11, డిసెంబర్ 2020, శుక్రవారం

మొగలిచెర్ల

 *కృప..కరుణ..*


నాలుగైదేళ్ల క్రిందట..మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆరాధానోత్సవం ముగిసిన రెండువారాల తరువాత ఒక శనివారం నాటి సాయంకాలం ఐదు గంటలప్పుడు..


"ఇక్కడ ఈరోజు రాత్రికి ఉండాలని వచ్చాము..మేము మొత్తం ఐదుగురుమున్నాము..మేము ఉండటానికి ఒక రూమ్ దొరుకుతుందా.." అని ఆ కుటుంబం మా సిబ్బందిని అడుగుతున్నారు.."రూములేవీ ఖాళీ లేవండి..అన్నీ ముందుగానే నిండిపోయాయి..మీరు ఉండాలంటే..ఒక రేకుల షెడ్ ఉన్నది..అందులో సర్దుకోవాలి..మంచాలు ఉండవు..నేలమీద పడుకోవాలి..చాపలు ఇస్తాము.." అని సర్దిచెపుతున్నారు..ఆ కుటుంబం తాలూకు వ్యక్తి నా దగ్గరకు వచ్చి.."ఇక్కడ మీరేనా ధర్మకర్త? ఎలాగైనా ఒక రూమ్ సర్దుబాటు చేయండి..మా అమ్మగారు పెద్దావిడ..డెబ్బైఐదేళ్ల వయసు..నేలమీద పడుకోలేదు..మేము ఎలాగో ఒకలాగా ఆ రేకుల షెడ్ లోనే సర్దుకుంటాము.." అని ప్రాధేయపడ్డారు..నేను సంకటం లో పడ్డాను..ఏమీ చేయలేని నిస్సహాయత..వాళ్ళను ఒక ప్రక్కన కూర్చోమని చెప్పి..మా సిబ్బందిని పిలిచి.." రేకుల షెడ్ లోనే ఒక మంచం ఏర్పాటు చేయమని చెప్పాను..ఆ కుటుంబాన్ని పిలిచి.."మీ అమ్మగారికోసం మంచం ఏర్పాటు చేసాము..సర్దుకోండి.." అన్నాను..సరే అని అన్నారు..పల్లకీసేవ ఎన్ని గంటలకు మొదలవుతుందో అని అడిగి తెలుసుకొని తమ పేర్లను నమోదు చేయించుకొని..స్నానాదికాలు ముగించుకొని పల్లకీసేవ కు వస్తామని చెప్పి వెళ్లారు..


ఆరోజు సాయంత్రం ఆ కుటుంబం పల్లకీసేవ లో పాల్గొన్నారు..పెద్దావిడ ఆ కార్యక్రమం అంతా  శ్రద్ధగా చూసారు..పల్లకీసేవ అయిపోయిన తరువాత..నా దగ్గరకు వచ్చి..

"నువ్వు శ్రీధరరావు ప్రభావతి గార్ల కుమారుడివా.." అని అడిగింది..అవును అన్నాను.."నీతో మాట్లాడాలి.." అన్నది ప్రక్కన కుర్చీలో కూర్చుని.."చెప్పండి.." అన్నాను..


"నా పేరు కృష్ణవేణి..నేనూ మావారు ఈ స్వామివారు సిద్ధిపొందిన ఆరేడు నెలలకు ఇక్కడికి వచ్చాము..అప్పటికి మా పెళ్లి జరిగి పదేళ్లు..సంతానం లేదు..చాలా క్షేత్రాలు తిరిగాము..అందరు దేవుళ్లకూ మొక్కుకున్నాము..అప్పుడు మేము ఒంగోలు లో వుండేవాళ్ళము..మా బంధువుల్లో ఒకరు మమ్మల్ని మొగిలిచెర్ల వెళ్లి ఈ స్వామివారి దగ్గర నిద్ర చేయమని చెప్పారు..సరే అని ఇక్కడికి వచ్చాము..ఆనాడు ఏ వసతులూ లేవు..మేము ఈ గుడికి వచ్చే సమయానికి మీ అమ్మా నాన్న గార్లు ఇక్కడ వున్నారు..ఈ స్వామివారి తల్లిగారైన వెంకట సుబ్బమ్మ గారితో మాట్లాడుతూ వున్నారు..మా వివరాలు కనుక్కున్నారు..ఇలా నిద్ర చేయాలని వచ్చాము అని చెప్పగానే..వెంకట సుబ్బమ్మ గారు తనతో పాటు తన గదిలో ఉండమని చెప్పారు..అలా అనుకోకుండా స్వామివారి తల్లిగారి ప్రక్కనే వుండే భాగ్యం కలిగింది..ఆ పూటకు మీ అమ్మగారు మాకూ...సుబ్బమ్మ గారికీ కూడా భోజనం ఇంటినుంచి పంపారు..మాకెందుకో స్వామివారి కరుణ ఈరూపం లో మామీద పడినట్లు అనిపించింది..


ఆరాత్రికి ఈ స్వామివారి మందిరం దగ్గరే..అప్పుడు ఈ మంటపాలేమీ లేవు..ఒక్క తాటాకు పందిరి మాత్రం ఉంది..ఆ పందిరి క్రిందే నిద్ర చేసాము..గాఢ నిద్ర పట్టింది..ఉదయం లేచి స్నానం చేసి..పూజారి గారు వచ్చిన తరువాత పూజ చేయించుకొని..స్వామివారి సమాధి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అవుతుంటే..వెంకట సుబ్బమ్మ గారు నా దగ్గరికి వచ్చి..రెండు అరటిపళ్ళు ఇచ్చారు..

స్వామివారి ప్రసాదంగా భావించి వాటిని తీసుకున్నాను..ఆమె కాళ్లకు నమస్కారం చేసుకున్నాము..ఒంగోలు వచ్చిన మూడు నెలలకు నేను గర్భవతి నయ్యాను..వీడు పుట్టాడు..వీడికి నామకరణం, అన్నప్రాసన అన్నీ ఈ స్వామివారి సమక్షం లోనే..మీ అమ్మా నాన్నగార్లు, స్వామివారి తల్లిగారు ఆశీర్వాదం తో జరిపించాము..మరో సంవత్సరం కల్లా..మా వారికి మరో ఉద్యోగం చండీగఢ్ లో వచ్చింది..అక్కడికి వెళ్లిపోయాము..ఆ తరువాత రెండు మూడు సార్లు వచ్చాము..వచ్చినప్పుడల్లా మీ తల్లిదండ్రులను..వెంకట సుబ్బమ్మ గారిని తప్పకుండా కలిసి వెళ్ళేవాళ్ళము..ఉద్యోగరీత్యా అటువైపే ఉండటం వల్ల మళ్లీ రాలేకపోయాము..మా ఇలావేలుపు గా ఈ స్వామివారినే కొలిచేవాళ్ళము..ఇప్పటికీ ఈ స్వామివారి చిత్రపటం మా పూజా మంటపం లో పెట్టుకొని ఉన్నాము..

ఈ మందిరం లో చాలా మార్పులు చేశారు..ఈరోజు పల్లకీసేవ చూస్తుంటే..కళ్ళకు నీళ్లు ఆగడం లేదు..మా వారు వుండివుంటే ఎంతో సంతోషించేవారు.."అన్నారు...


పరిపూర్ణంగా స్వామివారి కృపను పొందారు కృష్ణవేణి గారు అనుకున్నాను..శ్రీ స్వామివారు సిద్ధిపొందిన తరువాత సుమారు పదిహేను సంవత్సరాల పాటు, స్వామివారి తల్లిగారు ఇక్కడే వున్నారు..ఆ తరం వాళ్లలో చాలామందికి స్వామివారి తల్లిగారు పరిచయం వున్నారు..


"సార్..ఈరోజు రూమ్ బుక్ చేసుకున్న వాళ్లలో ఒకరు ఇంతవరకూ రాలేదు..ఆ రూమ్ ను వీళ్లకు కేటాయిద్దామా.."అంటూ మా సిబ్బంది నన్ను అడిగారు.."అమ్మా కృష్ణవేణి గారూ ఆనాడే కాదు..ఇప్పుడు కూడా స్వామివారు మీకు వసతి ఏర్పాటు చేశారు.." అన్నాను..


"నిజమే నాయనా...మా కుటుంబం పట్ల స్వామివారి దయ ఎప్పుడూ ఉంది.."అన్నారు నీళ్లు నిండిన కళ్ళతో కృష్ణవేణి గారు..ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయం కృష్ణవేణి గారి కుటుంబం..శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..తృప్తిగా తమ ఊరికి వెళ్లారు..


సర్వం..

దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: