మంచి ఔషధం..!ఇంగువ
ఘాటైన ఇంగువ వాడకం ఒకప్పుడు మనదేశంలోకన్నా ఐరోపా దేశాల్లోనే ఎక్కువట. క్రమంగా అక్కడ తగ్గి, మన వంటల్లో భాగంగా మారిపోయింది. దీనికి ఉన్న ఔషధ గుణాల కారణంగా గృహ వైద్యంలోనూ వాడుతున్నారు. ఇది అజీర్తికి మంచి మందు. అరటీస్పూను పొడిని అరకప్పు నీళ్లలో కలిపి తాగితే జీర్ణసమస్యలన్నీ తగ్గుతాయట. రెండు టీస్పూన్ల తేనెలో చిటికెడు ఇంగువకి కాస్త ఉల్లిరసం, తమలపాకు రసం కలిపి తీసుకుంటే బ్రాంకైటిస్, ఆస్తమా... వంటి శ్వాసకోశ వ్యాధులు తగ్గుముఖం పడతాయి. మూర్ఛరోగులకి ఈ వాసన చూపిస్తే ఫలితం ఉంటుందట. కాస్త ఇంగువ ముక్కని చిన్నపిల్లల మెడలో తాయెత్తులా వేస్తే ఆ వాసనకి సూక్ష్మజీవులేవీ దగ్గరకు రావనీ, ఫలితంగా రోగాలేవీ దరిచేరవనీ చెబుతారు. నెలసరి సమస్యలు ఉన్నవాళ్లు రోజూ మూడుసార్లు కాస్త ఇంగువని తేనె, మేకపాలల్లో కలిపి నాలుగు వారాలు తీసుకుంటే అవి తగ్గుతాయి. ఇంగువ పొడి కలిపిన నిమ్మరసంలో దూదిని ముంచి పిప్పిపంటిలో ఉంచితే నొప్పి తగ్గుతుంది. మధుమేహులు రోజూ రెండు టీస్పూన్ల కాకరకాయరసంలో పావుటీస్పూను ఇంగువపొడి కలిపి తాగితే రక్తంలో చక్కెర శాతం పెరగదట. కాస్త ఇంగువని నీళ్లలో కలిపి తాగితే మైగ్రెయిన్, తలనొప్పీ తగ్గుతాయి. లేదా టీస్పూను ఇంగువ, శొంఠిపొడి, కర్పూరం, మిరియాలపొడి పాలతో కలిపి పేస్టులా చేసి నుదుటమీద రాసినా మంచిదే. పుండ్లూ గాయాల నివారణకు ఇంగువను టింక్చర్‌లానూ వాడతారు. 1918లో స్పెయిన్‌లో వ్యాపించిన ఇన్‌ఫ్లుయెంజా నివారణకు ఇంగువనే వాడారట. ఇందులోని పదార్థాలు యాంటీ వైరల్‌గా పనిచేస్తూ స్వైన్ ఫ్లూ వంటి వాటిని నివారించే గుణాన్ని కలిగి ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఏ కారణంతో అయితేనేం... ఔషధగుణాలున్న ఇంగువని మనదగ్గరే పండించాలనుకుంటోన్న శాస్త్ర నిపుణుల ఆలోచన స్వాగతించాల్సిందే
గమనిక: ఇంగువ ఉపయోగించేటప్పుడు అది పండ్లకు తాకకుండా జాగ్రత్త పడవలెను. లేనియెడల పండ్లు వూడిపోతాయి జాగ్రత్త.
*********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి