15, జులై 2022, శుక్రవారం

కపిలగోవు

 ప్ర: కపిలగోవు శ్రేష్ఠమైనది అంటారు. 'కపిల' అంటే ఏమిటి? ఆ లక్షణాలను ఎలా గుర్తించాలి? ఒళ్ళంతా నల్లని రంగు ఉంటే కపిల గోవు అని గుర్తించాలా?


జ: ఆవులు ఏ రంగులో ఏ రూపులోనున్నా శ్రేష్ఠమైనవే. పూజ్యములే. కపిల శబ్దానికి - నలుపు అని ప్రధానార్థం. నల్లని గోవుల్ని కపిల గోవులు అంటారు. అవి మరింత శ్రేష్ఠములని శాస్త్రోక్తి.


గోవు అమృతశక్తితో దివ్యలోకాలలో ఉద్భవించినది. తొలి గోమాత సురభి. ఆమె అంశలే విశ్వములో గోవులుగా వ్యాపించాయి. ఒకసారి కొన్ని గోవులు హిమగిరి పరిసరాలలో సంచరిస్తుండగా, ఒక గోవు పాలను లేగతాగుతున్నది. ఆ సమయంలో పొదుగు నుండి స్రవిస్తున్న పాలనురగ గాలికి చింది, సమీపంలో తపస్సు చేసు కుంటున్న పరమేశ్వరునిపై పడింది. దానితో కనులు తెరచిన ధూర్జటి ఫాలనేత్రం నుండి ఎగసిన సెగ తగిలి అక్కడి గోవులు నలుపెక్కాయి.


అవి శివుని శరణు వేడి ప్రార్థించాయి. శివదృష్టి శక్తిని పొందడం చేత ఆ గోవులకు ప్రత్యేక శ్రేష్ఠత లభించింది. శివుడు వాటికి ప్రత్యేక పూజ్యతను వరంగా అందించాడు. కపిలగోవు శరీరమంతా నలుపురంగుతో (ఎరుపు కూడా) ఉండనవసరం లేదు. చెవులు, కొమ్ములు, కన్నులు, గిట్టలు, నాసికా పుటములు, గొంతులు, ముష్కములు కపిల వర్ణంతో ఉన్నా కపిలత్వ గుణానికి చాలు. ముఖ్యంగా మూపురం, గంగడోలు ఉన్న భారతీయ గోసంతతి మన శాస్త్రాలలో వర్ణించిన ఉత్తమ గోవులుగా నిర్ణయింపబడుతున్నాయి.

కామెంట్‌లు లేవు: