*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది ఏడవ అధ్యాయము*
*శ్రుతిగీతలు*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*87.37 (ముప్పది ఏడవ శ్లోకము)*
*న యదిదమగ్ర ఆస న భవిష్యదతో నిధనాత్ అనుమితమంతరా త్వయి విభాతి మృషైకరసే|*
*అత ఉపమీయతే ద్రవిణజాతివికల్పపథైః వితథమనోవిలాసమృతమిత్యవయంత్యబుధాః॥11997॥*
పురుషోత్తమా! వాస్తవముగా ఈ జగత్తు ఉత్పత్తికి ముందునూలేదు. ప్రళయమునకు తరువాతగూడ ఉండబోదు. మధ్యకాలమునందు అనగా వర్తమానకాలమునందు ఏకాత్మ స్వరూపుడవైన నీయందు మిథ్యారూపముననే ప్రతీతమగుచున్నది. కుండలు, శస్త్రములు, కుండలములు మొదలగునవి క్రమముగా మట్టి, లోహము, బంగారములనుండి ఏర్పడిన నామమాత్ర రూపములే. అట్లే పరమాత్మయందు వర్ణితమైస జగత్తు నామమాత్రమే. ఇది సర్వధా మిథ్య, మనఃకల్పితము, అజ్ఞానులైన మూర్ఖులు మాత్రమే దీనిని సత్యమని భావింతురు. ఈ జగత్తు అంతయును సత్యస్వరూపుడవైన నీ నుండియే వ్యక్తమగుచున్నది.
*87.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*
*స యదజయా త్వజామనుశయీత గుణాంశ్చ జుషన్ భజతి సరూపతాం తదను మృత్యుమపేతభగః|*
*త్వముత జహాసి తామహిరివ త్వచమాత్తభగో మహసి మహీయసేఽష్టగుణితేఽపరిమేయభగః॥11998॥*
పరమేశ్వరా! జీవుడు అంశయే అగుటవలన అతని స్వస్వరూపము సచ్చిదానందమయమే. కాని, ఆ జీవుడే మాయామోహితుడై అవిద్యను ఆశ్రయించినప్పుడు తన సహజమైన ఆనందాది గుణములను విస్మరించి, త్రిగుణ జన్యములైన వృత్తులు, ఇంద్రియములు, దేహములయందు బంధింపబడి, వాటినే తన స్వరూపములుగా భావించి, వాటియందే నిరతుడై యుండును. దేహాదుల జన్మమృత్యువులనే తన జనన మరణములుగా భావించి, ఆ చక్రములో తిరుగుచుండును. కానీ, ప్రభూ! పాము తన కుబుసమును వదలి, దానితో ఎట్టి సంబంధమూ లేకున్నట్లు ప్రవర్తించును. అట్లే, నీవును ఈ మాయతో (అవిద్యతో) ఎట్టి సంబంధమునూ కలిగియుండక దానినుండి వేరుగానుందువు. ఐశ్వర్యాది గుణములు అన్నియును సంపూర్ణముగా సర్వదా నీ యందు ఉండును. నీవు అణిమాది అష్ట సిద్ధులతో గూడిన పరమేశ్వరుడవు. నీ యొక్క ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, సంపదలు, జ్ఞానము, వైరాగ్యము అపరిమితములు, అనంతములు. అవి, దేశ, కాల, వస్తువులతో పరిమితములుగావు, పరిచ్ఛిన్నములుగావు.
*87.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*
*యది న సముద్ధరంతి యతయో హృది కామజటా దురధిగమోఽసతాం హృది గతోఽస్మృతకంఠమణిః|*
*అసుతృపయోగినాముభయతోఽప్యసుఖం భగవన్ అనపగతాంతకాదనధిరూఢపదాద్భవతః॥11999॥*
పరమపురుషా! మానవులలో కొందరు యతులైనప్పటికిని, వారి మనస్సులలోని విషయవాసనలు పూర్తిగా తొలగిపోనంతవరకును వారు, కంఠమునందు ఉన్న మణిని గుర్తింపజాలని అజ్ఞానులవలె తమ హృదయములలో విరాజమానుడవైయున్న నిన్ను తెలిసికొనజాలరు. విషయసుఖములయందే తత్పరులై యుండెడి అట్టి కపటయతులకు ఇహపరములయందును దుఃఖమే మిగులును. బ్రతికియున్నంతవరకును వారు లోకులను రంజింపజేయుచు, ధనార్జనకై పడరాని పాట్లు పడుచు, నిన్ను విస్మరించి, అంతులేని అకృత్యములకు ఒడిగట్టుచుందురు. ఫలితముగా వారు ఈ లోకమున మిగుల దుఃఖములపాలగుటయేగాక నీ అసుగ్రహమునకు దూరమైనందున మరణానంతరమున యమయాతనలను అనుభవింపవలసియుండును.
*87.40 (ముప్పది ఏడవ శ్లోకము)*
*త్వదవగమీ న వేత్తి భవదుత్థశుభాశుభయోః గుణవిగుణాన్వయాంస్తర్హి దేహభృతాం చ గిరః|*
*అనుయుగమన్వహం సగుణ గీతపరంపరయా శ్రవణభృతో యతస్త్వమపవర్గగతిర్మనుజైః॥12000॥*
పురుషోత్తమా! నీవు మానవులకు పుణ్యపాపకర్మల ఫలములను ప్రసాదించువాడవు. నీ యందే అనురక్తులైన అనన్యభక్తులకు ఆ సుఖదుఃఖముల పై ధ్యాసయే యుండదు. దేహాభిమానుల కొఱకే ప్రతిపాదింపబడిన శాస్త్రముల విధినిషేధములకును వారు అతీతులు. అట్టివారు (భక్తాగ్రేసరులు) భాగవతోత్తములు. నీకృపకు పాత్రులై మోక్షమును పొందుదురు. అంతేగాదు, నీ స్వరూపజ్ఞానమునకు నోచుకొనని భక్తులుగూడ ప్రతి యుగమునందును నీవు సల్పిన లీలలను, నీ గుణములను, వినుటవలనను, కీర్తించుటవలనను నీవు వారి హృదయములయందు స్థిరముగా నిలచియుందువు. అట్టి భక్తులుగూడ నీ అనుగ్రహమునకు పాత్రులై, లౌకికములైన సుఖదుఃఖములను, విధినిషేధములను త్రోసిరాజని, నీ పరమపదమును పొందుదురు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఎనబది ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి