18, ఆగస్టు 2021, బుధవారం

సంస్కృత మహాభాగవతం*

*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది తొమ్మిదవ అధ్యాయము*


*భృగుమహర్షి త్రిమూర్తులను పరీక్షించుట - మృతులైన బ్రాహ్మణ కుమారులను శ్రీకృష్ణుడు తీసికొనివచ్చుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*బ్రాహ్మణ ఉవాచ*


*89.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*సంకర్షణో వాసుదేవః ప్రద్యుమ్నో ధన్వినాం వరః|*


*అనిరుద్ధోఽప్రతిరథో న త్రాతుం శక్నువంతి యత్॥12081॥*


*89.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*తత్కథం ను భవాన్ కర్మ దుష్కరం జగదీశ్వరైః|*


*చికీర్షసి త్వం బాలిశ్యాత్తన్న శ్రద్దధ్మహే వయమ్॥12082॥*


*అంతట బ్రాహ్మణుడు ఇట్లనెను* ""అర్జునా! బలరాముడు, శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడు ధనుర్ధాలలో అగ్రేసరులు. అనిరుద్ధుడు తిరుగులేని యోధుడు. అంతటివారే మా పుత్రులను రక్షింపజాలరైరి. ఆ జగదీశ్వరులకే అసాధ్యమైన ఈ పనిని నీవు ఎట్లు చేయగలవు? అజ్ఞానమువలన నీవు దీనికి సాహసించుచున్నావు. ఈ విషయమున మేము నిన్ను విశ్వసింపము".


*అర్జున ఉవాచ*


*89.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*నాహం సంకర్షణో బ్రహ్మన్ న కృష్ణః కార్ష్ణిరేవ చ|*


*అహం వా అర్జునో నామ గాండీవం యస్య వై ధనుః॥12083॥*


*89.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*మావమంస్థా మమ బ్రహ్మన్ వీర్యం త్ర్యంబకతోషణమ్|*


*మృత్యుం విజిత్య ప్రధనే ఆనేష్యే తే ప్రజాం ప్రభో॥12084॥*


*అర్జునుడు ఇట్లనెను* "బ్రాహ్మణోత్తమా! నేను బలరాముడను కాను, కృష్ణుడనుగాను, ప్రద్యుమ్నుడను కానేకాను. నేను జగత్ప్రసిద్ధమైన గాండవ ధనుస్సును చేబూనిన అర్జునుడను. భూసురశ్రేష్ఠా! ముక్కంటినే సంతోషపఱచిన (ముక్కంటియే మెచ్చుకొనిన) నా పరాక్రమమును చులకన చేయవలదు. మృత్యుదేవతనైనను యుద్ధమున జయించి, నీ సంతానమును తీసికొనివచ్చి నీకు అప్పగించెదను"


*89.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*ఏవం విశ్రంభితో విప్రః ఫాల్గునేన పరంతప|*


*జగామ స్వగృహం ప్రీతః పార్థవీర్యం నిశామయన్॥12085॥*


మహారాజా! అంతట ఆ విప్రునకు అర్జునుని మాటలపై విశ్వాసము కుదురుకొనెను. పిమ్మట అతడు పార్థుని పరాక్రమమును కొనియాడుచు సంతోషముతో తన గృహమునకు చేరెను.


*89.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*ప్రసూతికాల ఆసన్నే భార్యాయా ద్విజసత్తమః|*


*పాహి పాహి ప్రజాం మృత్యోరిత్యాహార్జునమాతురః॥12086॥*


కొంతకాలమునకు ఆ విప్రుని భార్యకు ప్రసవకాలము సమీపించెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆతురతతో అర్జునుని కడకు వచ్చి, "మహాత్మా! నా సంతానమును మృత్యువునుండి రక్షింపుము' అని వేడుకొనెను.


*89.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*స ఉపస్పృశ్య శుచ్యంభో నమస్కృత్య మహేశ్వరమ్|*


*దివ్యాన్యస్త్రాణి సంస్మృత్య సజ్యం గాండీవమాదదే॥12087॥*


వెంటనే అర్జునుడు పవిత్రజలములను ఆచమించి, పరమశివునకు నమస్కరించెను. పిదప అతడు దివ్యాస్త్రములను సంస్మరించి, గాండీవధనుస్సును చేబూని అల్లెత్రాడును సంధించెను.


*89.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*న్యరుణత్సూతికాగారం శరైర్నానాస్త్రయోజితైః|*


*తిర్యగూర్ధ్వమధః పార్థశ్చకార శరపంజరమ్॥12088॥*


పిదప పార్థుడు వివిధములగు అస్త్రములను అభిమంత్రించి, సూతికా గృహమునకు అన్నివైపుల యందును శరపంజరమును నిర్మించెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి ఎనుబది తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: