🌹🌹🌹🌷🌷🌹🌹🌹
సీతావిరహంలోవసంతం
-రామునివేదన!
విశ్వనాధ!
చ:-
పూవుల వింటి జోదు మఱి పూర్వపు మాదిరి కాదు క్లిష్టమౌ
త్రోవలు చూచి లొద్దుగల దుమ్ములు కన్నులఁ జల్లుఁ తంగెడుం
బూవుల నిండు గుత్తులయి పొల్చెడు కారపు టుండలన్ గనుల్
క్రేవల గొట్టు వట్టి యప కీర్తి గడించె అయోధ మార్గుడై { వి. రా. క.వృ. కి. నూపుర. 16 }
శ్రీరామునకు సీతా విరహం ఎంత దుస్సహంగావుందో ఈ రాముని వచనం మనకు తెలుపుతుంది.
మన్మధుడు పూర్వము వలె కాదు. శత్రువును జయించడానికి అతడిప్పుడు క్లిష్టమైన మార్గాల నెన్నుకొని లొద్దుగు పూల పరాగాన్ని కన్నుల్లో జల్లుతున్నాడు. అంతే కాదు తంగేడు పూల గుత్తులు అనే కారపుటుండల్ని కన్నుల్లో కొట్టుతున్నాడు. అధర్మ యుద్ధం చేస్తూ గొప్ప అయోధ మార్గుడైనాడు.{ ఏ విధంగాను దొరకని మోసగాడు }
కావ్య రస సంబంధి. రసము ఎచ్చట ఉండును? శబ్దార్థముల లోనా? అలంకారముల లొనా? కాదు. కావ్యమును పఠించు సహృదయుని యందు ఉండును. సహృదయుడనగా ఎవడు? కావ్యము చదువువారందరు సహృదయులు కాదా? నిశ్చయముగా కాదు. ఎవడు ఇతరుల యొక్క కష్ట సుఖముల యందు తాదాత్మ్యమును పొంది తనవిగా భావించి, అనుభూతి పొందునో వాడు సహృదయుడు. ఇతరుల కష్టమునకు హృదయము కరుగగా కన్నీరు పెట్టుకొను వాడు సహృదయుడు. అది అందరకు సాధ్య మగు విషయము కాదు. అచ్చమగు మనస్సు కలవారికే అట్టి భావనలు ఉదయించును. వాడు లోకమున వెఱ్ఱిబాగుల వాడు అనుకొందము. కావ్య లోకమునకు వాడే అధికారి. అట్టి సహృదయునిపై ఈ కావ్య జగత్తు ఆధార పడి యున్నది.
కావ్య గతమైన విప్రలంభ శృంగారమును కవి ఎంతగా సమర్ధముగ నిర్వహించు చుండెనో పాఠకుడు తెలుసుకొనినచో అది యొక ఆనందము.
అట్టి సందర్భములలో సంస్కృత వాఙ్మయమున మరియు ముఖ్యముగా ఆంధ్ర ప్రబంధముల యందు నాయికా నాయకుల విరహ స్థితులను గొప్ప చమత్కారముగా వర్ణించిరి.
ఈ ఘట్టమున శ్రీమద్రామాయణమున వాల్మీకి యిట్లు వర్ణించెను.
మన్మథాయాస సంభూతో వసంత గుణ వర్ధితః.
అయం మాం ధక్ష్యతి క్షిప్రం సోకాగ్నిర్న చిరాదివ.
మన్మధ బాధ వలన పుట్టిన యీ శోకాగ్ని వసంత గుణముల చేత పూర్తిగా కాల్చివేయుచున్నదోయీ.
చిశ్వనాధ వాల్మీకి భావమును తిరిగి చెప్పక పూర్తిగా యీ ఘట్టమును క్రొంగ్రొత్త భావములతో నిర్వహించినాడు. మహాకవి ప్రతిభా వ్యుత్పత్తులకు యీ ఘట్ట మొక నిదర్శనముగా నిలిచినది.
పద్యంలో అయోధ మార్గుడై అను పదము సీతను తాను లేని సమయములో పర్ణ శాలకు వచ్చి దొంగిలించుకొని పోయిన మోసకారి అయిన రావణాసురుని స్ఫురింపజేయు చున్నది.
*రసజ్ఙభారతి సౌజన్యంతో-*
*సత్యనారాయణ చొప్పకట్ల.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి