18, ఆగస్టు 2021, బుధవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము* *972వ నామ

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*972వ నామ మంత్రము* 18.8.2021


*ఓం అశోభనాయై నమః*


అద్వితీయ సౌందర్యముతో తేజరిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అశోభనా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం అశోభనాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో అర్చించు భక్తజనులకు ఆ తల్లి కొంగుబంగారమై సకలాభీష్టములను సిద్ధింపజేయును.


జగన్మాత త్రిపురసుందరి. నిత్యయౌవనవతి. జగదేకసుందరి. కామేశ్వరుడే అత్యంత సుందరస్వరూపుడైతే, కామేశ్వరి (అమ్మవారు) ఆయనను మించిన అపురూప లావణ్యవతి. 


*ఉద్యద్భాను సహస్రాభ* ఉదయించుచున్న వేయి సూర్యుల కాంతిని బోలిన కాంతితో తేజరిల్లునది ఆ తల్లి.


*నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల* తన ఎర్రని శరీర కాంతితో సమస్త బ్రహ్మాండములను ప్రకాశింపజేయునది శ్రీమాత.


*చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ* సహజ సుగంధపూరితమైన తన కేశసంపదతో చంపకాశోకపున్నాగాది కుసుమములకు సుగంధములను అందజేయునది పరమేశ్వరి.


*కురువిందమణి శ్రేణీ కనత్కోటీర మండిత* పద్మరాగ మణులతో ప్రకాశించు కిరీటంతో భాసిల్లు లలితాంబిక.


*అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థల శోభిత* అష్టమితిథి నాటి చంద్రునివలె ప్రకాశించే లలాటము గలిగినది ఆ జగదీశ్వరి.


*వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లిక* జగన్మాత వదనము మన్మథుని మంగళప్రదమైన గృహము. అటువంటి మంగళప్రదమైన గృహమునకు అమ్మవారి కనుబొమలు మన్మథ మాంగల్య గృహమునకు తోరణములై ప్రకాశించుచున్నవి.


*వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన* ఆ శ్రీమాత తన ముఖకాంతి అనే జలప్రవాహమునందు సంచరించు మీనముల కన్నులవంటి నయనములు కలిగినది..


*నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత* పరమేశ్వరి నాసాదండము (ముక్కు ఆకారము) అప్పుడే వికసించిన సంపెంగ వలె అతి కోమలముగాను, సుందరముగాను ఉన్నది. అనగా సంపంగి వంటి నాసిక కలిగినది శ్రీమాత.


*తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర* ముక్కుకు ఉన్న ముక్కెర కాంతులు అత్యంత మనోహరమైన దేదీప్యమాన కాంతులను విరజిమ్ముతూ, శుక్రనక్షత్రకాంతులనే త్రోసిపుచ్చుచున్నంతగా భాసిల్లునది ఆ అమ్మవారు.


*కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా* కదంబ కుసుమముల గుత్తిని చెవులపై భాగంలో ధరించుడంచేత ఆ తల్లి రమణీయమగా భాసిల్లుచున్నది.


*తాటంక యుగళీ భూత తపనోడుప మండలా* అమ్మవారి చెవులకు ఉన్న చెవికమ్మలు రెండునూ సూర్యచంద్రులను తలపించుచున్నంత రమణీయమైన కాంతులను విరజిమ్ముచుండెను.


*పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః* పద్మరాగ శిలలను లేదా అద్దమును సైతం తిరస్కరించేటటువంటి నున్ననైన, నిర్మలమైన చెక్కిలి గలిగియున్నది ఆ శ్రీమాత.


*నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్ఛద* అప్ఫుడే సాన బట్టిన పగడము లేదా దొండపండుల కాంతులను మించిన ఎర్రని కాంతులను జిమ్ముచూ ప్రకాశించే పెదవులతో తేజరిల్లుచున్నది ఆ పరమేశ్వరి.


ఇంకనూ చెప్పాలంటే అమ్మవారి దంతపంక్తులజంట శ్రీవిద్యయందున్న పదహారు వర్ణమలు (అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఏ ఐ ఓ ఔ అం ఆః) అను నట్లుగను, మల్లెమొగ్గల మాదిరిగను అలరారుచున్నవి. వర్ణింపనలవి గాని చుబుకము, అంగద, కేయూరములు అను కాంచనాభరణములతో రాజిల్లు భుజములతోను, రత్నములు, ముత్యములతో చేయబడిన బంగారు కంఠాభరణములతోను, ఎర్రని వస్త్రమును ధరించిన భాసిల్లుచున్న కటిప్రదేశముతోను, చిఱుగంటలతో కూడిన వడ్డాణముతోను, మాణిక్యాలచే నిర్మితమైన కిరీటం వంటి మోకాలు చిప్పలతోను, ఎర్రని ఆరుద్రపురుగులచే చెక్కబడిన అమ్ములపొదులవంటి జంఘలు (పిక్కల) తోను, బలిష్ఠమైన చీలమండల సౌందర్యముతోను, పద్మములను సైతము ధిక్కరించే మృదువైన, సుకుమార లక్షణములతో కూడిన పాద ద్వయంతోను - పరమేశ్వరి సౌందర్యానికి నిలువెత్తు నిదర్శనంగా భాసిల్లుచున్నది. గనుకనే *అశోభనా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం అశోభనాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: