18, ఆగస్టు 2021, బుధవారం

పరమార్థ కథలు* గురుదక్షిణ

 006


*పరమార్థ కథలు*

 పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,


శ్రీశుకబ్రహ్మాశ్రమము, 


శ్రీకాళహస్తి.


*గురుదక్షిణ* 


పూర్వము జనకమహారాజు మిథిలానగరమున రాజ్యమేలు చుండెను. రాజ్యకార్యములతో పాటు దైవచింతన పరమార్థ విచారణ అతడు లెస్సగా సలుపుచుండెను. అధ్యాత్మతత్త్వ జిజ్ఞాస తీవ్రతరము కాగా ఒకనా డాతడు తన దేశములో నలుమూలల నొక ప్రకటన గావించెను. “ఈ దేశములో గల పండితులు, తత్త్యజ్ఞులు, వేదాంతులు ఎవరెవరు కలరో వారందయఱును రాజధానికి వచ్చి రాజునకు బ్రహ్మజ్ఞానోపదేశము చేయవలెను. అనుభవపూర్వకముగా బోధించ వలెనే కాని నోటిమాటలతో కాదు. గుఱ్ఱపు రికాబులో ఒక కాలుపెట్టి, మరియొక రికాబులో కాలు పెట్టులోపల - అనగా క్షణకాలములో (బ్రహ్మానుభూతిని గలిగించవలెను, అట్లు కలిగింపలేని వారందఱున్ను దేశమునుండి వెడల గొట్టబడుదురు” అని దండోరా వేయించెను. 


రాజుగారి యా ప్రకటన దేశములో గొప్ప సంచలనము గలుగజేసెను. పండితులు, కవులు, శాస్త్రవేత్తలు భూపాలునకు ఆత్మతత్త్వానుభూతి కలుగజేయ గల్గునంతటి సామార్థ్యము లేనివారగు టచే దేశబహిష్కరణ శిక్షకు భయపడి అత్యంత చింతాక్రాంతులై యుండిరి. భూపతిని సమిపించుట కెవరును సాహసింపలేదు. అత్తఱి అష్టావక్రుడను మహర్షి యెచటకో పోవు చుండెను. ప్రజలందరును విచారగ్రస్తులై యుండుట జూచి కారణమరయ వారు జరిగిన విషయమును సవిస్తరముగా తెలియజేసిరి. అష్టావక్రుడు వారలకు అభయమొసంగి వెంటనే రాజప్రాసాదమున కరిగి రాజుతో తాను బ్రహ్మజ్ఞానము నుపదేశిం చెదనని ధైర్యముతో బలికెను. భూపాలుడంగీకరించెను. “ఉపదేశము ఏకాంత స్థలమునందే చేయవలెను గాని బహిరంగముగ గాదు. కావున సమిపారణ్యమునకు బోవుదము రండు” అని యమ్మునీశ్వరుడు పలుక రాజు తన అశ్వమును, కొందరు సైనికులను వెంటనిడుకొని సమిాప కాననమునకు బయల్వెడలెను. 


త్రోవలో నొకచోట సైన్యమును నిలిపివేసి, గురుశిష్యు లిరువు రును నిర్జన ప్రదేశమునకు పోయిరి. జనకు డచట తన గుజ్జపు రికాబులో కాలుపెట్టెను. “రెండవ రికాబులో కాలుపెట్టులోపల బ్రహ్మానుభూతి కలిగించవలెను”ఇది సమస్య. అత్తఱి అష్టావక్ర మునీంద్రుడు బోధకు ముందుగా గురుదక్షిణ నివవలసినదిగా రాజును కోరెను. తానేది కోరుకొనిన దానిని తప్పక నొసంగెదనని జనకుడు పలికెను. తక్షణమే అమ్మునివర్యుడు “నీ మనస్సును నా కొసంగుము' అని యాదేశింప జనకుడట్లే చేసెను. మనస్త్యాగముచే జనకుని శరీరము గుఱ్ఱముపై నిశ్చేష్టముగ నుండిపోయెను. డ్రైవరు లేని బండివలె దేహము కదలక మెదలక యుండెను. అట్టి స్థితిలో నాతని నచట వదలివైచి అష్టావక్రుడు వెడలిపోయెను. 


దూరముగా నున్న సైనికులు రాజుకై నిరీక్షించి వారి జాడ యెచ్చటను లేమి వారే స్వయముగా వెతకుటకై పయనమైరి. ఒకచోట గుఱ్ఱముపై రాజు నిశ్చేష్టుడుగ నుండుటజూచి వారాశ్చర్య నిమగ్నులై అష్టావక్రు డేదియో సమ్మోహ మంత్రమును ప్రయోగించెనని భావించి వెంటనే యాతనిని వెతికి తోడితెచ్చిరి. అష్టావక్రుడు జనకుని స్పృళింప గనే యాతనికి స్పృహ కలిగెను. జనక మహారాజా! నీవు ధన్వుడవు తృటికాలములో (బ్రహ్మానుభూతి కలుగుటకు అనువుగా నీ హృదయ మును అత్యంత పరిశుద్ధ మొనర్చుకొంటివి. మనస్సును ఒక పదార్థము వలె త్యజించివేయు సమర్థతను బడసితివి. ఇక నీకు క్రొత్తగా బోధించవలసినది లేదు. ఆత్మకు అడ్డుగా నున్న మనస్సన్నును తొలగించుటయే అన్ని బోధల యొక్క సారాంశము, అన్ని సాధనల యొక్క పర్యవసానము, అదియే అమనస్కస్థితి. మనస్సు అను అడ్డు తొలగించిన శేషించునదే ఆత్మ. అట్టి ఆత్మానుభూతియే మోక్షము. మనోలయము ద్వారా, మనస్త్యాగము ద్వారా నీవట్టి మహోచ్ఛస్థితిని బడసితివి. కావున ధన్యుడవు అని అష్టావక్రమునీంద్రుడు జనకునితో పలుక, అంతట జనకుడు తన కట్టి సులభమగు మోక్షోపాయమును బోధించిన యా సద్గురువర్యునకు సాష్టాంగవందన మాచరించెను. తదుపరి యందఱున్ను తిరిగి నగరమునకు బోయిరి. 


*నీతి:- మనస్సును బహిర్ముఖముగ పోనీయక అంతర్ముఖముగ ఆత్మయందు లయింపజేసి ఆత్మరూపుడై వర్తించుటయే మోక్షము. అట్టి మనస్త్యాగరూప ఆత్మస్థితినే జీవుడు సాధించవలెను. అదియే వాస్తవమగు గురుదక్షిణ*.

కామెంట్‌లు లేవు: