5, నవంబర్ 2024, మంగళవారం

*11 - భజగోవిందం

 *11 - భజగోవిందం / మోహముద్గర*

🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑🫑


*భజగోవిందం శ్లోకం:-9*


*సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వమ్|*

*నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః ॥ భజ ॥9*


*ప్రతి॥* సత్ = మంచివారి; సంగత్వే = సాంగత్యము వలన; నిస్సంగత్వం = సంగత్వమే లేకుండుటయు- అనగా అసంగుడై వుంటాడు; నిస్సంగత్వే = అసంగుడై యుండుట మున; నిర్మోహత్వమ్ = మోహవిభ్రాంతి తొలుగుతుంది; నిర్మోహత్వే = మోహ దారుడు కావటంవల్ల; నిశ్చల =  స్థిరమైనట్టి; తత్వం = సత్యపదార్థదృష్టి (వస్తుం ది); నిశ్చలతత్వే = సత్యపదార్థ దృష్టి ద్వారా; జీవన్ముక్తిః = జీవిత కాలము లోనే ముక్తి లభిస్తుంది.


*భావం:-*


మంచివాళ్ళ సాంగత్యంద్వారా అసంగత్వం అలవాటవుతుంది. అసంగత్వం వల్ల మోహభ్రాంతి అనేది రాదు. దాని నుండి విముక్తి అవుతాము.మోహం ఎప్పుడయితే దూరమయిందో సత్యపదార్థ దృష్టి స్థిరమై నిలుస్తుంది. ఆ దృష్ట్యా అనుభవం గడించినప్పుడు ఈ జీవితంలోనే ముక్తి లభిస్తుంది.


*వివరణ:-*


ముందు చెప్పిన శ్లోకాలను బట్టి ఒక విషయం విదతమయింది. ప్రపంచంలో బ్రతకటానికిగాను సంపాదించటం, కూడ బెట్టడం మాత్రమే లక్ష్యం కాదు. అది నిజమైన హితమే కాదు రాగ మనేదాన్ని పెంచుకోవటం మమత్వాన్ని వృద్ధిపరచుకోవటం


అనేవి కించిన్మాత్ర ఫలితం కోసం వేసిన జీవిత కార్యక్రమం మాత్రమే. జీవితాన్ని మోహవిభ్రాంతిలో రసోన్మాగంలో వెచ్చించుట మనకున్న యోగ్యతలనన్నిటిని వ్యర్థంగా బూడిదలో పోయటమే. అందుకనే ఆదోవల్లో మనసు నడవకుండా ప్రతిపక్ష భావన ద్వారా మనసును వాటినుంచి వెనక్కు మళ్ళించాలి. అలా చేస్తే శక్తి ఖర్చుకాక కూడబెట్ట బడుతుంది. ఆ కూడబెట్టబడ్డ శక్తిని గోవిందు అన్వేషణలో అతడి సేవనంలో వినియోగించాలి.


 వేదాంతం చెప్పే ఈ తర్కం తెలిసికోవటం తేలికయినదే కాని దాని ప్రకారం నడవడమనేది అన్ని వేళలా సాధ్యమయేది కాదు. అది చెప్పిన విధంగా జీవితాన్ని నడపా లంటే క్రొత్తగా ఆరంభించిన సాధకుడికి ఎంతో కష్టమవుతుంది.  ఈ చిక్కు లోగాని ఏ కాలం విద్యార్థులకు అడ్డుతగిలి చికాకు పెట్టడం మానలేదు. ఈ చిన్న వాస్తవం ప్రతి వేదాంతీ కూడ ఒప్పుకు తీరాలి. అందుకనే అతడు తన శిష్యులకు ఈ దోవను నడిచే ఉపాయం యేదో వెతికి చూసి మరీ చెప్పాలి. నిజానికి శిష్యుడి మనస్సులో నున్న ఆధ్యాత్మిక బలమే చాలకొద్ది. అతడికీ అడ్డంకుల నుంచి తప్పుకొని దోవనడవటంలో సహాయం ఇవ్వటం చాలా అవసరం.


ఆలా కాకపోతే వేదాంతము అనేది ఆచరణయోగ్యము కానట్టి అరణ్య వాసమయిపోయేది. శ్రీ శంకరులు ఎప్పుడు యేది చెప్పినా సాధకులకు ముఖాముఖీ వ్యక్తం చేసి చెప్పారు. ఆయన బోధనా పద్ధతి పూర్వపు ఋషుల పద్ధతి వంటిది కాదు. పూర్వులు అసంభవమను కొనదగినట్టి అనంతానందాన్ని సంభవం చేసికొని దానిచేత ఉత్తేజితుడై కండ్లు మూసికొని కూర్చొని తాము ధ్యానంలో దర్శించిన సత్యాన్ని గూర్చి ప్రపంచానికంతటికీ అనగలిగిన ఉచ్ఛస్వరంతో గుంభనతో కూడుకొన్న కొన్ని మాటలు వినిపించేవారు. ఆ సూత్ర మూలాన్ని పరిపాలించకపోతే కలిగే దుఃఖమును ఆదేశిస్తూ కటువుగా బోధలు వినపడేవి. ఈ మాటలే శాంతియుతులైన బోధకులు హృదయ కమలాల్లోంచి వెడలినవై ఉపనిషత్తులైనాయి. శ్రీ శంకరులు దేశంలో సాంస్కృతిక పునరుద్ధరణం నెలకొల్పటానికి సన్నద్ధుడైన మత ప్రచారకులు. ఆ ప్రకారముగానే తన శిష్యులు యెంతటి యెలాంటి గ్రహణ శక్తి కలిగి వున్నవారో ఆయన యేనాడూ కూడ మరిచినట్లు కనిపించదు.


ఈ శ్లోకంలో శ్రీశంకరులు సాధకులకు ఒక నిచ్చెనవంటి మెట్ల మార్గాన్ని ప్రసాదించారు. అదే వారిని అభివృద్ధికి తీసుకొని పోగలుగుతుంది. పరిపూర్ణత అనే దాని అత్యంత మహోన్నత శిఖరాల నందేవరకూ ఈ నిచ్చెన ఎంతో సహాయకారిగా సాధకునికి పనిచేస్తుంది.


వేదాంతానికి ఆదరణగా నున్న వెనుక చర్చించిన ప్రాతిపదికను అర్థం చేసుకొన్నప్పటికీ, క్షణక్షణమూ మనం జీవితంలోని మనోవికార హేతువుల మధ్య కామినీ కాంచనాల కుహనాకర్షణముల కూడలిలో బ్రతుకుతున్నామన్నది వాస్తవమైన ఎషయము. నాకున్న రసోన్మాద భావనలకు నాకున్న మోహపూర్ణ మైన ఆలోచనలకు కళాత్మకంగా కొన్ని అడ్డుగోడలు జ్ఞానయుతం చేసి కట్టుకొంటానేమో గాక; అలా గోడలుకట్టి వాటి మామూలు ప్రవాహాన్ని కొంతకాలం ఆపుతానేమో గాక; కాని మరులు కొల్పేవస్తుసము దాయం మనచుట్టూర అనంతమై వుండుటవలన కలిగే భ్రమ మహాబలవత్తరమైన దవటం వల్లనూ సాధకుడు వాటికి వ్యతిరేకంగా నిలిచి నిరంతరం వాటిని ఆపగలగటం అతడికి చేతగాని పని అనిపిస్తుంది.


సాధకుడు మొదటి రోజుల్లో ఎంతో కష్టపడి ఆధ్యాత్మ సంబంధమైన ఉన్నతికి ప్రయత్నాలు చేస్తూ వుంటాడు. అతడికి మద్దతుగా కొంత ధైర్యం తగిన శక్తి యివ్వటాని కిగాను శ్రీ శంకరులు ఒక మార్గం సూచించారు. అది సత్సంగము అనగా మంచితో సంబంధమని అర్థము. ప్రతిపక్ష భావనను ఆచరించి మనసులో మంచి ఆలోచనలను పెంపొందించు కొంటూనే వుంటాడతడు. ఇవెందుకంటే లోనుంచి పెల్లుబికే ఉద్రేకాల ను అణచుకోటానికి ఉపయోగపడుతవి. కాని బాహ్య ప్రపంచం నుంచి కొన్ని ప్రేరణ లు వచ్చిపడతవి. వాటినుంచి తనను కాపాడుకోడానికి ఒక కోట కట్టుకోవాల్సి వుంటుంది. ఆ కోటే శ్రీ శంకరులు చెప్పే సత్ సాంగత్యము, మంచివారితో స్నేహము సదా లోచనలు చేసే వారితో స్నేహము.


సజీవులైన గురువులతో విద్వత్తులతో, సభ్యత కలిగిన వారితో మన స్ఫూర్తిగా సత్ పదార్ధాన్ని అన్వేషించే సాధకులతో సహవాసం చెయ్యాలి. ఇవేవీ కుదరని సమయంలో మంచి పుస్తకాల ద్వారా సత్ పదార్థ విషయం తో పరిచయం వుంచుకోవటం చెయ్యాలి.


మనం మనచుట్టూ చేర్చిన సాంగత్యం చాలా ముఖ్యమైనది. ప్రపంచములో సాధకులు తమ స్నేహితులను యెంచుకోవటంలో చాలా అజాగ్రత్తను కలిగి వుంటున్నా రు. దాని ఫలితం ఆ సాధకుడికి కొంత విషయ పరిజ్ఞానం నిశ్చయాత్మకమైన మనసూ వుండి కూడా దుస్సాంగత్య దోషం వల్లనూ గుడ్డిగా పాటించే రసోద్రేకాల వల్లనూ అతడి కున్న జ్ఞానం కాస్తాలాగి వేయబడగా చెడి పోతున్నాడు. మంచి వారితో స్నేహం అంటే అర్థమేమిటంటే పరమేశ్వరుని భక్తులెవరో వారితోనూ పరమేశ్వరుని అన్వేషించే సాధకు లతోనూ స్నేహమని అర్థం. అలాంటి సంఘంలో ఒకానొక శక్తి ఉద్భవిస్తుంది. ఆ సమావేశం వల్ల ఆశక్తి ఒక బలవత్తరమైన కోట నిర్మిస్తుంది. అదే ఈ బాహ్య ప్రపంచములోని మాంత్రికమైన తమాషాలనే - వీటినుంచి నిన్ను రక్షించేది.


సత్సాంగత్యమనే దాని ఫలితంగా మనుష్యుని మనస్సు క్రమంగా ఒక స్థితిని సంతరించుకొంటుంది. ఇంద్రియ విషయాల ఆకర్షణలో పడకుండా వుండే స్థితి అది ఆ స్థితిలో తన కొఱకు కాని పనులు మాత్రమే కర్తవ్యంగా చేస్తాడు. దానివలన అసంగత్వమనే దాని రహస్యం మనసుకు అర్థమవు తుంది. దీన్నే నిస్సంగత్వమనేది. ఈ నిస్సంగత్వ మనేది హృదయాంతరాళలో సుస్థిరమై నిలిచే పరిస్థితిలో మోహమనేది హృదయం నుంచి విసర్జించ బడుతుంది. అనగా మనం రంగుటద్దాల్లోంచి చూచి వస్తువులకు అబద్ధపు విలువులు గట్టివాటిని ప్రేమించటం ద్వేషించటమనే విభ్రాంతి నుంచి బయటపడతామని అర్థం. ఇదే నిర్మోహత్వమనే స్థితి.


ఈ నిర్మోహత్వ స్థితిలో వస్తువులని యధాతధంగా చూసి అర్థం చేసికోగలం. ఎందుకంటే వాసనలనే రంగు అద్దాలు మనసుకు లేవు కదా! వస్తువులకు మెరుగువల్ల కలిగిన విలువలు మనసు కెక్కవు. వాటి నిజమైన సత్యమైన పరిణామం పరిస్థితి మనసుకు వాస్తవంగా అర్థమయే సూచన కలుగుతుంది.అదే ఆ యచ్యుతుని తెలిసికోవటాని కిచ్చే సూచన. ఈ సూచన అలా నిలిచి మనోబుద్ధి చిత్తహంకారాల్లో కూడ అలా నిలిచిపోతే, సుస్థిరమైతే, భగవంతుని మనం చూచిన వాళ్ళమే అవుతాము. కాదు- గుర్తించిన వాళ్ళమే అవుతాము. ఎక్కడ గుర్తించటం? మనం దేన్ని సమ్యగ్విధాన చూస్తు న్నామో దానిలోనట్లే భగవంతుడిని గుర్తించిన వాళ్ళమవుతాము. అది జీవన్ముక్త స్థితి. ఈ శ్లోకంలో ఉత్కృష్ట స్థితికి ఎక్కటానికిగాను చెప్పబడ్డ ఈ నిచ్చెన- గీతలో చెప్ప బడ్డ మరోరకమైన నిచ్చెనను జ్ఞాపకానికి తెస్తుంది. అది పతనాని కయినట్టి దిగేందుకయిన నిచ్చెన *"సంగాత్సంజాయతేకామం - కామాత్రోధోభి జాయతే।* *క్రోధాద్భవతిసమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః॥* *స్మృతిభ్రంశాద్బుద్ధి నాశో బుద్ధినాశాత్ర్పణశ్యతి....”*


ఈ రెండు శ్లోకాలనూ చూస్తే గీత పతనమయేందుకయిన నిచ్చెనను వర్ణించగా శ్రీ శంకరులు పైకి ఎక్కేందుకయిన నిచ్చెనను వర్ణించినారని తెలుస్తుంది. ఈ శ్లోకం లో'' నిశ్చలతత్వం" అనే పదానికి బదులు "నిశ్చలత్వం" అనే పదంతో అర్థం చెప్పుకోవటం కూడా కద్దు మనసులోని భ్రాంతి ఎప్పుడయితే పోయిందో మనస్సు ధ్యానంలో యేకాగ్రతనిస్తుంది. ఈ యేకాగ్రతతోనే ఆ మహోన్నత పదార్థాన్ని మనం అనుభూతి లోకి తెచ్చుకోగలం: ఆ తరువాత జీవన్ముక్త స్థితిని పొంద గలుగుతాము.


*సశేషం*

💐💐💐💐💐💐💐💐💐💐💐💐

కామెంట్‌లు లేవు: