18, ఆగస్టు 2021, బుధవారం

మహాభాగవతం

 *


*వేదవ్యాసుల వారి  మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది తొమ్మిదవ అధ్యాయము*


*భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించుట - మృతులైన బ్రాహ్మణ కుమారులను శ్రీకృష్ణుడు తీసికొనివచ్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*89.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*


*తత్రాశ్వాః శైబ్యసుగ్రీవమేఘపుష్పబలాహకాః|*


*తమసి భ్రష్టగతయో బభూవుర్భరతర్షభ॥12099॥*


మహారాజా! శైబ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, బలాహకము అను పేర్లుగల శ్రీకృష్ణుని రథాశ్వములు ఆ ఘోరాంధకారమున దారీతెన్నూ తెలియక తడబడసాగెను.


*89.50 (ఏబదియవ శ్లోకము)*


*తాన్ దృష్ట్వా భగవాన్ కృష్ణో మహాయోగేశ్వరేశ్వరః|*


*సహస్రాదిత్యసంకాశం స్వచక్రం ప్రాహిణోత్పురః॥12100॥*


మహాయోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు తన రథాశ్వముల దురవస్థను గమనించెను. వెంటనే ఆ భగవానుడు వేయి సూర్యులయొక్క కాంతులతో తేజరిల్లుచున్న తన సుదర్శన చక్రమును రథమునకు ముందుభాగమున నడపెను.


*89.51 (ఏబది ఒకటవ శ్లోకము)*


*తమః సుఘోరం గహనం కృతం మహద్విదారయద్భూరితరేణ రోచిషా|*


*మనోజవం నిర్వివిశే సుదర్శనం గుణచ్యుతో రామశరో యథా చమూః॥12101॥*


భగవత్కల్పితమైన ఆ గాఢాంధకారము ఏమాత్రమూ చొఱరానిదై భయంకరముగా నుండెను. అత్యద్భుతమైన కాంతిపుంజముతో వెలుగొందుచున్న ఆ సుదర్శనచక్రము మనోవేగముతో సాగుచు, శ్రీరాముని ధనుస్సునుండి ప్రయుక్తమైన బాణము శత్రుసైన్యమునువలె ఆ చిమ్మ చీకట్లను చీల్చుకొనుచు పురోగమించెను.


*89.52 (ఏబది రెండవ శ్లోకము)*


*ద్వారేణ చక్రాఽనుపథేన తత్తమః పరం పరం జ్యోతిరనంతపారమ్|*


*సమశ్నువానం ప్రసమీక్ష్య ఫాల్గునః ప్రతాడితాక్షో పిదధేఽక్షిణీ ఉభే॥12102॥*


సుదర్శనచక్రకాంతులను అనుసరించుచు ఆ రథము తమోమండలమును దాటెను. పిదప అది అపారముగా విస్తరించియున్న జ్యోతిర్మండలమున ప్రవేశించెను. ఆ కాంతిపుంజములు కనులలోబడి బాధించుచుండుటతో అర్జునుని కన్నులు చూడలేక మూతబడిపోయెను.


*89.53 (ఏబది మూడవ శ్లోకము)*


*తతః ప్రవిష్టః సలిలం నభస్వతా బలీయసైజద్బృహదూర్మిభూ|*


*తత్రాద్భుతం వై భవనం ద్యుమత్తమం భ్రాజన్మణిస్తంభసహస్రశోభితమ్॥12103॥*


ముందునకు సాగిపోవుచున్న శ్రీకృష్ణభగవానుని దివ్యరథము ఒక జలరాశియందు ప్రవేశించెను. ప్రచండమైన వాయువులధాటికి ఎగసిపడుచున్న తరంగములు ఆ జలధికి ఆభరణములై ఒప్పుచుండెను. ఆ జలములకు అథోభాగమునగల ఒక అద్భుత భవనమునందు ఆ రథము ప్రవేశించెను. ఆ మహాభవనము వేలకొలది మణిస్తంభములతో విరాజిల్లుచుండెను. వాటి కాంతులు నలువైపుల ప్రసరించుచు ఆ భవనశోభను ఇసుమడింప జేయుచుండెను.


*89.54 (ఏబది నాలుగవ శ్లోకము)*


*తస్మిన్ మహాభీమమనంతమద్భుతం సహస్రమూర్ధన్యఫణామణిద్యుభిః|*


*విభ్రాజమానం ద్విగుణోల్బణేక్షణం సితాచలాభం శితికంఠజిహ్వమ్॥12104॥*


ఆ మహాభవనమునందు ఆదిశేషుడు విలసిల్లుచుండెను. ఆయన శరీరము మిగుల అద్భుతమై భయంకరముగా నుండెను. ఆ స్వామి తన వేయిపడగలపైగల దివ్యమణికాంతులతో తేజరిల్లుచుండెను. ఒక్కొక్క శిరమునందుగల రెండేసి కన్నులు మిక్కిలి భయానకముగా ఉండెను. ఆ ప్రభువుయొక్క దేహము శ్వేతకాంతులను వెల్లివిరియజేయుచు స్ఫటిక పర్వతతుల్యమై అలరారుచుండెను. కంఠము, నాలుకలు నీలవర్ణ శోభితములై యుండెను. వారికి అట్టి ఆదిశేషుని దర్శనమయ్యెను.


*89.55 (ఏబది ఐదవ శ్లోకము)*


*దదర్శ తద్భోగసుఖాసనం విభుం మహానుభావం పురుషోత్తమోత్తమమ్|*


*సాంద్రాంబుదాభం సుపిశంగవాససం ప్రసన్నవక్త్రం రుచిరాయతేక్షణమ్॥12105॥*


*89.56 (ఏబది ఆరవ శ్లోకము)*


*మహామణివ్రాతకిరీటకుండలప్రభాపరిక్షిప్తసహస్రకుంతలమ్|*


*ప్రలంబచార్వష్టభుజం సకౌస్తుభం శ్రీవత్సలక్ష్మం వనమాలయా వృతమ్॥12106॥*


అచట ఆదిశేషుని దేహమును తల్పముగా జేసికొని, దేదీప్యమానుడై వెలుగొందుచున్న శ్రీమన్నారాయణుని అర్జునుడు దర్శించెను. మహాప్రభావశాలియైన ఆ శ్రీహరి బ్రహ్మాదిదేవతలలో ఉత్తమోత్తముడు. ఆ స్వామి శరీరము దట్టమైన మేఘమువలె శ్యామవర్ణముతో శోభిల్లుచుండెను. పట్టుపీతాంబరధారియైన ఆ ప్రభువుయొక్క వదనము ప్రసన్నమై, మనోహరమైన విశాలనేత్రములతో అలరారుచుండెను. ఆ దేవదేవుని ఫాలభాగమునగల అసంఖ్యాకములైన ముంగురులు మణిమయ కిరీటకుండలములకాంతులచే ద్విగుణిత శోభలను వెలార్చుచుండెను. ఆ సర్వేశ్వరుని అష్టభుజములు దీర్ఘములై, బలిష్ఠములై, మనోహరముగా నుండెను. శ్రీవత్స చిహ్నముతో ఒప్పుచున్న ఆదిదేవుని వక్షస్థలమునందు కౌస్తుభమణి, వనమాల అలంకృతములై చక్కగా విరాజిల్లుచుండెను.


*89.57 (ఏబది ఏడవ శ్లోకము)*


*సునందనందప్రముఖైః స్వపార్షదైశ్చక్రాదిభిర్మూర్తిధరైర్నిజాయుధైః|*


*పుష్ట్యా శ్రియా కీర్త్యజయాఖిలర్ధిభిర్నిషేవ్యమాణం పరమేష్ఠినాం పతిమ్॥12107॥*


బ్రహ్మాది సకల దేవతలకును అధిపతియైన ఆ శ్రీమన్నారాయణుని నందసనందాదులైన ప్రముఖ పార్షదులు, ఆకృతిని దాల్చిన శంఖచక్రాది ఆయుధములు, ఫుష్టి, శ్రీ, కీర్తి, అజ అను శక్తులు, అణిమాది సకలసిద్ధులు సేవించుచుండెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఎనుబది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: