15, జులై 2022, శుక్రవారం

 🌹రామాయణానుభవం_ 100


సుగ్రీవుడు వానర సైన్యం కు  *తూర్పు దిశ* భౌగోళిక పరిస్థితులు చెబుతున్నాడు .....


శాల్మలీపర్వత శిఖరాలపై "మందేహులు" అనే రాక్షసులు ఉంటారు. వారు సూర్యోదయ, మధ్యాహ్న, సూర్యాస్తమయ సమయాలలో సూర్యుని ప్రయాణాన్ని అడ్డగిస్తారు. సంధ్యావందన తత్పరులైన భూసురులు మంత్రాలతో సూర్యునికి అర్ఘ్య జలాలను వదులుతారు. ఆ జలాలు వజ్ర బలాన్ని కలిగి మందేహ రాక్షసులను దూరం పడగొట్టుతాయి. "తా ఆప: వజ్ర భూత్వా! తాన్ అసురాన్ అపసర్పయంతి”.


ఈ ప్రాంతాన్ని “ఇక్షు” సముద్ర ప్రాంతమంటారు. ఇక్కడ సముద్ర జలాలు చెరుకు రసమువలె ఉంటాయి.


ఆ తరువాత నేయి రంగులో సముద్ర జలాలు (సర్పి సముద్రం), పెరుగువలె సముద్ర జలాలు (దధి, సముద్రము) ఉంటాయి. ఇవి దాటిన తరువాత కుశ, క్రౌంచ ద్వీపాలు ఉంటాయి.


ఆ తరువాత “పాలసముద్రము" వస్తుంది. సముద్ర జలాలు అందులో పాలవలె, ముత్యాల హారాలవలె ఉంటాయి. దాని మధ్యలో "ఋషభము” అనే పర్వతము ఉంటుంది. అందులో "శ్వేతవృక్షాలు", "రజత పద్మాలు" ఉంటాయి. వాటి మధ్య భాగము బంగారు రంగుతో ఉంటుంది.


 ఈ ప్రాంతంలో రాజ హంసలు విహరిస్తుంటాయి. ఈ ప్రాంతములో దేవతలు, యక్ష, కిన్నరులు అప్సరసలతో విహరిస్తు ఉంటారు.


ఆ తరువాత “మంచి నీటి సముద్రము” వస్తుంది. అది "జౌర్వము” అనే అగ్నితో నిండి ఉంటుంది. అది “బడబ” అనే అడగుఱ్ఱము ముఖం నుండి వెలువడుతుంది. దానితో సమీప చరాచరాలు నశించిపోతాయి.


ఈ సముద్రానికి ఉత్తర దిశలో పదమూడు యోజనాల దూరంలో "జాతరూప శైలము" అనే బంగారు కొండ ఉంటుంది. ఆ పర్వతాగ్రంపై సహస్ర శిరములుగల అనంతుడు అనే సర్పరాజు చంద్రకాంతితో, నల్లని వస్త్రంతో, సర్వభూత నమస్కృతుడై కూచొని ఉంటాడు. 


ఆమహాత్ముని ధ్వజము మూడు ముఖములు గల తాలవృక్షము. ఆ తరువాత ఉదయాచలము మహోన్నతమై సువర్ణ వర్ణమై వంద యోజనాల విస్తీర్ణంతో దర్శనమిస్తుంది. దానిపై యోజన వైశాల్యంతో దశ యోజన ఔన్నత్యము కలిగిన "సౌమనసము" అనే పర్వత శిఖరము ఉంటుంది.


 త్రివిక్రముడు మేరు శిఖరముపై ఒక పాదాన్ని, ఈ "సౌమనస" పర్వత శిఖరముపై మరొక పాదాన్ని ఉంచి నిలిచాడట.


ఈ పర్వతము ప్రక్కలో "సుదర్శన ద్వీపము" ఉంటుంది. ఇక్కడ ఉదయ పర్వత కాంతులతో అన్ని వస్తువులు చక్కగా ప్రకాశిస్తాయి. ఈ "ద్వీపము సూర్యోదయ ద్వారం"గా ఉంటుంది. ఇదే తూర్పు దిశ చివర. దీనిని దాటి ఎవ్వరు వెళ్లలేరు......

**


*దక్షిణ దిశ.*


ఈ దిశకు సుప్రసిద్ధ వీర వానరులను అంగదుని నాయకత్వంలో పంపాడు. ఆయనకు సహాయంగా అగ్నిపుత్రుడైన నీలుడు, వాయుసుతుడైన హనుమ బ్రహ్మనందనుడైన జాంబవంతుడు వెళ్లారు. 


సుహోత్ర, శరారి, శరగుల్మ, గజ, గవాక్ష, గవయ, సుషేణ, వృషభ, మైంద, ద్వివిధ, విజయ, గంధ మాదనులు కూడ అంగదుని అనుసరించారు. ఆంగదునికి సుగ్రీవుడు దక్షిణ దిశను వివరిస్తున్నాడు..


"అంగద కుమారా! వింధ్యా చల దక్షిణ ప్రాంతమే దక్షిణ దేశము. వింధ్యాచలము సహస్ర శిఖర సమేతము, దాని క్రింద నర్మదానది పాములతో నిండి ప్రవహిస్తుంది. అది దాటాక కృష్ణ, గోదావరి అనే పెద్ద నదులు మేఖల, ఉత్కల అనే నదులు ప్రవహిస్తాయి. ఇవి వింధ్యకు నైరుతి దిశలో వస్తాయి.


వింధ్యకు వాయువ్యంలో విదర్భ, ఋషిక మహిష, కళింగ, కౌశిక దేశాలు ఉంటాయి.


ఇక్కడి నుండి దండకారణ్యము ప్రారంభమవుతుంది. గోదావరి ప్రవాహ ప్రాంతమిది. 


అదే విధముగా కావేరీ, తామ్ర పర్జీనదులు ప్రవహిస్తాయి. ఇవన్నీ “అయోముఖము" అనే పేరుగల సహ్య పర్వతము నుండి బయలు దేరుతాయి.


ఈ ప్రాంతంలో చందనవనము విశేషంగా ఉంటుంది. ఇక్కడనే మలయాచలము ఉంటుంది. అక్కడ సూర్య ప్రభా భాసురుడు అయిన ఆగస్త్య మహర్షి ఉంటాడు. ఆయన ఆజ్ఞతో తామ్ర పర్ణనదిని తరించాలి. తామ్ర పర్ణ నదీ ప్రాంతంలో అనేక ద్వీపాలు ఉంటాయి.


ఆ తర్వాత పాండ్య రాజుల రాజధాని నగరము ఉంటుంది. దాని ద్వారాలు బంగారు, ముత్యాలతో అలంకరింపబడి ఉంటాయి. దీని తరువాత సముద్రము వస్తుంది. (హిందూ మహాసముద్రము) ఆ సముద్రము మధ్యలో ఆగస్త్య మహర్షి మహేంద్రునికి విడిదిగా మహేంద్ర పర్వతాన్ని నిలిపాడు. సుర, ముని, యక్ష, సిద్ధ, చారణులకు, అప్సరలకు అది విహార భూమి.


ఆ మహా సముద్రము శతయోజన విస్తీర్ణమైనది. ఆ సముద్రము మధ్యలో ఛాయా గ్రాహకమైన అంగారక రాక్షసి ఉంటుంది.


ఆ సముద్ర తీరంలోనే శత్రు విరావణుడైన రావణుని రాజధాని అయిన లంకానగర ద్వీపము శతయోజన విస్తీర్ణంగా ఉంటుంది. అక్కడికి సామాన్య నర, వానరులు వెళ్లలేరు. అనేక కోట్ల రాక్షస పరివేష్టితమై ఉంటుంది. ఆ నగరము సువర్ణమయ ద్వారాలతో, గోపురాలతో విరాజిల్లుతూ ఉంటుంది......

కామెంట్‌లు లేవు: