26, డిసెంబర్ 2021, ఆదివారం

సాధన -3

 సాధన -3

 శరీర సంసిద్ధత 

వంట చేయాలంటే ముందుగా వంటకు వాడే పాత్రలు శుభ్రంగా తోముకొని స్వచ్ఛమైన నీటితో కడుగుకొని వుంచుకుంటాము. అదే విధంగా బియ్యం, పప్పులు, కూరలు మరియు ఇతర వంటకు పనికివచ్చే దినుసులన్నీ స్వచ్ఛమైనవిగా చూసుకొని అప్పుడు కానీ పొయ్యిమీద గిన్నె పెట్టాము. ఇది మనందరికీ తెలిసిన విషయమే ఎందుకంటె మనం వండుకునే వంటకం స్వచ్ఛముగా, రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉండాలని మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాము. 

సాధకుడు తను ఆ అనంతునివైపు పయనించే సాధన చేయాలంటే తన సాధనకు ఉపకారంగా వున్న శరీరాన్ని కూడా శుభ్రంగా, శుచిగా, శుద్ధంగా సిద్ధం చేసుకోవాలి కదా. ముందు శరీరం శుచిగా ఉంటే అప్పుడు మనస్సు కూడా శుచిగా ఉండి చక్కగా  సాధనకు సహకరిస్తుంది. 

శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం అంటే శుభ్రంగా స్నానం చేయటం అని మనం అనుకుంటాము.  అది కూడా నిజం చక్కగా స్నానమాచరించాలి, అంతేకాక తలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే బుద్ధికుడ శుభ్రంగా అవుతుంది. సాధకునికి దేహ మొహానికి కారణం శిరోజాలు అంటే తలవెంట్రుకలు. అధర్వణ వేదాంతర్గత మైనట్టి ముండకోపనిషత్తు సాధకుని ముందుగా ముండనం చేసుకొని అంటే గుండు చేయించుకోమని తెలుపుతున్నది. ఎప్పుడైతే సాధకుడి తలబొడిది అవుతుందో అప్పుడు అతని బుద్ధికుడ శుభ్రంగా మారుతుంది. మనం తెలుసుకున్న యోగ పురుషులు, ఉదాహరణకు శ్రీ రామకృష్ణ, శ్రీ రమణులు ఇంకా అలంటి వారి కోవకు చెందిన అనేక మహానుభావులు వారి తలలను బోడిగా వుంచుకోవటమే ఇందుకు  నిదర్శనం. ఇప్పుడు కూడా అనేక మంది సన్యాసజీవనాన్ని గడుపుతున్న మహానుభావులు కూడా వారి తలలను బోడిగానే ఉంచుకుంటున్నారు. కాకపొతే సంసార జీవనాన్ని గడుపుతున్న సాధకులు మాత్రము పూర్తిగా బోడి గుండు కాకుండా శిఖను (పిలకను) ధరించాలి. మన సనాతన ధర్మంలో బ్రాహ్మణులకు ఈ రకమైన సంప్రదాయం ఉండటం బహుశా వారి మానసిక ఉన్నతికి తోడ్పాటుకొరకే అయివుండొచ్చు. ఇప్పుడు గుండు పిలక కలిగిన బ్రాహ్మణులను చాలా తక్కువగా చూస్తున్నాము.  కానీ సాధకుడు మాత్రం విధిగా తన సాధనకొరకు గుండు పిలక కలిగి  ఉండాలి. అప్పుడే సాధన సక్రమంగా కొనసాగుతుంది. 

కేశాలను అలంకరించుకొని, ఇంకా మాట్లాడితే రంగు దిద్దుకొని వేదాంత మాటలు చెప్పే వారిని కేవలము మూర్ఖులుగా భావించాలి. తానూ ఆచరించక ఇతరులకు చెప్పటం పెద్ద దోషం. 

సాధకుని ద్రుష్టి సదా మోక్షం మీద మాత్రమే ఉండాలి,  సమాజం నా గూర్చి ఏమనుకొంటుందో అనే భావనను పూర్తిగా విడనాడాలి. ఈ సమాజానికి మనం ఎలా కనబడితే అలానే చూస్తుంది. ఒకరికోసం కాదు జీవనం. సాధకుని ఆధ్యాత్మిక అభివృద్ధి అది కేవలం అతని వ్యక్తిగతం. ఎన్నో విధాల శ్రమదమాలను ఓర్చుకుంటేనే సాధన నిరంతరాయంగా సాగుతుంది. 

సాధకుడు సామాజిక జీవనానికి తక్కువ ప్రాధాన్యత, ఆధ్యాత్మిక జీవనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విషయం సదా జ్ఞ్యాపకం ఉంచుకోవాలి. ముముక్షువు లక్ష్యం ఎప్పుడు మోక్షం మీదనే ఉండాలి.  ఈ సమాజంలో ఇవ్వన్నీ సాధ్యమేనా అనే ప్రశ్న  ఉదయిస్తుంది. నిజానికి అన్ని సాధ్యమే కేవలం మనస్సుని స్వాధీన పరచుకోవాలి.  సాధకుడు తన మనస్సుని తన ఆధీనంలో ఉంచుకుంటే పూర్తి ప్రకృతి శక్తులు తన వశం అవుతాయి. 

ఓం తత్సత్. 

ఓం శాంతి శాంతి శాంతిః. 



కామెంట్‌లు లేవు: