15, జులై 2022, శుక్రవారం

 *_నవీన్ పట్నాయక్ కంటతడి... 12 దేశాల సొంతజనం ఎదుట అనూహ్య ఉద్వేగం... _* 


నవీన్ పట్నాయక్… పెళ్లాంపిల్లలు, కుటుంబం ఎవరూ లేరు… పైరవీలు, పెత్తనాల భయంతో తన బంధుగణాన్ని కూడా దగ్గరకు రానివ్వడు… ఎప్పుడూ తన మొహంలో ఎమోషన్స్ కనిపించవు… ఉన్నతాధికారులు, తన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కూడా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు… ఎవరూ తన దగ్గర సర్కిల్‌లోకి వెళ్లరు… తను కూడా పని ముగిసిందంటే చాలు, ల్యాప్ టాప్ తీసుకుని, ఓ సిగరెట్ పాకెట్‌తో బెడ్ రూంలోకి వెళ్లిపోతాడు… అత్యవసరమైతే తప్ప ఇక ఎవరూ తనను డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు…


ఎంత కఠిన హృదయుడో కదా అనిపిస్తోందా..? ఏ బంధాలూ లేకుండా, సంపాదన కక్కుర్తి లేకుండా వ్యవహరిస్తున్నాడు కాబట్టే పాతికేళ్లుగా తనను ఎవరూ ఆ సీఎం కుర్చీ మీద నుంచి ఇంచ్ కూడా కదిలించలేకపోతున్నారేమో… ఐనా రాతి లోపల కూడా కొన్నిసార్లు జల ఉంటుంది… నవీన్ కూడా అంతే… నిర్వికారంగా కనిపించే ఆయన పన్నెండు దేశాలకు చెందిన ప్రవాస ఒడిస్సీల ఎదుట వేదిక మీద కన్నీళ్లు పెట్టుకున్నాడు… అసలు అనేక ఎత్తుపల్లాల నడుమ కూడా ఏ ఎమోషన్ చూపించని ఆయన కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసి ఒడిశా నుంచి వెళ్లిన ఉన్నతాధికారుల బృందం ప్లస్ వేలాది మంది ప్రవాస ఒడిస్సీలు విస్తుపోయారు… విషయం ఏమిటంటే..?


కిసన్ శేషదేవ్… సంబల్‌పూర్ జిల్లాకు చెందిన ఓ గిరిజన కుటుంబం… చిన్నప్పుడు ఏడాది వయస్సున్నప్పుడే తల్లిని కోల్పోయాడు… 2006లో తండ్రి తీవ్ర అనారోగ్యం పాలైతే కిసన్ కూలీ పని చేయాల్సి వచ్చింది… 2012లో తండ్రిని కూడా కోల్పోయాడు… అప్పటికి తనకు పద్దెనిమిదేళ్లు… రెండేళ్ల క్రితం అక్కను కూడా పొగొట్టుకున్నాడు… ప్రస్తుతం అనాథ…


చిన్నప్పటి నుంచీ మెరిట్ స్టూడెంట్… ప్రతి పరీక్షలోనూ తనే టాప్… 2005లో ఉత్తమ విద్యార్థి అవార్డు తీసుకుని నవోదయ ఎంట్రన్స్‌లో టాపర్‌గా నిలిచి, ప్లస్‌టూ వరకు అక్కడే చదివాడు… తరువాత 2012లో National Entrance Screening Test (NEST) రాశాడు… 17వ ర్యాంకు… కానీ ఆ సంవత్సరమే తండ్రి చనిపోయాడు… 2013లో మళ్లీ రాశాడు, ఈసారి 15వ ర్యాంకు, NISER లో అయిదేళ్ల ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ కోర్సులో చేరాడు…


2018… ఒడిశా నాలెడ్జ్ హబ్‌లో ఓ పెద్ద మీటింగ్… విద్యావేత్తలు, మంత్రులు, ఉన్నతాధికారులు, టెక్నిషియన్స్ ఉన్న ఆ మీటింగును ఉద్దేశించి ప్రసంగించాలని నవీన్ పట్నాయక్ ఈ కిసన్‌ను ఆహ్వానించాడు… అప్పట్లో స్లిప్పర్లు, మాసిపోయిన బట్టలు, చేతిలో ఓ డొక్కు నోకియా ఫోన్‌తో ఉన్న కిసన్ భుజం తట్టి ఒక ఐఫోన్ కానుకగా ఇచ్చాడు… తరువాత కిసన్ జర్మనీలోని Gottingen లోని జార్జ్-అగస్ట్ యూనివర్శిటీలో చేరాడు… పీహెచ్‌డీ చేశాడు… ఇప్పుడు తను అక్కడే కెమికల్ సైంటిస్టు…


గత నెల చివరివారంలో పట్నాయక్ రోమ్ వెళ్లాడు… దాదాపు 12 యూరప్ దేశాలకు చెందిన ప్రవాస ఒడిస్సీలను పిలిచారు ఓ మీటింగుకు… శేషదేవ్ కూడా జర్మనీ నుంచి రోమ్ వెళ్లాడు… అందరి ఎదుట శేషదేవ్‌కు కాసేపు మాట్లాడే చాన్స్ దొరికింది… తన చేతిలోని ఐఫోన్ పైకి లేపి, ఊపుతూ… ఇదేమిటో తెలుసా అంటూ… ముఖ్యమంత్రి తనకు ఏయే సందర్భాల్లో ఎలా అండగా నిలిచాడో ఎమోషన్‌తో చెబుతూ పోయాడు…


*‘‘నాకు సార్ చెప్పింది ఒకటే… పది మందికీ ఉపయోగపడు అన్నాడు… పదే పదే అదే గుర్తొస్తుంది… మా ఊళ్లో 170 మంది పిల్లలకు కోచింగ్ సెంటర్ పెట్టించాను… 30 లక్షలతో ఇల్లు కట్టాను… నథింగ్ నుంచి నన్ను ఎవిరీ థింగ్ స్టేజీకి తీసుకొచ్చాడు సీఎం… తిరిగి వచ్చేస్తాను, ఓ పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీ పెడతాను ఒడిశాలో… నాకు ఎవరూ లేరు సార్, అందరినీ కోల్పోయాను, అయితే ఏమిటి సార్, మీరున్నారు, మీరే నా తండ్రి…’’ శేషదేవ్ ముగించాడు… అదుగో అప్పుడు ఏ ఫ్యామిలీ బంధాలు లేని ఆ పట్నాయక్‌ కంటి నుంచి బొటబొటా కన్నీళ్లు రాలాయి… ఆ ఎమోషన్ పేరు ఆనందమే…*


ఇందులో ఏముంది అనకండి… మనసంతా పాజిటివిటీని నింపే ఇలాంటి వార్తలు చదవాలి… ఖచ్చితంగా చదవాలి… ఓ గిరిజన విద్యార్థి కష్టనష్టాల జీవనప్రయాణం ఇది… రాజకీయ నాయకులంటేనే హార్డ్ కోర్ అండ్ నొటోరియస్ అనే భావన బలంగా ఉన్న ఈ రోజుల్లో పట్నాయక్‌ వంటి నేతలూ ఉంటారని తెలియాలి… ప్రతి కఠినమైన గుండెలో కూడా తడి ఉంటుందనీ, అది కొన్నిసార్లు కంటికట్టలు తెంచుకుని బయటికి దూకుతాయని కూడా తెలియాలి…!!


సేకరణ

కామెంట్‌లు లేవు: