మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
*ఆరుబయట దీక్ష..*
కొన్నాళ్ల క్రితం నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం శ్రీ స్వామివారి మందిరం వద్దకు వచ్చింది..చిత్రమైన సమస్యతో బాధపడుతున్నారు వాళ్ళు..భార్యా భర్తా ఇద్దరు కుమారులు..ఆ ఇద్దరు కుమారులు కూడా పదిహేను సంవత్సరాల వయసు పై బడిన వారే..కుటుంబం లో ఉన్న ఇద్దరు పిల్లలకూ మానసిక స్థితి సరిగాలేదు..ఒక గంట ప్రవర్తించినట్లు..మరో గంటలో ప్రవర్తించరు.. ఒక రోజులోనే వాళ్ళ ప్రవర్తన మారిపోతూ ఉంటుంది..ఉన్నట్టుండి బాధ పడుతున్నట్లు మెలికలు తిరిగి పోతారు..మరి కొద్దిసేపటికే మామూలుగా వుంటారు..వీళ్ల ఇద్దరినీ తీసుకొని ఆ తల్లి తండ్రి శ్రీ స్వామివారి మందిరానికి చేరారు..
శ్రీ స్వామివారి మందిరానికి ఉత్తరంగా ఉన్న రావిచెట్టు క్రింద ఉన్న అరుగు మీదే ఉండేవాళ్ళు..రోజూ ఉదయం సాయంత్రం శ్రీ స్వామివారి మందిరం లో ప్రదక్షిణాలు చేయడం మొదలుపెట్టారు..వీళ్ళను నేను గమనిస్తూనే వున్నాను..ఎండగా వున్నా..వర్షం కురుస్తున్నా కూడా ఆ కుటుంబం ఆ అరుగు మీదే వుంటున్నారు తప్ప..తలదాచుకోవడానికి రూము ల్లోకి రావడం లేదు..కొద్దిగా ఆశ్చర్యం గా ఉండేది నాకు..ఆరుబయట..ఏ ఆచ్ఛాదనా లేకుండా..కేవలం రావి చెట్టు నీడలో.. వీళ్ళు ఎలా వుండగలుగుతున్నారా? అని..
ఒకరోజు కుతూహలం ఆపుకోలేక..వీళ్ళ వివరాల కోసం మా సిబ్బందిని అడిగాను..ఈ కుటుంబం..పొన్నలూరు మండలంలోని లింగంగుంట గ్రామం..ఇళ్లు కట్టే మెస్త్రీ పని చేస్తుంటాడు అతను.తనకొచ్చిన ఆదాయం లోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు..ఇద్దరు మొగపిల్లలు..పెద్ద పిల్లవాడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు..రెండవవాడు పదవతరగతి చదువుతున్నారు.. ఉన్నంతలో బాగానే జరిగిపోతున్న సంసారం లో చిన్న కుమారుడి మానసిక స్థితి లో మార్పు వచ్చింది..పిచ్చి పిచ్చిగా ప్రవర్తించసాగాడు..మరో వారం కల్లా పెద్దకుమారుడూ అలానే మారిపోయాడు..ఇవన్నీ గ్రహ బాధలనీ..ఇవి తొలగిపోవాలంటే మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి వద్దకు వెళ్లి కొన్నాళ్ల పాటు శ్రీ స్వామివారి ని కొలుస్తూ వుండమని కొందరు చెప్పారు..ఆ మాట ఈ దంపతుల మనసులో నాటుకుపోయింది..ఒక క్షణం కూడా ఆలస్యం లేకుండా..పిల్లలను తీసుకొని మొగలిచెర్ల లోని శ్రీ స్వామివారి మందిరానికి చేరారు..
ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఉదయం, సాయంత్రం..శ్రీ స్వామివారి సమాధి మందిరానికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయసాగారు..పది రోజులు గడిచిపోయాయి..పిల్లల ప్రవర్తన లో మార్పు వస్తున్నది.. ముందుగా చిన్న పిల్లవాడు మామూలుగా మారాడు..మరో పదిరోజుల కల్లా పెద్దవాడిి ప్రవర్తన కూడా మారిపోయింది..ఆ తల్లీ తండ్రీ సంతోషానికి అవధులు లేవు..వాళ్ళు శ్రీ స్వామివారి వద్ద నలభై రోజులు ఉంటామని మ్రొక్కుకున్నారు..కానీ ఇరవై రోజుల్లోనే పిల్లలకు స్వస్థత ఏర్పడింది..అంతమాత్రం చేత వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్లిపోలేదు..శ్రీ స్వామివారి మందిరం వద్దే..ఆ చెట్టుకిందే వున్నారు..మందిరం లో చిన్న చిన్న పనులు చేయసాగారు..ఆ భార్యా భర్తా ఇద్దరూ మందిరం వద్ద పనులకు రాసాగారు..క్రమంగా మందిరం వద్దే ఏదో ఒక పని చేసుకుంటూ కాలం గడపసాగారు..నలభై రోజుల పాటు శ్రీ స్వామివారిని కొలుద్దామనుకున్న ఆ కుటుంబం మూడు నెలల పాటు ఉండిపోయింది..పిల్లలిద్దరూ వాళ్ళ ఊరు వెళ్లి తమ తమ పరీక్షలు వ్రాసి వచ్చారు..మంచి మార్కులతోనే పాసయ్యారు..నలభై రోజుల తర్వాత కూడా ఆ కుటుంబం ఆ చెట్టు క్రింద ఉన్న అరుగు వద్ద నుంచి రూము లోకి రాలేదు..అక్కడే వున్నారు..
పిల్లలిద్దరూ పనికిరాకుండా పోతారేమోనని దిగులుపడ్డ ఆ దంపతులకు వాళ్ళు మళ్లీ మామూలు మనుషులవడానికి శ్రీ స్వామివారి ఆశీస్సులే కారణమని ప్రగాఢంగా నమ్మారు..మూడు నెలల తరువాత..వాళ్ళ ఊరికి వెళ్లేముందు..వాళ్ళను అడిగాను.."ఇన్నాళ్లూ ఆ చెట్టు క్రింద ఎలా వుండగలిగారూ?.." అని..
"అయ్యా..మేము అనుకున్నది కాదు..మొదటిరోజు ఇక్కడికి వచ్చినప్పుడు..ఆరోజు రాత్రి నాకు స్వప్నం లో ఒక యోగి కనబడి..మమ్మల్ని ఇక్కడే వుండమని ఆదేశించాడు..అది శ్రీ స్వామివారి ఆదేశం అనుకొని..మేము అక్కడే ఉండిపోయాము..ఎండయినా.. వాన అయినా..అక్కడే వున్నాము..మేము అనుకున్న నలభై రోజుల దీక్ష లో ఇది కూడా ఒక భాగం అనుకున్నాము..చిత్రంగా మాకు ఎటువంటి ఇబ్బందీ కలుగలేదు..ఆ స్వామి మమ్మల్ని కాపాడాడు.." అని చెప్పాడు..
శ్రీ స్వామివారి వద్ద నిరంతరమూ ఉన్నామనీ..అన్ని పనులూ సక్రమంగా చేస్తున్నామనీ..ఒక్కొక్కసారి కొద్దిగా గర్వంగా అనుకుంటాము..ఇటువంటి వారికున్న భక్తిలో ఎంత శాతం మనలో ఉందీ అని మాత్రం అనుకోము.. అందుకే అటువంటి వారిని అన్నివేళలా దైవం అడుగడుగునా కాపాడతాడు..
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా.. పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి