11, డిసెంబర్ 2020, శుక్రవారం

ధార్మికగీత - 106*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత - 106*

                                    *****

         *శ్లో:- శ్రోత్రం  శ్రుతేనైవ  న కుండలేన ౹*

                 *దానేన  పాణి: న తు  కంకణేన ౹*

                *విభాతి  కాయః  కరుణాపరాణాం ౹*

                *పరోపకారేణ  న చందనేన ౹౹*

                                     *****

*భా:- లోకంలో పరోపకార పరాయణత గల ఉదారచరితులు అరుదుగా ఉంటారు. వారికి ఆ ఉదారగుణం పుట్టుకతో వచ్చిన సుగుణము. అటువంటి వారి మేని అవయవాల తీరుతెన్నులు ఒకసారి పరిశీలిద్దాం. 1. "శ్రోత్రము":- ఉపకర్తల చెవులు వేదాలు, వేదాంగాలు,  ఉపనిషత్తులు, శాస్త్రాలు,పురాణాల శ్రవణం చేత పునీతమై ప్రకాశిస్తుంటాయి. వారి చెవులకు భూషణాలు శాస్త్రాలే. కుండలములు కాదు. 2. "పాణి":- వారి చేతులు ప్రేమాదరాలతో పాత్రోచితమైన వివిధ దానాలు చేయడం చేత రాణిస్తుంటాయి. కంకణములు ధరించుట చేత మాత్రము కాదు.3."కాయము":- వారి శరీరము నిత్యము  పరుల కుపకారము చేయడం వలన భాసిస్తుంది. పరోపకారంలో   కర్ణుడు కవచ కుండలాలు, శిబి మాంసాన్ని శరీరాన్నుండి కోసి ఇవ్వడం, బలి ఆత్మార్పణకు సిద్ధపడి దానమివ్వడం ప్రమాణాలుగా చెప్పుకోవచ్చును. వారి మేను పరార్థంలో విరాజిల్లిందే కాని సుగంధభరిత చందనపు పూతతో కాదని గ్రహించాలి.  ఈ విధంగా దయామయుల లోకోపకార చరితలు  ఆచంద్రార్కము కీర్తింపబడుతూ, ప్రాతః స్మరణీయములు, చిరస్మరణీయములై, ఆబాలగోపాలానికి  ఆదర్శం అవుతున్నాయి. మానవాళి చెవితో జ్ఞానాన్ని ఆర్జిస్తూ, చేతులతో దానాన్ని, దేహంతో ఉపకృతిని చేస్తూ, జీవన సాఫల్యం సాధించాలని సారాంశము*.

                                 *****

                 *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: