13, ఆగస్టు 2021, శుక్రవారం

దైవ సాక్షాత్కారం

దైవ సాక్షాత్కారం 

మన హిందూ సనాతన ధర్మం అనేక మహర్షులు వారి అపురూప జ్ఞాన సంపదతో మనకు అందించిన విజ్ఞాన గని.  ఇప్పుడు మనలో చాలామంది వారికి తెలిసి తెలియని మిడి మిడి జ్ఞ్యానంతో ప్రవచన కారులుగా ప్రసిద్ధి చెంది వారికి తెలిసిన దానినే సత్యమని నమ్మి మనకు అదే సత్యమని నమ్మేటట్లు ప్రవచిస్తున్నారు.   ఈ సిలిసిలలో నేను ఇటీవల ఒకటి రెండు ప్రవచనాల వీడియోలు చూసిన తరువాత ఇది వ్రాయ ప్రయత్నిస్తున్నాను.  అందులో వారు చెప్పేది ఏమిటంటే చాలామంది విగ్రహారాధన ఒక ప్రారంభ ఆరాధన క్రమమని దానిని జ్ఞానాన్వేషులు ఆచరించ నవసరం లేదనే అపోహలో వున్నారని అది సరైనది కాదని విగ్రహారాధన చేయటము ఉత్తమమైనదని ప్రజలను నమ్మించేటట్లు ప్రభోదిస్తున్నారు. మరి ఏ ఆధారంతో వారు అట్లా ప్రవచిస్తున్నారో నాకు మాత్రము తెలియదు. 

నేను నాకున్న స్వల్ప జ్ఞానంతో తెలుసుకున్నది ఏమనగా మనకు జగత్ గురువు అయిన కృష్ణ భగవానులు ప్రవచించిన శ్రీమద్ భగవత్ గీత, మరియు వేదాంత గ్రంధాలైన ఉపనిషత్తులు మనకు పరం ప్రమాణాలు.  వేదాంతానికి సంబంధించి ఉపనిషత్తులకు మించిన గ్రంధాలు వుంటాయని నేననుకోను. 

అటు గీతలో కానీ ఇటు ఉపనిషత్తులలో కానీ విగ్రహారాధన తప్పకుండ చేయాలని ఎక్కడ చేయలేదు. గీతాచార్యుడు స్పష్టంగా ఆత్మ, పరమాత్మా గురుంచి వివరించారు. స్వామి ఒక సందర్భంలో ఏమన్నారంటే ఎవరెవరు ఏ ఏ రూపాలలో నన్ను కొలుస్తున్నారో వారి వారికి నేను ఆయా రూపాలలో అనుగ్రహిస్తున్నాను అని పేర్కొన్నారు. 

మనం దేముడిని ఎందుకు కొలవాలి అనే ప్రశ్న వేసుకుంటే మనకు సమాధానము దొరుకుతుంది. చాలా మంది దైవార్చన కేవలము ఐహిక వాంఛలను తీర్చుకోటానికే అనే సమాధానం ఇస్తారు.  వారిని కేవలము లౌకికులుగా మనం పేర్కొన వచ్చు.  ఈ లోకంలో సుఖాలను, ఆనందాలను పొందాలనే కాంక్ష కలిగిన వారు విగ్రహారాధన చేయ వచ్చు. తప్పులేదు. 

మన జీవిత పరమావధి మోక్షమని మన వేదాంత గ్రంధాలూ ఏక కంఠంతో పేర్కొంటున్నారు. ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటారో వారు మోక్షం అంటే ఏమిటి దానిని ఎలా సాధించుకోవాలని నిర్ణయించుకుంటారు. ప్రస్తుతము చాలా మంది ప్రవచన కారుల జ్ఞానము విగ్రహారాధన మటుకే పరిమితమైనది పేర్కొనటానికి నేను బాధపడుతున్నాను.  వారు వారికి వున్న జ్ఞానమే సర్వ శ్రేష్టమైనది అందరు ఆచరించ దగింది అని అనుకుంటే . వారిని ఆ దేవదేముడే రక్షించాలి. 

నిజానికి మోక్షము జ్ఞాన రూపంలో వున్నది అది సాద్య వస్తువు కాదు సిద్ధ వస్తువు.  అటువంటప్పుడు నోములు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు చేసి మోక్షాన్ని పొందడము అంటే ఇంట్లో పారేసుకుని చేలో వెతకటం లాంటిది. మీకు ఒక చిన్న ఉదాహరణతో వివరించ ప్రయత్నిస్తాను.  మీరు మీ ఇంట్లో ఒక గుండు సూది పారవేసుకున్నారనుకోండి. మీ ఇంట్లో వెలుతురూ లేదు, కానీ మీ వీధిలో వెన్నెల పుష్కాలంగా వుంది ఇప్పుడు మీరు వీధిలో గుండు సూదిని వెతుకితే దొరుకుతుందా?  మీ హృదయ కుహరంలో వున్న పరమాత్మను మీరు దేవాలయ విగ్రహంలో వెతకటం కూడా దాదాపు అదే విధమైనది.  

మరి దేవాలయాలకు వెళ్లి విగ్రహారాధన చేస్తే ప్రయోజనం ఏమిటి.  ఏమి ప్రయోజనము లేదా అంటే అట్లా అనలేము.  మనము వీధిలో వెతకటం వాళ్ళ మనం ఇంట్లో పారవేసుకున్న గుండు సూది దొరకదు కానీ మీకు వెతకటం మాత్రం యెట్లా అనేది తెలుస్తుంది. అదే విధంగా మీరు గుడికి వెళ్లి విగ్రహారాధన చేయటము వలన కలిగే ఫలితము.  అంటే మీకు కొంత వరకు అంతఃకరణ శుద్ధి లభించ వచ్చు.  కానీ మీ గమ్యము కేవలము అంతఃకరణ శుద్ది మాత్రమే కాదు కధ.  మీ గమ్యము మీకు తెలియక పొతే మీ ఆరాధనను కేవలము విగ్రహారాధన వరకు చేయవచ్చు.  కానీ మీకు ఎట్టి పరిస్థితిలో కూడా జ్ఞాన రూపంలో వున్న మోక్షము లభించదు. ఇది సత్యం. 

కాబట్టి ముముక్షువులారా దయచేసి ఈ ప్రవచన కారుల మిడి మిడి జ్ఞానంతో మీ అపురూపమైన లక్ష్యాన్ని మార్చుకోకండి, కేవలము గీతాచార్యుడు చెప్పిన జ్ఞాన మార్గంలో నడవండి. మనకు జ్ఞాన మార్గ దర్శనము చేయటానికి అనేక ఉపనిషత్తులు వున్నాయి. వాటిని అనుసరించండి మోక్ష సాధన చేయండి. ప్రతి మనిషి ( స్త్రీ పురుషుడు ఎవరైనా కానీయండి) సాదించ వలసింది కేవలము చతుర్ధ పురుషార్థం ఐన మోక్షము మాత్రమే అంతకంటే వేరే ఏమి లేదు. 

స్త్రీ, పురుషుడు: 

మనము సామాన్య సామాజిక వాడుకలో స్త్రీ, పురుష విభేదాలను పాటించి ఇది పురుషులు చేసేది ఇది మాత్రమే స్త్రీలు చేసేది అని వర్గీకరిస్తుంటాము.  నిజానికి స్త్రీ పురుష బేధము అనేది కేవలము మనము వున్న లింగ శరీరానికే కానీ ఆత్మకు కాదు.  ఆత్మా స్వరూపము ఎట్టి లింగము కలిగి లేదు. పురుషుడు మోక్షానికి యెంత అర్హుడో  స్త్రీ కూడా అంతే అర్హురాలు. కాబట్టి ముముక్షువులారా మీలో ఇటువంటి విభేదాలు పూర్తిగా విస్మరించండి ఇప్పుడే మోక్ష సాధనకు నడుము చుట్టండి. 

ముముక్షువులు చేయవలసిన మొదటి సాధన స్త్రీ పురుష భేదము మనసు నుంచి పోగొట్టటమే.  ఆ స్థితిని ఎప్పుడైతే చేరుకుంటాడో అప్పుడు అన్నీ జీవులు ఒకటే నని ప్రతి జీవి ఆత్మా స్వరూపమే అని తెలుసుకుంటాడు. తనను పొగిడే వానిని దూషించే వానిని ఒకే విధంగా చూడ గలుగుతాడు. మనో వికారాలను ఎవరైతే అదుపు చేసుకోగలడో అతడే మోక్ష సాధనకు యోగ్యత సంపాదించ గలుగుతాడు ( ఇక్కడ అతడు,  వాడు అనే శబ్దాలు కేవలము పురుషులకు సంబందించినవి కావు అవి ప్రతి ముముక్షువుకు వర్తించేది. అందరికి అర్ధం అవటానికి మాత్రమే పురుష వాచకములో  వ్రాసినవి మాత్రమే) నేను ఈ శరీరము కాదు శరీరాన్ని నియంత్రిచే ఆత్మను అనే భావన ఎప్పుడైతే వస్తుందో అప్పటినుంచే నీకు మోక్ష సాధనకు మార్గము ఏర్పడుతుంది. మనము రోజు ఎంతోమంది తమ పాంచభౌతిక శరీరాన్ని వీడి వెళ్లటం చూస్తున్నాము. అయ్యో పాపం అని మనము వారి మీద జాలి చూపెడుతుంటాము.  మిత్రులారా ఆ రోజు అందరికి వస్తుంది ఇక్కడ ఎవ్వరు శాస్వితంగా వుండరు. ఈ ప్రపంచంలో ప్రతివారు మూడురోజుల అతిధులు మాత్రమే. నీ శరీరము ఈ భూమిమీది పంచ బుటాలతో తయారు చేయబడినది.  కాబట్టి అది ఒకరోజు మళ్ళీ పంచ భూతాలలో కలసిపోవలసినదే. పంచ భూతాలకు సంబంధం లేకుండా వున్నది ఒక్క ఆత్మా మాత్రమే అది నీ పంచ భౌతిక శరీరంలోని హృదయ కుహరంలో నిక్షిప్తమై వున్నది.  ఈ విషయం మంత్రపుక్షంలో కూడా స్పష్టంగా పేర్కొని వున్నది. 

పద్మకోశ ప్రతీకాశగ్ం హృదయంచాప్యథోముఖం

అథోనిష్ట్యా వితస్త్యాన్త్యే నాభ్యాముపరి తిష్ఠతి 

జ్వాలమాలాకులంభాతి విశ్వశ్యాయతనం మహత్

సంతతగ్ం శిరాభిస్తు లంబత్యా కోశసన్నిభం

తస్యాంతే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం 

తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః 

సోగ్రభుగ్విభజంతిష్ఠన్నాహార మజరః కవిః

తిర్యగూర్ధ్వ మథశ్శాయీ రశ్మయ తస్య సంతతా

సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకః

తస్య మధ్యే వహ్ని శిఖా అణియోర్ధ్వా వ్యవస్థితః

నీలతో యదమధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వరా

నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా 

తస్యాశిఖాయామధ్యే  పరమాత్మా వ్యవస్థితః    

స్త్రీ పురుష భేదము లేదని చెప్పటానికే పరమేశ్వరుడు మనకు అర్ధనారీశ్వరుడుగా దర్శన మిస్తున్నారు. ఈ సత్యం మనమందరము గమనించాలి. 

దయచేసి గమనించ గలరు: ఈ రచన నేను విగ్రహారాధన చేయ కూడదని, లేక విగ్రహారాధనకు వ్యతిరేకంగా వ్రాసినది అనుకోవలదు. నా భావన కేవలము విగ్రహారాధన వల్ల మనకు ఐహిక వాంచితాలు నెరవేరుతాయి కానీ మోక్షము సిద్దించదని తెలుపటమే నా లక్ష్యము. మోక్షార్ధి సర్వ జగత్తులోను భగవంతుని  దర్శిస్తాడు. అందుకే విష్ణు సహస్ర నామాలలో మొదటి నామము "విశ్వం" అని అన్నారు అంటే ఈ కనిపించే జగత్తు అంతాకూడా భగవంతుడే అని అర్ధము. 

ఈ ప్రపంచంలో వున్న ఏ వ్యక్తి కూడా తృప్తిగా లేడని తనకు ఇంకా ఏదో ఉంటే తృప్తి లభిస్తుందని అందరు అనుకుంటారు.  మరైతే ఏమి దొరికితే తృప్తి కలుగుతుంది. ఏదైతే లభిస్తే తరువాత ఇంకా ఏమి వద్దు అని అనుకుంటాడో అదే.  ఆ అదే ఏమిటి దానినే మోక్షము అంటారు.  మోక్షము లభించిన వానికి ఇంకా ఏదో కావాలనే చింత ఉండదు. 

ఓం తత్ సత్ 

శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ 

కామెంట్‌లు లేవు: