19, జూన్ 2021, శనివారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..


*ఆత్మ త్యాగం..కపాలమోక్షం..*


*(అరవై మూడవ రోజు)*


ఒక వారం రోజుల పాటు ఎవ్వరినీ ఆశ్రమానికి రావొద్దన్న శ్రీ స్వామివారు కఠోర సాధన లో పూర్తిగా లీనమై పోయారు..ప్రధాన గది లో గల నేలమాళిగ లోనే తపస్సు కొనసాగించారు..


1976, మే నెల 6వతేదీ నాటి ఉదయం 9గంటల వేళ.. గొర్రెలు కాచుకునే ఎరుకలయ్య అనే మొగలిచెర్ల గ్రామానికి చెందిన వ్యక్తి..కుతూహలం కొద్దీ..ప్రహరీ గోడ మీదుగా ఆశ్రమం లోకి తొంగి చూసాడు..ఆశ్రమ వరండా ముందు వున్న పందిరి క్రింద..శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకొని నిటారుగా కూర్చుని ధ్యానం లో వున్నారు..అలా ధ్యాన ముద్రలో ఆరుబైట శ్రీ స్వామివారు ఎన్నడూ కూర్చోలేదు..


ఎరుకలయ్య కొద్దిసేపు అక్కడే తచ్చాడి..మళ్లీ చూసాడు..శ్రీ స్వామివారు అదే స్థితి లో అలానే కూర్చుని వున్నారు..ఈరోజు స్వామి బైట తపస్సు చేసుకుంటున్నాడేమో..అనుకోని ఎరుకలయ్య తన పని లో తానుండి పోయాడు..కానీ మధ్యాహ్నం ఒంటి గంటప్పుడు ఎరుకలయ్య..మళ్లీ చూసాడు..ఈసారి శ్రీ స్వామివారి దేహం ప్రక్కకు ఒరిగి ఉన్నది..ఎరుకలయ్య కు ఎందుకో అనుమానం వచ్చింది..ఒక్క నిమిషం లోనే అతని మనసు కీడు శంకించి..వెంటనే ఆలస్యం చేయకుండా పరుగు పరుగునా.. మొగలిచెర్ల చేరి..శ్రీధరరావు గారి ఇంటికి వెళ్లి..శ్రీధరరావు గారితో..తాను చూసిన విషయాన్ని మొత్తం చెప్పేసాడు..


శ్రీధరరావు ప్రభావతి గార్లకు ఒక్కసారిగా అనిపించింది..శ్రీ స్వామివారు తాను అనుకున్న విధంగా ప్రాణత్యాగం చేసారేమో..అని..వెంటనే బండి సిద్ధం చేయమని చెప్పారు..ఈలోపల..శ్రీధరరావు గారి కుమారుడు ప్రసాద్, మరికొంతమంది గ్రామస్థులు సుమారు 30 మంది గబ గబా ఆశ్రమానికి నడచి వెళ్లారు..


ఆశ్రమం పైన..నిండుగా రామ చిలుకలు వాలి ఉన్నాయి..ప్రధాన ద్వారం తీసుకొని లోపలికి వెళ్లి చూసేసరికి..శ్రీ స్వామివారు పద్మాసనం లోనే వున్నారు కానీ..దేహం ఎడమ ప్రక్కకు ఒరిగి ఉన్నది..శ్వాస లేదు..


శ్రీ స్వామివారి శరీరం ప్రక్కనే..కమండలం నీటితో నిండి ఉన్నది..కమండలం ప్రక్కన..ఒక చిన్న రాయి క్రింద..ఒక చీటీ..పెట్టి ఉన్నది..అందులో.."నేను శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారంగా మారిపోయాను.. ఇక నుంచీ నన్ను అందరూ దత్తాత్రేయ స్వామి అని వ్యవహరించండి..శనివారాల్లో తప్ప మిగిలిన అన్నిరోజుల్లో నా మందిర ద్వారాలు తెరచి ఉంచండి.." అని వ్రాసి వున్నది.. 


ప్రసాద్ తో సహా చూసిన వారందరూ శ్రీ స్వామివారు మరణించారని భావించారు..శ్రీ స్వామివారి దేహాన్ని ముట్టుకోవడానికి అందరూ జంకారు..


శ్రీధరరావు గారి ఇంటి ప్రక్కనే కాపురం వుండే గోపిశెట్టి బలరామయ్య అనే వ్యక్తి "స్వామి వారి శరీరాన్ని ..మనం  సరిగ్గా ఉంచాలి కదా.." అంటూ..తన రెండు చేతులతో శ్రీ స్వామివారి దేహాన్ని ఎత్తుకొని..వరండాలో గోడకు ఆనించి..శ్రీ స్వామివారు కూర్చున్న పద్మాసనం స్థితి లోనే ఉంచాడు..అప్పటికి కూడా శ్రీ స్వామివారి శరీరం బిగుసుకుపోలేదు..మామూలు గానే ఉన్నది..


మరి కొద్ది సేపటికే.. శ్రీధరరావు ప్రభావతి గార్లు వచ్చారు..శ్రీ స్వామివారిని చూసి వారికి దుఃఖం ఆగలేదు..శ్రీధరరావు గారు త్వరగా తేరుకొని..ఒక మనిషిని పిలచి..శ్రీ స్వామివారి సోదరులకు కబురు అందించి..వారిని వెంటబెట్టుకు రమ్మనమని చెప్పి పంపారు..ఈలోపల మొగలిచెర్ల గ్రామస్థులు అందరూ అక్కడ గుమిగూడారు..అప్పటికి సమయం మధ్యాహ్నం 4 గంటలు కావొస్తోంది..


ఆరోజు ఉదయం తిథి..వైశాఖ శుద్ధ సప్తమి..శ్రీ స్వామివారు చెప్పిన వారం రోజుల గడువు ఆరోజుతో ముగిసింది..శ్రీ స్వామివారు తనను సజీవ సమాధి చేయమని పదే పదే  చెప్పిన మాటల్లోని అంతరార్ధం అప్పటికి ఆ దంపతులకు అర్ధమైంది..


క్రమంగా సాయంత్రం కావొచ్చి..చీకట్లు వ్యాపిస్తున్నాయి..శ్రీధరరావు గారు ఇక చేయవలసిన ఏర్పాట్ల గురించి ఆలోచించసాగారు..రెండు మూడు పెద్ద పెట్రోమాక్స్ లైట్ల ను తెప్పించారు..శ్రీ స్వామివారి కుటుంబ సభ్యుల రాక కోసం ఎదురు చూడసాగారు..రాత్రి 9.30 గంటల ప్రాంతంలో శ్రీ స్వామివారి సోదరులు తల్లి వచ్చారు..పద్మయ్య నాయుడు తనకు శ్రీ స్వామివారు తనతో  చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకొని..శ్రీధరరావు గారితో ఆ సారాంశమంతా వివరించి చెప్పారు.. 


రాత్రి 11 గంటల సమయం..అప్పుడు..ఎవ్వరూ ఊహించని సంఘటన జరిగింది..


శ్రీ స్వామివారి కపాలమోక్షం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: