5, నవంబర్ 2024, మంగళవారం

14 - భజగోవిందం

 *14 - భజగోవిందం / మోహముద్గర*

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴


*భజగోవిందం శ్లోకం:-12*


*దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిర వసన్తౌ పునరాయాతః।*

*కాలః క్రీడతి గచ్ఛత్యాయుః తదపి న ముంచ త్యాశావాయుః॥ భజ ॥12.*


*ప్రతి||* దినయామిన్యౌ = దివారాత్రాలు; సాయం ప్రాతః = ఉదయ సాయంకాలాలు; శిశిర వసన్తౌ = శిశిర కాలము వసంత కాలము కూడ; పునః పునః = తిరిగి తిరిగి; ఆయాతః = వస్తూ వుంటవి; కాలః = కాలము; క్రీడతి = ఆడుకొంటుంది; ఆయుః = జీవిత కాలము; గచ్ఛతి = వెళ్ళి పోతూవుంటుంది; తదపి = అయినా సరే; ఆశావాయుః = ఆశ అనే ఊపిరి (గాలి దుమారం); న ముంచతి = వదలదు.


*భావం:-*


దివారాత్రాలు,ఉదయ సాయంత్రాలు, శిశిర వసంతాలు మొదలైన ఋతువులు మళ్ళి మళ్ళీ వస్తూంటాయి. పోతూ వుంటాయి. కాలం అలా ఆడుకొంటూ వెళ్ళిపోతుంది. జీవిత కాలం వెళ్ళి మారిపోతూ వుంటుంది (ఆగదు). అయినా సరే మనిషిని ఆశ అనే గాలిదూమారం వదలదు.


*వివరణ:-*


పగలు అనేది కృషించిపోయి రాత్రియందు అంతమవుతుంది. రాత్రి నశించి పోయి మరునాటి ఉదయంగా వెలుస్తుంది. ఉదయము ఉజ్వలమైతే వేడెక్కి మధ్యాహ్న మవుతుంది. `తిరిగి తగ్గిపోయి సంధ్యారాగంలో కలిసిపోతుంది. సంఘటనల చక్రంలో రోజులు మాసాలు కదిలి జారిపోతూ ఉంటాయి. మెత్తని ఈ ప్రయాణంలో క్షణ కాలమైనా ఆగటమనేది సంభవంకాని కాలం, ఋతువులు సంవత్సరాల ప్రవాహంగా వెళ్ళిపోతూ వుంటుంది. దాని అసమానమైన శక్తికి ముందేది వున్నా దాన్నికూడ దాటు కొంటూ వెళ్ళిపోతుంది. వయస్సు అదే - జీవిత కాల పరిమితి, ఆశ్చర్యంతో నోరు తెరుచుకొని చూస్తూ తెలియ కుండానే తన మురికి సమాధికి జారిపోతుంది.


కాలం కదిలిపోతుంటుంది, భవిష్యత్తు వర్తమానమవు తుంటుంది. వర్తమానం కూడ భూతమనే మహార్ణవంలో కలిసి అంతం లేనిదై పోతుంది. "కాలం ఆగదు- యేమన్నా సరే. ఎవరి కొఱకు కూడ ఆగదు. నిరంతరం ప్రయాణం చేసి అది మనిషి తన - భూతకాల జీవితమనే కోటలోంచి స్మృతులను పోగుచేసి తెచ్చు కుంటాడు. వాటిని అతడి వర్తమాన జీవితం వెలిగించి మెరిపిస్తుంది. ఈ వెలిగించటం అతడి రోజువారీ ఉద్రేకం ద్వారానే వెలిగిస్తుంది. అలా వెలిగించిన దాని నుంచి ధూమపు దొంతర్లు వచ్చి అతడి దృష్టిని దొంగిలింప చేస్తుంది. ముందుగతి యేమిటను కుంటూ భవిష్యత్తును గుర్చిన ఆదుర్దాలు ఎక్కువై జీవితం మొరటుదేలి బాధపడిపోతాడు. ఈ విధంగా అంతంలేని ప్రయత్నాలతో ఈ ఆపశక్యంగాని గాలంలోపడి మనలను మనం వ్యర్థపరచుకొంటూవుంటే మన ఊహలు- ప్రణాళికలు అన్నీ మనల్ని ఓడించి గేలిచేస్తూ పారిపోతాయి.


మహా ధృతిమంతుడైన నచికేతుడనే కుమారుడు ఈ హాస్యాస్పదమైన తామస పరిస్థితిని గుర్తించిన వాడై తండ్రియైన వాజశ్రవసునితో చెప్తాడు, "సస్యమివ మర్త్యః పచ్యతే సస్యమివా జాయతే పునః" పంటధాన్యం ఎలా మొలుస్తున్నదో అలాగే మనుష్యుడు కూడ పట్టుతాడు- అది ఎలా నశిస్తుందో అలాగే నశించి పోతాడు. అని చెప్పాడు, ఏది కూడశాశ్వతమయింది కాదని చెప్పటం.


ఆ యాధ్యాత్మిక వీరుడే ఆ తరువాత మృత్యు దేవుడి గృహాంగణంలో నిలబడి మృత్యు దేవునితో ముఖాముఖి మాట్లాడుతూ యముడు యివ్వచూపిన వరాలను తిరస్కరించి పై చెప్పిన విషయాన్ని మళ్ళీ ఉధృతమైన మాటల్తో చెప్తాడు. "అపి సర్వం జీవిత మల్పమేవ తవైవ వాహాస్తవ నృత్యగీతే'' ఎంత పెద్ద జీవితమైన నీవిచ్చేది పరిమిత మైందే కనుక అది చిన్నదే. నీవివ్వజూపే వాహనాలూ నృత్యగీతాలు అన్నీ నీవే వుంచుకో స్వామి అన్నాడు.


జీవితం కాలమనే దేవుని దయాప్రసరణము మీద ఆధారపడి యున్నది. కనబడటానికి అంతులేని నానా మనుష్యుడు ఈ విషయము గుర్తించక ఇంద్రియ విషయ లోలత్వమును కోరుతాడు. దానిచే ఆశించి ప్రయత్నించి, చెమటోడ్చి, సంపాదించడానికి దాచి పెట్టడానికి గొప్పగా నానాశ్రమలు పడతాడు. ఎన్ని ఊహలు ఎంతవ్యయం! కానీ, మృత్యువు అతని నుండి సర్వాన్ని ఒడిసి లాక్కొంటుంది. అన్నిటిని అతడు ఇక్కడ వదలి వెళ్ళవలసినదే, దుఃఖావృతమై ఆ జీవి నిర్గమించిపోతాడు. అతడు తీసికొని పోయేదల్లా తన స్వార్థ జీవితంలో కోరి, సంపాదించిన వాసనల మూట, కళ్ళకు రంగుల గంత ఒక్క టే, ఎంత శోచనీయము, ఎంత దుఃఖ భూయిష్టము.


వస్తువులు మోహం కలిగించేటంత అందంతో మెరిసి వ్యర్థమైన పాటలు పాడతవి, వాటినంత మనోహరంగా చిత్రించు కొనేది మనసేగదా! మనస్వప్నాల్లో ఆహ్లాదక రంగా వచ్చే అనుభవాలు ఎవరు చిత్రించినవి? మనస్సే కదా సృష్టించు కొన్నది! అలాగా యివి కూడా, కళ్ళు చెదరగొట్టే ఈ అందం లేదా మెరుపు మహోన్నత సత్యాన్ని మరుగు పరుస్తుంది. *"హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం”* ప్రకాశమానమైన సత్యపదార్థము యొక్క ముఖము బంగారు పాత్రతో కప్పబడింది. అని ఈశావాస్యోపనిషత్తు చెపుతుంది. అందుకనే ఉపనిచ్చాత్రుడు గురువు చెప్పిన సత్యమును గుర్తించలేక పోయినాడు. ''గురువు చెప్పినదేమంటే-- *“ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్'* అన్ని యిక్కడ యేదయితే వున్నదో అదంటే ఈశ్వరుడిచేత వర్ణింప బడియే వున్నది అని అర్థం. మనిషి తన పరిపూర్ణతను తాను గుర్తించక గూడ్డివాడు కావటానికి కారణం అతడి యింద్రియ విషయ కరములైన రసోన్మాదములే.


సీతాదేవికి బహుశ ఆ క్షణాన తన ప్రియుడైన శ్రీరాముని మీద అనంతమైన ప్రేమకంటే పారిపోయేటటువంటి భ్రమ కలిగించేటటువంటి ఆ బంగారు లేడి కావాల నే కోరిక తత్కాలాన తీవ్రతరమై వుందన్నమాట, ఇదే భ్రాంతియొక్క చెయిదము - మాయ యొక్క మహిమ.


జీవితం తెలీకుండా గడచి పోతుంది. ఇంద్రియ విషయాలను సమకూర్చటం వల్ల కోరిక అనేది చిలువలై పలువలై వృద్ధిని పొందుతూంటుంది. శరీరం కృశించి సడలిపోతుంది. అనుభవించటానికీ యిక శక్తిలేనంతటి స్థితికి దిగజారి పోతుంది. ఐనా సరే మనిషి యింద్రియలౌల్యమునకు ఆకలితో చూస్తూ వుంటాడు. మృత్యువు వెన్నం టి వుంటుంది కూడా అనారోగ్యం నాశనమూ అతడితో పాటే వుంటవి, ఈ సరంజా మా అంతటినీ వెంటబెట్టుకొని అతడి చింతలూ ఆదుర్దాలు అతడిని ఒక ఊరేగింపు లా కాట్లోకి తీసుకొని పోతవి. ఐనా - ఆ సమయాన కూడ మనిషి ఈ దుఃఖ భూయిష్ట మైన వస్తువులిచ్చే చిట్టి సంతోషాల కోసం పరితపించుతూ వుంటాడు.


వివేకంతో వర్ధిల్లు, కోరికలను వదలివేసేయి. ఈ మార్పు ఈ దుఃఖాన్ని కలిగించే ఈ మనో వికారాలను వెనుక నున్న సత్యపదార్థాన్ని తిలకించు అదే అన్ని విధాల సంతృప్తి నీయ గలిగింది. దానికయి రసోన్మాదం నుంచి వెనకకు మరల్చబడిన మనసుతో అన్వేషించు.


*సశేషం*

🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄🐄

కామెంట్‌లు లేవు: