13, ఆగస్టు 2021, శుక్రవారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*967వ నామ మంత్రము* 13.8.2021


*ఓం సుమంగళ్యై నమః* 


సువాసినీ స్వరూపురాలైన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సుమంగళీ* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం సుమంగళ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబికను భక్తిశ్రద్ధలతో ఆరాధించు సాధకులకు జీవనగమనమంతయు శుభప్రదమై సాగును.


జగన్మాత సర్వమంగళ స్వరూపిణి. *శోభనం మంగళం అస్యాః* (సౌభాగ్య భాస్కరం, 1066వ పుట) శోభనమైన మంగళము గల లలితాంబిక. అమ్మవారు పరబ్రహ్మస్వరూపిణి గనుక నిత్యసుమంగళి యనదగును. అమ్మవారి భర్త అయిన పరమేశ్వరుడు మృత్యువుకే మృత్యువైనవాడును, మృత్యుంజయుడు అనబడినాడు. హాలాహలమును సామాన్యమైన జలము మాదారిగా గ్రోలినవాడు. గరళకంఠుడని నామము గలవాడు. గనుకనే పరమేశ్వరి నిత్యసుమంగళి. *సత్కృత్యములు చేయుట, అకృత్యములు చేయకుండుట యను ఈ రెండిటిని మంగళమని బ్రహ్మవేత్తలు అయిన ఋషులు చెప్పారు* అని అత్రిస్మృతియందు గలదు. అమ్మవారు తను సర్వమంగళయని తెలిసియున్నది. గనుకనే పరమేశ్వరుని హాలాహలము గ్రోలమని చెప్పినది. తన మంగళసూత్రమనందు గట్టి నమ్మకమున్న నిత్యసుమంగళి గనుకనే ఆ తల్లి *సుమంగళీ* యని అనబడినది. ఇదే విషయాన్ని బమ్మెరపోతనా మాత్యులవారు ఆంధ్రమహాభాగవతంలో ఇలా చెప్పారు.


*కంద పద్యము*


మ్రింగెడి వాఁడు విభుం డని

మ్రింగెడిదియు గరళ మనియు మే లని ప్రజకున్

మ్రింగు మనె సర్వమంగళ

మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!


ఆమె సర్వమంగళ కదా మరి; అంతేకాక ఆమె తన మనస్సులో తన మంగళసూత్రాన్ని అంత గట్టిగా నమ్మింది. కనుకనే మింగేవాడు తన భర్త అని, మింగేది విషం అని తెలిసి కూడ లోకులు అందరికి మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే పార్వతీదేవి హాలాహలాన్ని మింగు మని పరమశివునికి చెప్పింది.

 

శివుడు లోకాలన్ని దహించేస్తున్న ఆ హాలాహలాన్ని మింగాడు అనగానే. కాపాడమని అడిగిన గొప్పవాళ్ళు బ్రహ్మాది దేవతలు కనుక లోకమంగళం కోసం మింగాడు. సరే మరి ఆయన భార్య అడ్డుపడకుండా ఎలా ఒప్పుకుంది. భార్య తన భర్త ఇంతటి సాహసానికి పూనుకుంటే చూస్తూ ఊరుకుంటుందా. అందులో ఈవిడ భర్త శరీరంలో సగం పంచుకొన్నావిడ. ఇదే అనుమానం పరీక్షిత్తు అడిగితే శుకుడు చెప్పిన సమాదానం ఇదే.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం సుమంగళ్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: