13, ఆగస్టు 2021, శుక్రవారం

సంస్కృత మహాభాగవతం

 


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది ఏడవ అధ్యాయము*


*శ్రుతిగీతలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*87.41 (నలుబది ఒకటవ శ్లోకము)*


*ద్యుపతయ ఏవ తే న యయురంతమనంతతయా త్వమపి యదంతరాండనిచయా నను సావరణాః|*


*ఖ ఇవ రజాంసి వాంతి వయసా సహ యచ్ఛ్రుతయః త్వయి హి ఫలంత్యతన్నిరసనేన భవన్నిధనాః॥12001॥*


దేవా! స్వర్గాదిలోకములకు అధిపతులైన ఇంద్రుడు, బ్రహ్మదేవుడు మొదలగువారుగూడ నీ అభ్యంతరములను తెలిసికొనజాలరు. ఇక మానవమాత్రుల విషయము చెప్పనేల? అంతేగాదు, నీవుగూడ వాటి హద్దును ఎఱుంగజాలవు. ఇది ఎంతయు ఆశ్చర్యకరము. యథార్థముగా ఆద్యంతములే లేనప్పుడు దానిని తెలిసికొనుట ఎట్లు? గాలిచే ఎగురగొట్టబడిన ధూళికణములు ఆకాశమునందువలె నీలో సప్తావరణములతో కూడిన అసంఖ్యాక బ్రహ్మాండములు ఒక్కసారిగా తిరుగుచుండును. ఇంక నీ అవధి ఎట్లు తెలియును? వేదములమైన మేముగూడ సాక్షాత్తుగా నీ స్వరూపమును వర్ణింపజాలము. నీకు అతిరిక్తములైన వస్తువులను *నేతి-నేతి* (న + ఇతి, న + ఇతి) అని నేషేధించుచు, నిషేధించుచు పోగా పోగా చివఱకు మమ్ములనుగూడ మేము నిషేధించుకొనుచుపోగా మా అస్తిత్వమును (ప్రత్యేకతను) కోల్పోయి నీలోనే ఐక్యమగుదుము." అని శ్రుతులు భగవానునితో పలికెను.


*సప్తావరణములు*:- 1. మహత్తత్త్వము, 2. అహంకారము, 3. పృథివి, 4. జలము, 5. అగ్ని, 6. వాయువు, 7. ఆకాశము.


*శ్రీభగవానువాచ*


*87.42 (నలుబది రెండవ శ్లోకము)*


*ఇత్యేతద్బ్రహ్మణః పుత్రా ఆశ్రుత్యాత్మానుశాసనమ్|*


*సనందనమథానర్చుః సిద్ధా జ్ఞాత్వాఽఽత్మనో గతిమ్॥12002॥*


*పిమ్మట నారాయణఋషి ఇట్లనెను* "నారద మహామునీ! ఈ విధమగా బ్రహ్మమానస పుత్రులైన సనకాది మహర్షులు సనందునిద్వారా ఆత్మ పరమాత్మల ఏకత్వమును నిరూపించునట్టి ఉపదేశమును వినిరి. తాము ఆత్మజ్ఞానమును పొందినవారై కృతకృత్యులు అగుటతో వారు సనందనుని పూజించిరి.


*87.43 (నలుబది మూడవ శ్లోకము)*


*ఇత్యశేషసమామ్నాయపురాణోపనిషద్రసః|*


*సముద్ధృతః పూర్వజాతైర్వ్యోమయానైర్మహాత్మభిః॥12003॥*


దేవర్షీ! నారదా! సనకాదిఋషులు సృష్ట్యారంభము నుండే ఉత్పన్నమైరి. కనుక, వారు అందరికంటెను పూర్వజులు. ఆకాశగమనులైన ఆ మహాత్ములు ఈ విధముగా సమస్తవేద, పురాణ, ఉపనిషత్తుల సారమును మనకు అందించిరి.


*87.44 (నలుబది నాలుగవ శ్లోకము)*


*త్వం చైతద్బ్రహ్మదాయాద శ్రద్ధయాఽఽత్మానుశాసనమ్|*


*ధారయంశ్చర గాం కామం కామానాం భర్జనం నృణామ్॥12004॥*


మహాత్మా! నారదా! నీవుగూడ వారివలె బ్రహ్మమానసపుత్రుడవే. వారి జ్ఞానసంపదకు ఉత్తరాధికారివి గనుక, ఈ బ్రహ్మాత్మ విద్యను శ్రద్ధగా ధారణచేసి, నీవు స్వేచ్ఛగా సంచరింపుము. ఈ బ్రహ్మవిద్య మానవాళియొక్క సమస్త విషయవాసనలను భస్మమొనర్చును".


*శ్రీశుక ఉవాచ*


*87.45 (నలుబది ఐదవ శ్లోకము)*


*ఏవం స ఋషిణాఽఽదిష్టం గృహీత్వా శ్రద్ధయాఽఽత్మవాన్|*


*పూర్ణః శ్రుతధరో రాజన్నాహ వీరవ్రతో మునిః॥12005॥*


*శ్రీశుకుడు వచించెను* మహారాజా! దేవర్షియైన నారదుడు జితేంద్రియుడు, జ్ఞాని, పూర్ణకాముడు, నైష్ఠిక బ్రహ్మచారి. అతడు తాను విన్నదానిని వెంటనే పూర్తిగా ధారణచేయును. నారాయణమహర్షి చేసిన ఉపదేశమును శ్రద్ధగా గ్రహించిన పిదప నారదుడు ఇట్లనెసు-


(వేదములు సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుని స్తుతించిన విధమును సనందుడు, సనకాది ఋషీశ్వరులకు తెలిపెను. దానిని నారాయణఋషి నారదునకు వివరించెను. దానిని ప్రస్తుతము శుకయోగి, పరీక్షిన్మహారాజునకు విశదపరచెను)


*నారద ఉవాచ*


*87.46 (నలుబది ఆరవ శ్లోకము)*


*నమస్తస్మై భగవతే కృష్ణాయామలకీర్తయే|*


*యో ధత్తే సర్వభూతానామభవాయోశతీః కలాః॥12006॥*


*నారదుడు నుడివెను* "దేవా! నీవు సచ్చిదానందస్వరూపుడవు శ్రీకృష్ణుడవు. నీ యొక్క కీర్తి నిర్మలమైనది. నీవు సకల జీవులను సంసారబంధములనుండి విముక్తులను గావించుటకై మహనీయములైన లీలావతారములను దాల్చితివి. అట్టి పరమాత్ముడవైన నీకు నమస్కారము".


*87.47 (నలుబది ఏడవ శ్లోకము)*


*ఇత్యాద్యమృషిమానమ్య తచ్ఛిష్యాంశ్చ మహాత్మనః|*


*తతోఽగాదాశ్రమం సాక్షాత్పితుర్ద్వైపాయనస్య మే॥12007॥*


ఇట్లు పలికిన పిదప నారదుడు మహాత్ముడైన నారాయణమహర్షికిని, ఆయనయొక్క శిష్యులకు వినమ్రుడై నమస్కరించెను. అనంతరము ఆ దేవర్షి మా తండ్రియగు వ్యాసభగవానునియొక్క ఆశ్రమమునకు స్వయముగా వెళ్ళెను.


*87.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*


*సభాజితో భగవతా కృతాసనపరిగ్రహః|*


*తస్మై తద్వర్ణయామాస నారాయణముఖాచ్ఛ్రుతమ్॥12008॥*


మహారాజా! వ్యాసమహర్షి గౌరవాదరములతో నారదుని సత్కరించి, సుఖాసీనుని గావించెను. పిమ్మట ఆ దేవముని తనకు నారాయణమహర్షి తెలిపిన విషయములను వేదవ్యాసునకు వర్ణించి చెప్పెను.


*87.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*


*ఇత్యేతద్వర్ణితం రాజన్ యన్నః ప్రశ్నః కృతస్త్వయా|*


*యథా బ్రహ్మణ్యనిర్దేశ్యే నిర్గుణేఽపి మనశ్చరేత్॥12009॥*


మహారాజా! 'అవాఙ్మానసగోచరుడు, ప్రాకృతగుణ రహితుడు అయిన పరమాత్మయందు మనస్సును ఏవిధమగా నిలుపవలెను?' అని నీవు ప్రశ్నించియుంటివి. దానికి సమాధానముగా శ్రుతులు భగవానుని వర్ణించిన రీతిని నేను నీకు వివరించియుంటిని (మాతండ్రియగు వ్యాసభగవానునినుండి నేను ఈ విషయములను వినియుంటిని).


*87.50 (ఏబదియవ శ్లోకము)*


*యోఽస్యోత్ప్రేక్షక ఆదిమధ్యనిధనే యోఽవ్యక్తజీవేశ్వరో|*


*యః సృష్ట్వేదమనుప్రవిశ్య ఋషిణా చక్రే పురః శాస్తి తాః|*


*యం సంపద్య జహాత్యజామనుశయీ సుప్తః కులాయం యథా|*


*తం కైవల్యనిరస్తయోనిమభయం ధ్యాయేదజస్రం హరిమ్॥12010॥*


రాజా! భగవంతుడే ఈ విశ్వమును సంకల్పించును. దాని ఆది, మధ్య, అంతములయందు తానే నిలిచియుండును. ప్రకృతి మరియు జీవులకు ఆయనయే స్వామి. ఆ పరమేశ్వరుడే ఈ జగత్తును సృష్టించి, అందులో తాను జీవునిరూపమున ప్రవేశించెను. ఆయనయే ఈ దేహములను నిర్మించి, వానిని పాలించుచున్నాడు. గాఢనిద్రలో నున్న పురుషుడు తన శరీరముతోగల అనుసంధానమును ఏవిధముగ విడచిపెట్టునో, అట్లే భగవంతుని పొందిన జీవుడు మాయనుండి ముక్తుడగును. భగవానుడు కేవలము విశుద్ధమైన చిన్మాత్రస్వరూపుడు. జగత్తువలన ఆయనలో మాయ లేక ప్రకృతియొక్క అస్తిత్వము పిసరంతకూడా ఉండదు. వాస్తవమునకు అభయస్థానము - సర్వలోకశరణ్యుడు ఆయన ఒక్కడే. అట్టి భగవానుని నిరంతరము ధ్యానపూర్వకముగ చింతించవలెను.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే నారదనారాయణసంవాదే వేదస్తుతిర్నామ సప్తాశీతితమోఽధ్యాయః (87)*


ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, ఉత్తరార్ధమునందలి *శ్రుతి గీతలు* 

అను ఎనుబది ఏడవ అధ్యాయము (87)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: