26, డిసెంబర్ 2021, ఆదివారం

సాధన -2

 సాధన -2

కారు, డ్రైవరు 

సాధకునికి ఆత్మానాత్మ విచక్షణ సులభంగా అర్ధం కావటానికి  కఠోపనిషత్లో క్రింది మంత్రం ద్వారా తెలియచేస్తున్నది.  

రథరూప కల్పన ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు | బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ |3|

= ఆత్మానం = ఆత్మను; రథనం = రథస్వామి అని; విద్ధి = తెలుసుకో శరీరం = శరీరాన్ని; రథం ఏవ తు = రథమే అని (తెలుసుకో); బుద్ధిం తు= బుద్ధిని; సారథిం = సారథి అని; విద్ధి = తెలుసుకో; మనః = మనస్సు: ప్రగ్రహం ఏవ చ = పగ్గమే అని కూడా (తెలుసుకో); = = (తా|| ఈ ఆత్మను రథస్వామి అని తెలుసుకో. శరీరాన్నే రథమని తెలుసుకో. బుద్ధిని సారథి అని తెలుసుకో. మనసేమో పగ్గమే అని తెలుసుకో.)

దీనిని ప్రస్తుత కాలానికి అనుగుణంగా సాధకుల సౌలబ్యానికి ఇలా అర్ధన్ని చెప్పుకుందాం. 

ఇక్కడ కారు-కారు డ్రైవరు పోలికతో మనకు ఉపనిషత్తు సాధకునికి తన ఆత్మకు, శరీరానికి వున్న అనుబంధాన్ని తెలియ చేయుచున్నది. ఆత్మను కారు యజమాని గాను, శరీరాన్ని, కారు గాను, బుద్ధిని కారు డ్రైవరుగాను ఇక మనస్సు కారుకు ఉన్నటువంటి స్టీరింగ్, కాగా  బ్రేకు, క్లచ్, యాక్సిలరేటర్లు ఇంద్రియాలుగా పోల్చుతున్నది. కారు యజమాని సురక్షితంగా ప్రయాణం చేయాలంటే కారు డ్రైవరు అలాగే స్టీరింగ్ తదితర అన్ని హంగులు సక్రమంగా పనిచేయాలి. అప్పుడే గమ్యానికి క్షేమంగా చేరగలడు. ప్రయాణం సాఫీగా జరగాలంటే ముందుగా కారు పూర్తి కండిషనులో ఉండాలి అంటే సాధకుని శరీరము పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉండాలి. ఏరకంగా కారు డ్రైవరు రోజు కారు పరిస్థితిని గమనించి లోటుపాట్లు అంటే పెట్రోలు, ఆయిల్ మొదలైనవి సరిగా ఉన్నాయో లేదా అని చూసుకుంటాడో అట్లాగనే సాధకుడు తన బుద్దిని వుపయోగించి శరీరానికి కావలసిన ఆహార, పానీయ దుస్తులు మొదలైనవి బాధ్యతగా సమకూర్చి శరీరం రోగగ్రస్తం కాకుండా, అలసత్వం చెందకుండా ఎప్పుడు చెతన్యవంతంగా వుండే విధంగా చూసుకోవాలి.  కానీ శరీరం మీద మొహాన్ని మాత్రం పెంచుకోకూడదు.  శరీరం కేవలం ఆత్మను పరమాత్మ వద్దకు (మోక్షాన్ని) తీసుకొని వెళ్లే ఉపకరణంగా మాత్రమే చూడాలి అంతేకాని సమాజంలో శరీరానికి ఆపాదించే మానవమానాలు తనవిగా  భావించరాదు. వాటిని పరిగణలోకి తీసుకోరాదు. అప్పుడే సాధకుడు సాధనలో ముందుకు వెళ్లగలడు. 

సాధకుని ద్రుష్టి సదా మోక్షం మీద మాత్రమే ఉండాలి,  భౌతికమైన విషయాలను తాత్కాలికమైనవిగాను తాను వాటికి ఎంతవరకు సంబందం కలిగి ఉండాలో అంతవరకుమాత్రమే సంబంధం ఉంచుకోవాలి. కేవలం తామరాకు మీద నీటి బిందువు లాగ మాత్రమే ఈ సమాజంలో తాను ఉండాలి.  ఇవ్వన్నీ సాధ్యమేనా అనే ప్రశ్న  ఉదయిస్తుంది. నిజానికి అన్ని సాధ్యమే కేవలం మనస్సుని స్వాధీన పరచుకోవాలి.

ఓం తత్సత్. 

ఓం శాంతి శాంతి శాంతిః. 



కామెంట్‌లు లేవు: