఎప్పుడైనా మృత్యువు నన్ను కబళిస్తుంది- దాన్ని నేను తప్పించుకోలేను.*
🔹*నేను ఎంతగానో ప్రేమించి, నావి అని మమకారం పెంచుకునే వస్తువులన్నీ మార్పునకో, నాశనానికో, ఎడబాటుకో లోనుకావచ్చు- దాన్ని నేను తప్పించుకోలేను.*
🔹*నేను చేసిన పనులు అంటే స్వకర్మల వల్లనే నేనిలా తయారయ్యాను. నా పనులు మంచివైనా, చెడువైనా- వాటికి నేను బాధ్యత వహించాల్సిందే.’*
*గౌతమ బుద్ధుడు బోధించిన ఈ అయిదు విషయాలు ‘అంగుత్తరనికాయం’ అనే గ్రంథంలో కనిపిస్తాయి. ఇవన్నీ ప్రతి మనిషికీ జీవితంలో ఎదురయ్యేవే.*
*అయితే పరిస్థితులు బాగున్నప్పుడు మనం ప్రతికూలమైన విషయాలను, మనకు బాధ కలిగించేవాటి గురించి ఆలోచించం.*
*కొన్నింటిని అంగీకరించడానికి మనం మానసికంగా సిద్ధంగా ఉండం. దాని ఫలితంగా ఆకస్మికంగా ఎదురయ్యే ప్రతికూలతలకు తల్లడిల్లుతాం. మానసిక ఆందోళన కలుగుతుంది. ఈ పరిస్థితి రాకూడదనుకుంటే మనసులో సానుకూల వాతావరణం సృష్టించుకోవాలి.*
*వృద్ధాప్యాన్ని ధ్యానించడం ద్వారా యౌవనం వల్ల కలిగే అహంకారాన్ని,*
*అనారోగ్యాన్ని ధ్యానించడం ద్వారా ఆరోగ్యంవల్ల కలిగే అహంకారాన్ని*
*మృత్యువును ధ్యానించడం ద్వారా జీవన విధానంవల్ల కలిగే అహంకారాన్ని, ప్రతి వస్తువులో కలిగే మార్పును,*
*నాశనాన్ని ధ్యానించడం ద్వారా అన్నీ తనకే కావాలనే బలమైన కోరికను అణచివేయవచ్చు లేదా కనీసం తగ్గించవచ్చు.*
*మనం చేసే పనుల ఫలితాన్నే మనం అనుభవిస్తామన్న సత్యాన్ని ధ్యానించడం ద్వారా ఆలోచనల్లో, మాటల్లో చెడు చెయ్యాలన్న దుర్మార్గ స్వభావం అణగారుతుంది. కనీసం తగ్గుతుంది అన్నది బుద్ధుడి ఉపదేశం.*
*ఇక్కడ ధ్యానమంటే- ఒక విషయంపై దృష్టి నిలపడం, దాన్ని గురించి ఆలోచించడం, విస్మరించకపోవడం.*
*మనసు బలంగా ఉంటేనే పైన చెప్పినవి సాధ్యమవుతాయి. మనసు ప్రధాన లక్షణం- సంకల్ప వికల్పాలు. సంకల్ప బలం ప్రబలంగా ఉంటే ఆ తీరులోనే మన అవయవాలు పనిచేస్తాయి. దక్షత కలిగిన మనసు ఇంద్రియాలపై పట్టు కలిగి, తనకు కావలసిన పనులన్నీ చేయించుకుంటుంది. కోరికలన్నీ తీర్చుకుంటుంది. ఏ విషయాన్నైనా అనుభవించేది మనసేగాని ఇంద్రియాలు కావు. అవి కేవలం పనిముట్లే. అందువల్ల ఇంద్రియాలకు లేదా భౌతిక విషయాలకు సంబంధించి ఎటువంటి ప్రతికూల పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే వాతావరణాన్ని మనసు నిర్మించుకోవాలి. మనసు శుద్ధంగా ఉంచుకోవటం వల్లనే ఇది సాధ్యమవుతుంది.*
*పరిశుద్ధమైన మనసులో చెడు ఆలోచనలు ప్రవేశించవు. ఏ విషయం గురించైనా, ఏ మనిషి గురించైనా అనుకూల ధోరణిలో ఆలోచించ గలుగుతుంది. దురాశ, మోహం, మోసం, ఈర్ష్య, ద్వేషం, కోపం వంటి గుణాలను మనసులోంచి తరిమివేయగలిగినప్పుడు మనసు క్షాళితమవుతుంది. మాలిన్య రహితమైన మనసు దృఢంగా ఉంటుంది. మానసికంగా శక్తిమంతుడు జీవితంలో అనివార్యమైనవాటికి ఎన్నడూ భయపడడు. వాటిని ధైర్యంగా గంభీరంగా స్వీకరిస్తాడు. సుఖాన్ని, దుఃఖాన్ని ఒకేలా ఆస్వాదించగలుగుతాడు!*
*ధర్మం శరణం గచ్ఛామి।*
*సంఘం శరణం గచ్ఛామి।*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి