26, జనవరి 2022, బుధవారం

సమర్పణ భావముతో

 ద్వితీయ మంత్రము 

కుర్వన్నే వేహ కర్మాణి జిజీవి షేచ్ఛతన సమాః,

 ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే.

ఇహ=ఈ జగత్తు నందు; కర్మాణి శాస్త్ర నియత కర్మలను; కుర్వన్, ఏవ=(ఈశ్వరుని పూజకై)చేయుచునే; శతంసమా:=నూరు సంవత్సరములు; జీజీవి షేత్ = జీవింపకోరవలెను; ఏవమ్= ఈ విధముగా(త్యాగభావంతో పరమేశ్వరుని కొరకై); కర్మ= చేయబడుకర్మ; త్వయి=నిన్ను; నరే=మనుష్యుని యందు; న, లిప్యతే =బంధింపదు; ఇతః= ఈ మార్గముకంటే; అన్యథా= వేరొక మార్గము; న, అస్తి= లేదు; (మనుష్యుడు సమర్పణ భావముతో కర్మను చేయకుండా కర్మ నుండి ముక్తుడు కాగలిగే మార్గము మరొకటి లేదని భావము.) 

తాత్పర్యము: ఈ జగత్తునందు మానవుడు శాస్త్ర నియత కర్మలను ఈశ్వరపూజా సమర్పణ భావముతో చేయుచునే శత సంవత్సరములు జీవింప నభిలషింప వలెను. ఏలయన, ఈ విధంగా చేయబడు కర్మ అతనిని బంధింపదు. మానవున కింత కంటే వేరొక మార్గము లేదు.

వ్యాఖ్య: పూర్వ మంత్రము నందు చెప్పబడిన విధముగా జగత్తునకు ఏకైక కర్తయు, ధర్తయు, హర్తయు, సర్వశక్తిమంతుడు, సర్వమయుడునగు పరమేశ్వరుని సంతతము స్మరింపుచు, సర్వము అతనిదేనని తెలుసుకొని, ఆతని పూజకై శాస్త్ర నియత కర్తవ్య కర్మలను ఆచరించుచునే శత సంవత్సరములు జీవించుటకు నిచ్చగించుము. ఈ ప్రకారంగా మీ పూర్తి జీవితమును పరమేశ్వరుని కొరకు సమర్పింపుడు. శాసోక్తమైన స్వకర్మను ఆచరించుచు జీవనమును నిర్వహించుట కేవలము పరమేశ్వరుని పూజించుటకేనని, తనకొరకు గాదని, భోగముల ననుభవించుట కొరకు ఎంత మాత్రమూ కాదని తెలియవలెను. ఈ విధమైన వలన ఆ కర్మలు నిన్ను బంధనములో పడవేయజాలవు. కర్మ . నాచరించుచు కర్మతో బంధింపబడకుండుటకుగాను ఇదొక్కటియే చక్కని మార్గము. ఇది గాకుండా కర్మ బంధనము నుండి ముక్తుని జేయుటకు వేరొక మార్గము లేనేలేదు. (గీత.2-50, 51; 5-10) (2) ఆచరణ


సంబంధము: ఈ విధంగా కర్మఫలరూపమగు జన్మబంధము నుండి విముక్తమగు నిశ్చిత మార్గమును నిర్దేశించి, ప్రస్తుతము ఇందుకు విరుద్ధమైన మార్గము ననుసరించెడు మానవుల గతిని గూర్చి వర్ణించుచున్నారు -


కామెంట్‌లు లేవు: