*12 - భజగోవిందం / మోహముద్గర*
💕💕💕💕💕💕💕💕💕💕💕💕
*భజగోవిందం శ్లోకం:-10*
*వయసిగతే కః కామవికారః శుష్కేనీరే కః కాసారః।*
*క్షీణేవిత్తే కః పరివారఃజ్ఞాతే తత్త్వే కః సంసారః॥ భజ ॥10*
*ప్రతి॥* వయసి = వయస్సు; గతే = మళ్ళిన తరువాత; కామవికారః = కామ వికారము; కః = ఏమి? ఎక్కడుంటవి? నీరే = నీరు; శుష్కే = ఇంకిపోతే; కాసారః = సరస్సు అనేది; కః = ఏది? ఎక్కడుంది? విత్తే = డబ్బు; క్షీణే = తగ్గిపోయిన మీదట; పరివారః = పరిచారకులు; కః = ఎవరు? ఎక్కడుంటారు?; తత్త్వే = సత్యము, జ్ఞాతే= తెలిసిన యెడల; సంసారః = ఈ సంసార లంపటం; కః = ఎక్కడ ఉంటుంది?
*భావం:-*
వయసు గతించిన తరువాత మోహం ఎక్కడుంటుంది? నీరు ఇంకి పోయిన తర్వాత సరస్సు యింకేం మిగుల్తుంది. డబ్బు పోయాక పరిచారకు లెందు కుంటారు? అలాగే సత్యం తెలిసినట్లయితే యింకా సంసారలంపటంఎందుకుంటుంది?
*వివరణ:-*
ఇక్కడ నాలుగు వాక్యాల్లో నీతిని రచించారు శంకరులు. వీటికి ఆధారమైన ఆ నీతి యేమంటే కార్యకారణాల్లో కారణం అనేది యెప్పుడయితే నశించిపోతుందో అప్పుడు కార్యం అనేది వుండటానికి వీల్లేదనటం, వయసు వెళ్ళిపోతే అన్నప్పుడు యౌవ నం గతించినప్పుడని అర్థం. యౌవనం ఖర్చయితే యింకా మోహోద్రేకం దాని చేష్టలు యెలా మిగుల్తాయి? ఉధృతమైన కామం కళ్ళు మూసికొని పోయేంత రసోన్మా దం శరీరం మీద భగవదనుగ్రహంచేత ప్రకాశించిన ఆ యౌవనం వుండి, చర్మం బిగువు పై, కండలు కఠినమై రక్తం వేగవంతమైవున్నప్పుడే కలుగుతుంది. యౌవనం జారి పోయిన తరువాత మోహోద్రేకం ఉదయించదు. కారణం లేకపోతే కార్యం జరగదు కనుక.
సరస్సులో నీరెండిపోయినట్లయితే అది సరస్సుగా పరిగణింపబడదు. ఆ యెండిన చోటు వట్టి పఱక భూమి మాత్రమే అవుతుంది. సరస్సు కాదు గదా అలాగే మనసులో కోరికలనే నీరు చలిస్తున్నంత వరకూరసాత్మకుడైన యువకుడు వాటిని పరి పూర్తి చెయ్యటానికి ఉద్యమిస్తాడు. కాని కోరికలనే నీరు ఎండిపోయిన తరువాత ఈ సంపాదించటం ఈ స్త్రీ లౌల్యంలో పడటం అనేవి ఎలా చేయగలుగుతాడు మనిషి?
అలాగే సంపద తగ్గిపోయిన తరువాత బంధువులు, ఆశ్రితులు సహాయకులు ఒకరనేమిటి అతడి సర్వపరివారమున్నూ ఎందు కుంటారు. ఇంకా అంటిపెట్టుకొని? మనిషి వీళ్ళందరి యోగక్షేమాలను ఎంతవరకు చూడగలుగుతాడో అంతవరకే - అతడి నుంచి తమకు ఉపయోగమున్నంత వరకే వాళ్ళు అతడిని అనుసరిస్తారు. ఆ శక్తి అతడి నుంచి ఉడిగితే పరివారం మాయమై పోతుంది. ద్రవ్యమనేది ఎంతకాలం వుంటుందో చెప్పటానికి వీలులేనట్టిది. లక్ష్మి రాకడగానీ పోకడగాని తెలియదు. ఒకని వద్దవున్నట్టిదే హఠాత్తుగా నిస్సంకోచంగా అతడిని దారిద్ర్యానికి తోసేసి ఇంకొకడి వద్దకు వెళ్ళి పోతుంది.
ఈ మూడు ఉదాహరణముల వల్లనూ కారణం ఎప్పుడైతే తగ్గిపోతుందో కార్యమనేది నడవదనే సంగతి విదితమైంది. ఈ సూత్రాన్ని ఆధ్యాత్మిక పరిపూర్ణతలనే విషయానికి అన్వయించి శ్రీ శంకరులు అంటారు - తత్వజ్ఞానం తెలిసిన తర్వాత ఈ సంసార లంపటం ఇంకా ఎలా వుండగలుగుతుంది? అని.
ఆ చోటు ఒకానొక స్తంభమున్నదని తెలియక పోవడంవల్ల దాన్ని దయ్య మనుకోవడం కద్దు. ఆ మీద ఆ భ్రమకు అనుబంధమైన భయములనేకం ముసరటం జరుగుతుంది. అనగా వాస్తవమైన సత్యపదార్థం చూడని కారణంచేత భ్రాంతి చెందిన వాడికి ఈ దుఃఖ పుంజములు వచ్చి బాధిస్తూ వుంటవి, ఈ వాస్తవం తెలియని కారణమేమంటే వాసనలనేవి ముసిరిన 'అవిద్య' అనే అజ్ఞానమే. సత్య పదార్థాన్ని అను భూతిలోకి రాకుండా చేస్తది. మనిషికి మిగిలింది ఈ బాహ్య ప్రపంచంలోని అసం పూర్ణతలు. వాటిని పరిపూర్తి చేయటానికి కోరికలు దానికి ప్రణాళికలు ఆపైన పనులు, వాటికి ప్రయత్నాలున్నూ ఇదంతా ఎలాగయినా పరిపూర్ణత నందుకోవ లెననే ఆశయం వల్లనే ఈ జంజాటంలో వుండి తనకంటికి ఎదుటనున్న దానిని చక్కగా గ్రహించలేక తిరగబడుతూ వుంటాడు. తన యింద్రియాలు చూడగలిగిన దుంగను దయ్యమనుకోవటమే తిరగబడట మనవచ్చు.
క్రిందటి శ్లోకంలో చెప్పినట్లు తప్పుగా భావించకపోవటం అనేది వాసనలు లేకుండా పోయినప్పుడే అలవడుతుంది. దానినే యింకో విధంగా చెప్పాలంటే అజ్ఞానం పోయినప్పుడే ఈ తప్పుగా అర్థం చేసుకోవటమనేది పోవుననవచ్చు. ప్రతి వస్తువూ పదార్థం కూడా భగవంతుడే అయివుండగా ఆ భావంతో మాత్రమే చూచి వూరుకొనక, నేను-నాకు పనికి వచ్చేదియిది. నాకు పనికి రాంది యిది - అనే మమత్వభావంతో- ప్రపంచాన్ని మాడటం వల్లనే, మనిషి బాధపడటం కలుగుతోంది. ఈ భావం వల్లనే అతడు బాధితుడై పోతున్నాడని అర్థం.
జ్ఞానోదయంవల్ల ఈ వాసనలు అంతమొందిన వయితే అప్పుడు ఈ బాధ పడటమనే కార్యానికి కారణమైన ఆ భావం నశించి పోయి వుంటుంది. - కనుక సహజంగా ఈ ఫలితాలు - బాధలు కూడ వుండవని అర్థం - సత్యం తెలిసికొన్నాక అబద్ధ మైనదని భావించటం ఇంకా ఎలా వుంటుంది? అది పాతినదుంగ మాత్రమే అని తెలిసిన తరువాత దయ్యం అనే నూతనంగా వచ్చిన భావం ఎలా వస్తుంది? దాని వల్ల యింకా బాధపడటం - ఎక్కడుంటుంది?
ఈ మన బంధనానికి కారణం అంతర్గత జీవితం వాస్తవానికి - భిన్నమైన బంధమును కట్టుకోవటమే ఈ బయటి ప్రపంచములోని వస్తువులకంటే భిన్నమై నేను వున్నానని అనుకొనే “అహం” దానికి కారణం. ఈ అహంతో కలిసి దాని అర్థంలేని పనులూ, వ్యక్తిత్వమనే ఒక విచిత్రమైన స్థితికూడ కారణమే చెప్పవచ్చు. అంతర్గతంగా వాసనా స్థితి మారితేనే కాని అహం అనేది నశించదు. అహం లేనప్పుడే చుట్టూచూసి తెలిసికొని మనం అనుభవించే ఈ ప్రపంచమే యధాతధంగా లేకుండా పోతుంది. అంటే రాగం ద్వేషం మొదలైన వాసనలు లేవు గనుక రంగుటద్దాలు తీసివేసి చూసినట్లు ఆకర్షణలు లేని వస్తువులు కనపడతవి గనుక అవన్నీ ఆ అనంత సత్యపదార్థ భాగాలుగా మాత్రమే దర్శన మిస్తాయి. ఈ దర్శనముతో వ్యక్తిత్వమనేది అంతమయిపోతుంది. సర్వవ్యాపకుడైన సత్యపదార్థతత్వమే ఈ చూపే తనకు కూడ సంక్రమించుతుంది.
బ్రహ్మను ఎఱిగిన యాతడు బ్రహ్మమే " బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి' ఇందు కు ఇంకో మార్గం లేదు. "నాన్యః పంథా విద్యతే అయనాయ " ఈ శ్లోకంలో చర్చించి న దొక్కటే మార్గము.
*సశేషం*
♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి