19, జూన్ 2021, శనివారం

అస్తి.. భాతి.. ప్రియం..

 *అస్తి.. భాతి.. ప్రియం..*




నామరూపాత్మకమైన ఈ జగత్తంతా నిజానికి బ్రహ్మమే. మనలను ఆవరించి ఉన్న మాయ మనలను ఆ బ్రహ్మాన్ని గుర్తించకుండా చేస్తుంది. మాయకు ఆవరణ శక్తి విక్షేప శక్తి అని రెండు శక్తులు ఉన్నాయి ఆ శక్తుల వల్ల లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు మనకు కనిపిస్తుంది. ఈ మాయా శక్తిని తొలగించుకుని అసలైన బ్రహ్మాన్ని కనిపెట్టడానికి బ్రహ్మ యొక్క తత్వాన్ని ఉపనిషత్తుల ద్వారా తెలుసుకోవాలి.


బ్రహ్మ తత్వాన్ని ఉపనిషత్తులు కూడా స్పష్టంగా నిర్వచించ లేవు. బ్రహ్మం కానిది ఏమిటో ఉపనిషత్తులు  స్పష్టంగా చెప్తాయి. షడ్ వికారాలు బ్రహ్మానికి లేవు. షడ్ వికారాలు అంటే పుట్టుక, ఉండుట, పెరుగుట, మార్పు చెందుట, కృశించుట, మరణించుట. ఇవన్నీ ప్రాణి ధర్మాలు. ఈ మాటలలో ఉండుట అనేదానికి నిజానికి ఉండకపోవుట అనేది అర్థం. అంటే ఒకప్పుడు ఉండి మరొకప్పుడు ఉండకపోవడం. మనకు కనబడేదంతా నామరూపాత్మకమైన జగత్తు. కనబడే వాటిని గ్రహించడంలో విశేషం లేదు. మనం చూడనటువంటి వాటిని ఇతరులు వర్ణించి చెబితే ఆ వర్ణనను బట్టి మనం ఆ వస్తువును ఊహించి తెలుసుకుంటాము. ఇలా తెలుసుకొన్న వస్తువులను కూడా కలుపుకుంటే నే ప్రపంచం అవుతుంది. ప్రేమ ద్వేషము ప్రతీకారము వంటి విషయాలు కనపడవు. చేతికి దొరకవు. కానీ వాటి పేర్లను బట్టి మనము వాటిని గుర్తిస్తాము. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండే వస్తువులు మొత్తం నామరూపాత్మక మైనవి. నామరూపాత్మకమైన వస్తువులన్నీ షడ్ వికారాలకు లోనవుతాయి. కాబట్టి మనకు కనిపించే లేదా మనం ఊహించి తెలుసుకుననే ఈ ప్రపంచమంతా మాయ అని తెలుసుకోవాలి.


ఇక బ్రహ్మ యొక్క లక్షణాలు సత్ చిత్ ఆనందాలు. ఈ లక్షణాలనే మరొక విధంగా అస్తి, భాతి, ప్రియం అని కూడా అంటారు. అస్తి (సత్) అంటే మూడు కాలాల్లోనూ షడ్ వికారాలకు లోనుకాకుండా స్థిరంగా ఉండేది అని.


చిత్ అంటే చైతన్యము. ఈ గుణము బ్రహ్మాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తుంది. భాతి అంటే ప్రకాశిస్తుంది అని అర్థము. మామూలుగా అయితే మన ఇంద్రియాల ద్వారా మనము గ్రహింప గలిగేది అని అర్థము. బ్రహ్మము అట్లా ఇంద్రియాల ద్వారా గ్రహింప గలిగేది కాదు. అంతకరణ ద్వారా జ్ఞానం ద్వారా మాత్రమే గ్రహింప గలిగేది. ఏదో ఒక విధంగా గ్రహింపగలం కాబట్టి భాతి అనే పదం వాడుతున్నాము.


ఆనందం అనే పదం బ్రహ్మానికి వర్తిస్తుంది.  సృష్టిలో పదార్థాలకంటే జీవుడికి తన మీదనే మక్కువ ఎక్కువ. మంచి భోజనము సౌకర్యాలు మొదలైనవి శరీరానికి అంటే అన్నమయ కోశానికి కోరుకుంటాము. సత్కర్మలు చేసి ఉత్తమ లోకాలకు వెళ్లాలని కోరుకోవడం జీవాత్మకు అంటే విజ్ఞానమయ కోశానికి సంబంధించిన కోరిక. అది దాటితే ఆనందమయ కోశం వస్తుంది. ఉపనిషత్తులు బ్రహ్మాన్ని ఆనందమయంగా వర్ణిస్తాయి. అంటే ఆత్మ లేదా బ్రహ్మము అనే దాని ముఖ్య గుణము ఆనందము అని తేలుతుంది. ఈ ఆనంద తత్వాన్ని ప్రియం అనే పదం సూచిస్తుంది.


నామ రూపాలు, అస్తి భాతి ప్రియం, అనే ఐదు పదాలు మాయ ఆవరించిన బ్రహ్మాన్ని సూచిస్తాయి. వాటిలోంచి నామ రూపాలను తీసేస్తే మాయ తొలగిపోతుంది. మిగిలిన అస్తి భాతి ప్రియం అనే మూడు గుణాలు కలిగిన వస్తువు అంటే సత్ చిత్ ఆనంద మయమైన  కేవల బ్రహ్మము. అది మిగిలిపోతుంది.


నామ రూపాలు, అస్తి భాతి ప్రియం, అనే ఐదు పదాలు మాయ ఆవరించిన బ్రహ్మాన్ని సూచిస్తాయి అని పైన చెప్పుకున్నాము. సగుణోపాసన చేయడానికి నామరూపాలు కలిగిన భగవంతుడిని ఆధారంగా స్వీకరిస్తాము. శుద్ధ బ్రహ్మాన్ని ఆ విధంగా ఉపాసించ లేము.


దృగ్ దృశ్య వివేకమనే వేదాంత గ్రంథం లో ఈ నామ రూపాలు, అస్తి భాతి ప్రియం, అనే ఐదు పదాల వివరణ ఉన్నది. శ్రీ విద్యారణ్యులు ( సాయణ భాష్యం, పంచదశి మొదలైన గ్రంధాలు రాసిన వారు) ఈ పుస్తకాన్ని రాశా రంటారు. చాలా వేదాంత గ్రంథాల తాలూకు వ్యాఖ్యానాలలో ఈ పదాల చర్చ వస్తుంది. వాటిని బట్టి ఈవివరణ తయారుచేశాను. 



*పవని నాగ ప్రదీప్*


కామెంట్‌లు లేవు: