15, జులై 2022, శుక్రవారం

 🌹రామాయణానుభవం_ 99


సుగ్రీవుడు భయవిముక్తుడై లక్ష్మణునితో కలసి రామసన్నిధానమునకు వెళ్ళాడు. అతని వెంట భీమకాయులు, అరి భయంకర విక్రములు అయిన అనేక కోట్ల వానరులు శ్రీరాముని సన్నిధికి చేరుకొన్నారు.


సుగ్రీవుడు శ్రీరామచంద్రుని చూచి "మహానుభావా! కొంత ఆలస్యం చేసినీ నిగ్రహానికి కారణమయ్యాను. నన్ను మన్నించు" మని ఆయన పాదములపై పరివార సమేతంగా వాలాడు.


శ్రీరాముడు ఆయనను లేవనెత్తి, "మిత్రమా! వరుసగా ఉదయ, మధ్యాహ్న, రాత్రులలో కాలాన్ని అనుసరించి, ధర్మార్థ, కామాచరణ చేసినవాడు నిజమైన మహారాజు. ఆయన సతతముశ్రేయస్సును పొందుతాడు. 


ధర్మార్ధములను వదలి కేవల కామాసక్తుడైనవాడు వృక్షాగ్రముపై నిద్రించి ఒడలు మరచి క్రిందపడిన వానివలె నశిస్తాడు. 

*హిత్వా ధర్మం తథార్థం చ కామం యస్తు నిషేవతే*

*స వృక్షాగ్రే యథా సుప్తః పతితః ప్రతిబుధ్యతే*


శత్రువులను సకాలంలో సంహరించి, మిత్రులను రక్షించుకొన్నవాడు, ధర్మాన్ని పాలించి ధర్మార్థ కామాలనే త్రివర్గ ఫలాలను పొందుతాడు.


సుగ్రీవా! శత్రువుపై దండెత్తే సమయము ఆసన్నమైంది.


సచివులతో ఆ విషయంలో సమాలోచన కావించుము" అని తెలిపాడు.


సుగ్రీవుడు తన వెంట ఉన్న పరాక్రమ సంపన్నులు, మహాకాయులయిన వానర మహావీరులందరు శ్రీరాముని అనుసరించి, రావణుని చంపి, సీతను కొనితెస్తారని తెలిపాడు.


శ్రీరాముడు ఆ బలమైన వానరానీకాన్ని చూచి సంతుష్టుడై, సుగ్రీవుని కౌగలించుకొని, "వానర రాజా! మా సీత జీవించి ఉందో లేదో? ఒకవేళ జీవించి ఉంటే ఆమెను రావణుడు ఎక్కడ ఉంచాడో ముందుగా తెలుసుకోవాలి. ఆ తరువాత మనము సమరానికి సమాయత్తము కావచ్చు. 


ముందుగా ఆమె ఉన్న స్థలాన్ని గురించి సమాచారాన్ని సంపాదించాలి. ఆ విషయంలో మా అన్న తమ్ములిద్దరికి తగిన పరిజ్ఞానం లేదు. దానికొరకు నీ అనుచరగణాన్ని ఎలా నియోగించుకోవాలో తెలిసినవాడవు నీవు. నీవు నామిత్రుడవు, బుద్ధి మంతుడవు, పరాక్రమవంతుడవు. అందువలన నీవే నీ వారికి తగిన ఆదేశాలివ్వుమని" కోరాడు..


**


శ్రీరాముని ఆదేశాన్ని పురస్కరించుకొని సుగ్రీవుడు ముఖ్యమైన వానర వీరులను నాలుగు దిక్కులలో పంపడానికి నిశ్చయించుకొన్నాడు.


 *తూర్పు దిశ*

 ముందు “వినతుడ”నే సేనానాయకుని, అతని అనుచరగణంతో తూర్పు దిశకు పంపడానికి నియోగించాడు. "వినతా! నీవు సమయానుకూలంగా కార్యాకార్య వివేకం కలవాడవు. సూర్య, చంద్రాంశలతో జన్మించిన లక్షమంది వానరులను తీసికొని తూర్పు వైపు వెళ్లు. తూర్పు దిశలో భాగీరధి, సరయూ, సింధూనదులు, శోణానది, మహీ, కాలమహీ నదులు ప్రవహిస్తాయి.


బ్రహ్మావర్తము, మాల, మాళవ, విదేహ, కాశీ, కోసల, మగధ, మహాగ్రామ పుండ్ర, వంగ దేశాలు ఉంటాయి. ముఖ్యంగా వింధ్య హిమాలయాలమధ్య తూర్పు దిశలో ఉన్న ప్రాంతమంతా నీ అన్వేషణకు తగిన స్థలము. కొన్ని నగరాలు, పర్వతాలు, సముద్రములోపల ఉంటాయి. వాటిలో కూడ సీతను అన్వేషించాలి. మంధర పర్వతము యొక్క అగ్రభాగంలో వెతుకాలి. అక్కడ చెవులు లేనివారు, పెదవులపై చెవులు కలవారు, అయోముఖులు, ఏకపాదులు, మనుష్యులను తినేవారు, బంగారు రంగుగల వారు, పచ్చి చేపలను తినే కిరాతులు, వ్యాఘ్రముఖులుంటారు.


ఈ ప్రాంతం దాటితే “యవద్వీపం” వస్తుంది. అది బంగారు రంగుతో ఉంటుంది. అందువలన దానిని “సువర్ణద్వీపం" అంటారు. అందులో రత్నాలు రాశులు రాశులుగా ఉంటాయి.


అది దాటితే “శిఖర" పర్వతము ఉంటుంది దాని శిఖరాలు ఆకాశాన్ని అంటుతాయి. ఆ పర్వతము దేవ దానవులకు విహారస్థలంగా ఉంటుంది. ఆ పర్వత గుహలలో సెలయేరుల ప్రక్క సీతను దాచి ఉంచవచ్చు.


ఆ పర్వతం దాటితే శోణానది వస్తుంది. ఆ నదీ జలము రక్తమువలె ఎఱ్ఱగా ఉంటుంది. అది దాటితే సిద్ధ చారణుల విహార స్థలము ఉంటుంది. అది దాటితే మహోత్తుంగ తరంగాలతో సముద్రము వస్తుంది. (బహుశః ఆ సముద్రము ఇప్పటి బంగాళా ఖాతము అయి ఉంటుంది).


ఆ సముద్రంలోపల అతికాయులైన రాక్షసులు ఉంటారు. వారు సముద్రముపై భాగంలో విహరించేవారిని వారి నీడను బట్టిలాగే ఛాయాగ్రాహులు. ఆ ప్రాంతం దాటాక సముద్రము అరుణ వర్ణంతో భయంకరంగా ఉంటుంది. అక్కడి ద్వీపాన్ని “శాల్మలీ” ద్వీపం అంటారు. శాల్మలీ వృక్షం ఉన్నందువలన ఆ ద్వీపానికి ఆ పేరు ఏర్పడింది. అక్కడే "గరుత్మంతుని నివాసము" ఉంది.......

కామెంట్‌లు లేవు: