21, ఏప్రిల్ 2021, బుధవారం

భార్యాభర్తల బంధంలో

 దాంపత్యం ఒక శాశ్వతబంధం. కానీ ఆ బంధంలో చాలాచోట్ల పగుళ్ళు కనిపిస్తున్నాయి. భార్యతో భర్త, భర్తతో భార్య సర్దుకుపోలేని పరిస్థితులు ఎక్కువౌతున్నాయి. ఇటీవల కోర్టుల్లో అత్యధికంగా వస్తున్నవి విడాకుల కేసులే. ప్రేమించి పెళ్ళాడిన వారు కూడా అనతికాలంలోనే విడాకులకోసం ముందుకు వస్తున్నారు.

పటిష్టంగా ఉండవలసిన భార్యాభర్తల బంధంలో ఈ చీలిక ఏమిటి? ప్రధానంగా ఈ బంధం గొప్పతనం తెలియకపోవడమే దీనికి కారణం.

ఒకరిలో ఒకరికి నచ్చనివి తారసపడడం సహజమే. అన్నివిధాలా ఏ వ్యక్తీ మరొక వ్యక్తిని తృప్తిపరచలేడు. కానీ ’ప్రేమ’ అనే మౌలికాంశం ఉన్నప్పుడు క్షమ, సర్దుబాటు ఉంటాయి. ఒకరు కొన్నింటిలో రాజీపడితే, ఇంకొకరు మరికొన్నిటిలో రాజీ పడతారు. జీవితమే ఒక రాజీ.

మనకున్న శరీరంతో దానికి వచ్చే రుగ్మతలతో మనం రాజీ పడుతున్నట్లే - ముఖ్యమైన మానవ సంబంధాలతోనూ రాజీ పడాలి. ఒక అవేశం, ఒక అసహనం బలమైన అనుబంధాల్ని తెంచకూడదు.

కలిసిరాని కాలం, పరిస్థితులు ఎలా ఉన్నా ’ప్రేమ’తో ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా చెరి ఒకరు క్షమను పాటించినప్పుడు అనుబంధం నిలుస్తుంది.

కుటుంబవ్యవస్థ - ఈ దేశం సాధించుకున్న గొప్ప అంశం. దానికి మూలం దాంపత్య ధర్మమే.

పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, సీతారాములు అంటూ దాంపత్య ధర్మాన్ని దేవతా స్థానంలో ఉంచి ఆరాధించే సంప్రదాయం మనది. ఆ దేవదంపతులకు అనేకమార్లు కళ్యాణాలు చేస్తూ - ఆ ఉత్సవాల ద్వారా వివాహవ్యస్థలోని పవిత్రతనీ, దాంపత్యంలోని శాశ్వతత్వాన్నీ గుర్తు చేసుకుంటాం.

ముఖ్యంగా ఇరువురికీ లభిస్తున్న ఆర్థికస్వేచ్ఛ కూడా విడిపోవడానికి తెగించడంలో ముఖ్యకారణమవుతోంది. రెండవది తీవ్రమైన అసహనం. మూడవది తమ కుటుంబం, పిల్లల భవితవ్యం గురించి ఆలోచించలేకపోవడం.

ముఖ్యవిషయం:

మన కాస్త సహనం - శాశ్వతమైన ఒక ధర్మాన్ని నిలబెడుతుంది. పతి ఎలా ఉన్నా సహించే పతివ్రతల కథలు మనకి కొన్ని పురాణాల్లో కనిపిస్తాయి. అవి అతికొద్ది, కానీ ఆ కథల అసలు సందేశం పతులు దుర్మార్గంగా ఉండాలని చాటడం కాదు. సహనంతో తమ బంధాన్ని నిలిపి, ఒక ధర్మాన్ని గౌరవించిన త్యాగంలోని దివ్యత్వాన్ని కీర్తించడమే వాటి పరమార్థం.

’స్త్రీని నోటితో గానీ, చేతితో గానీ హింసించరాదు’ - అని వైదిక సంస్కృతి చాటుతోంది. విజ్ఞానంలో, గృహనిర్వహణలో స్త్రీ మహారాణి. ఇంటి సంపద ఆమె చేతులపైననే వినియోగింపబడాలని శాస్త్రం చెబుతోంది.’సామ్రాజ్ఞీభవ’ అంటూ వివాహక్రియలో వరుడు, వధువును మంత్రపూర్వకంగా జీవితంలోకి ఆహ్వానిస్తాడు. ఇరువురూ కలిసి మంచి స్నేహితులుగా మసలాలి - అని వేదం బోధిస్తోంది. సప్తపది - సఖ్యానికి సంకేతం.

’సఖా సప్తప దా భవ’

ఏడడుగులతో స్నేహాన్ని సాధించి, దేవతల సాక్షిగా చివరివరకు -”ప్రాణం, శరీరం’ లా కలిసి ఉండాలి అనే ఆకాంక్ష ఆ పెళ్ళి మంత్రాలలో కనిపిస్తుంది.

స్నేహంలో క్షమించడం, రక్షించడం, ప్రేమించడం, పాలుపంచుకొనడంలో ప్రధానాంశాలు. అవన్నీ భార్యాభర్తల బంధంలో ఉంటాయి - ఉండాలి.

భర్త అల్పాయుష్కుడని తెలిసినా అతడిని అంటిపెట్టుకొని, తన తపశ్శక్తితో కాలాన్నే శాసించి, తన పతిని బ్రతికించుకున్న సతీ సావిత్రిలోని ధైర్యం స్త్రీ ఔన్నత్యానికి ప్రతీక. ప్రతికూల పరిస్థితుల్ని చాకచక్యంగా సానుకూల పరచుకోవడమే ఘనత కానీ, పరిత్యజించడం శ్రేయస్సు కాదు.

నల దమయంతుల చరిత్ర, ఇతిహాసంలో ఒక మణిపూస, దాంపత్యంలోని విలువని చాటే అద్భుత వృత్తం. కాలం కలిసిరాని పరిస్థిథి జీవితంలో ఒక్కొక్క దశలో ఎవరికైనా తప్పనిసరి. ఆ సమయంలోనే ఉద్రేకాలకు లోనుకాకుండా, ప్రశాంత చిత్తంతో, చాతుర్యంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించే సంయమనం ప్రదర్శించాలి.

ద్యూతంలో తన భర్త ఓడిపోయాక, పిల్లల్ని తన పుట్టింటి రక్షణలో ఉంచినప్పటికీ, తాను మాత్రం పతికి తోడుగా అడవులకు వెళ్ళింది. దమయంతి. కానీ తనతో పాటు ఆె అగచాట్లు పడడం ఇష్టం లేని నలుడు, అడవిలో ఆమెను విడిచి వెళ్ళాడు. తాను కనపడకపోయేసరికి - ఆమె విధిలేక పుట్టింటికి వెళ్ళి రక్షణ పొందుతుందని అతడి ఊహ.

తన భర్త బుద్ధిని ఏదో అదృశ్య శక్తి (కలిపురుషుడు) శాసిస్తోందని గ్రహించిన దమయంతి, అనేక అవరోధాల నెదుర్కొని తన పుట్టినింటికి చేరుకుంది. కానీ అక్కడ ఉంటూనే తెలివిగా ఆమె నలుని జాడను తెలుసుకొని అతడిని తిరిగి చేపట్టింది. ఇక్కడ దమయంతి ఘనతనే పురాణకర్త శ్లాఘించారు. ఓర్పు, సర్దుబాడు - ఎప్పటికైనా గెలుస్తాయి.

సృష్టిలో ’అవసరం’ అనిపించిన వాటికోసం ఎన్నో సర్దుబాట్లు, సహనాలు, రాజీపడడాలు ప్రతివ్యక్తి జీవితంలోనూ మామూలే. ఆ అంశాలే వివాహ బంధంలో కూడా అమలుపరిస్తే సుఖసంతోషాలు సహజంగా లభిస్తాయి.

భార్యాభర్తల బంధం ధనంకంటే గొప్పది. కేవలం ఆర్థికవసరాల వల్లనే కలిసి ఉండడం, ఆర్థిక స్వాతంత్ర్యం వలన విడిపోవడమ్ అనే తేలికపాటితనం దాంపత్య బాంధవ్యంలో తగదు. కడదాకా మిగిలే కమ్మని బంధం ఇది ఒక్కటే. రెక్కలు వచ్చి పిల్లలు ఎగిరివెళ్ళిపోయినా, పండుటాకులై ఒకరికొకరు మిగిలేది దంపతులే. ఒడుదుడుకుల్లో తోడై, బ్రతుకు పయనంలో ప్రయాణించి అలసి, పడమటి సంధ్యారాగంలో జంట స్వరాలుగా మిగిలే శాశ్వతమైన సాహచర్యం ఇది.

నిగ్రహం, నిబద్ధత - దాంపత్యంలో ప్రధాన సూత్రాలు. ఆరోగ్యవంతమైన ఒక వ్యవస్థను సంయమనంతో కాపాడుకోవలసిందే.

ధ్రువాసి ధ్రువోయం యజమానో స్మిన్నాయతనే!! (యజుర్వేదం)

’ఈ గృహంలో నువ్వు శాశ్వతం, యజమానియైన ఇతడు (భర్త) శాశ్వతం’ ఈ వేదవాక్కు - మార్పుచెంద(కూడ)ని దంపతుల స్థిరత్వాన్ని చాటుతోంది. ’యజమాని’ అంటే సత్కర్మను (యజ్ఞాన్ని) ఆచరించు వాడు అని సరియైన నిర్వచనం.

భారతీయ దృక్పథంలో సతీపతుల బంధం ఇహలోక, పరలోకాలకు, జన్మజన్మలకు కొనసాగుతుంది. ఇంద్రాదులు, గంధర్వాదులు ఆ జాయాపతులకు బంధాన్ని ఏర్పరచారన్ వివాహ మంత్రాలు చెబుతున్నాయి.

దంపతుల స్థిరత్వం కుటుంబానికి పునాది. మన కుటుంబాలు, మన సమాజానికి ఆలంబనలు.

"అస్యాః విముచం న వశ్మి న ఆవృతం’

నేను (భర్త), ఈమె (భార్య) విడిపోవడాన్ని వియోగాన్ని కోరడం లేదు" అనే భావం ఋగ్వేదంలో కనిపిస్తోంది.

అభిప్రాయ భేదాలో, అభిరుచుల తేడాలో ఉండవచ్చు. ఆ మాటకొస్తే, ఒక వ్యక్తికి - తానే తనకు సరిపడని సందర్భాలు ఎన్నో ఎదురౌతాయి. అప్పుడు తనను తాను క్షమించుకుంటాడు. తనలొ తాను సర్దుకుపోతాడు. అలాగే తన జీవిత భాగస్వామితో సర్దుకుపోగలగాలి.

’అనన్యా హి మయా సీతా భాస్కరస్య ప్రభాయథా’

- అని శ్రీరాముడు సీత గురించి చెప్పినమాట ’సూర్యునికి వెలుగువలె సీన అనన్య (వేరుకాదు)’. ఇంతకంటే దంపతుల ప్రేమకు గొప్ప నిర్వచనం మరొకచోట కానరాదు.

సూర్యునీ అతని కాంతినీ ఎలా విడదీయలేమో అలాగే సీతారాముల్ని (భార్యాభర్తల్ని) వేరుచేయలేం.

పురాణేతిహాసాలలొ అత్రిమహర్షి అనసూయలు, అరుంధతీ వసిష్ఠ మహర్షులు, లోపాముద్ర అగస్త్యులు వంటి ఆదర్శ ఋషి దంపతులు గోచరిస్తారు. అనసూయ ఘనతను అత్రి మహర్షి స్వయమ్గా ప్రశంసించాడు. భార్యను శ్లాఘించి, ఆమె ప్రాధాన్యాన్ని భర కీర్తించడం పురాణాల్లో అనేక చోట్ల కనిపిస్తుంది. పురుషాధిక్యం - అనేది ఆ మహాత్ముల్లో గోచరించలేదు,.

అసలు దాంపత్యంలో పరస్పరాధిక్యాలు తగనివి. ఒక్కో సమయ్ంలో ఒక్కో విషయంలో ఒక్కొక్క ఆధిక్యం తప్పదు - అవసరం కూడా.

అన్యోన్యత కలిగిన దంపతుల పెంపకంలో ఎదిగే బిడ్డలు కూడా ఆరోగ్యవంతమైన మనశ్శరీరాలతో ప్రయోజకులుగా ప్రగతిని సాధించగలుగుతారు.

విశ్వనాథ వారి ’వేయిపడగలు’ లో భర్త భార్యతో అన్నమాట - చివరకు ’నేను మిగిలితిని - నీవు మిగిలితివి’.

ఇది ఆ నవలకే చివరిమాట. వేయిపడగల అనంతునిలా విస్తరించ్న ధర్మంలో 998 పడగలు (అసంఖ్యాకధర్మాలు నశించినా - ఇంకా ’భార్యాభర్తలు’ అనే రెండు పడగలు మిగిలాయి.

చాలు - ఆ రెండు పడగలు మిగిలినా -వాటి పైననె తక్కిన సనాతన ధర్మమంతా నిలబడగలదు...

🌺🌺🌺సర్వంశివసంకల్పం🌺🌺🌺

కామెంట్‌లు లేవు: