🌹రామాయణానుభవం_ 91
తార దర్శించిన రామచంద్రుని పరత్వము.....
*త్వమప్రమేయశ్చ, దురాసదశ్చ, జితేంద్రియశ్చోత్తమ ధార్మికశ్చ అక్షయ్య కీర్తి శ్చ, విచణశ్చ క్షితిక్షమావాన్, క్షతజోపమాక్షః।*
*త్వమప్రమేయశ్చ*
నీవు ఊహింప శకయము కానివాడవు.
రామచంద్రా! నీవు సాటిలేని వాడివి. నీ తండ్రిగారి నిర్దేశంవలన నీవు అడవికి బయలు దేరావు. పితృవాక్య పాలనాధర్మాన్ని నిరుపమానంగా పాటించావు.
క్రూరారణ్యములో విరాధ, ఖర, కబంధాది ఘోర రాక్షసులను అవలీలగా హతమార్చిన విక్రముడవు.
నీ కమల పత్రాక్షములు నిన్ను కమలానాథునిగా స్ఫురింపజేస్తున్నాయి.
నీ పరదుఃఖ దుఃఖిత్వము నిన్ను సకల కల్యాణ గుణాలతో సాటిలేని వాడివని నిరూపిస్తున్నది.
నీవు విల్లు అమ్ములను ధరించి నా ముందు నిలిచావు. అయితే శంఖచక్రాది సర్వాయుధోపేతుడవని నిన్ను గుర్తించగలుగుతున్నాను..
నీవు నా కనులముందే నిలిచి ఉన్నావు. కాని నీవు ఇంత వాడివని గుర్తించడానికి వీలు లేకుండా ఉంది.
“ *క ఇత్థా వేద* ” ఆయన ఇంత వాడని, పరమాత్మను వేదాలు కూడ తెలసికోజాలవు. “ *సోఽంగవేద యదివానవేద"* స్వయంగా ఆయన కూడ తన మహిమను కొంత గుర్తించగల్గుతాడో లేదో” అని భగవద్వైభవాన్ని వేదాలు వివరిస్తున్నాయి. నీ స్వభావము కూడ అటువంటిదేనని నామనస్సుకు తోస్తున్నది.
నీవు ఒంటరిగా అసహాయునివలె నిలుచున్నావు. కాని అనేక ప్రబల శత్రువులు నీపై మూకుమ్మడిగా దండెత్తి వచ్చినా నీవు అకంప్యుడవు.
నీ ప్రభావము వాఙ్మనసాతీతము.
*దురా సదశ్చ*
ఎదురింప శక్యము కాని వాడవు.
నీ ప్రభావము వాక్కులకు, మనస్సుకు అందనిది కావచ్చు. అయినా నీవు కట్టెదుట నిలిచి ఉన్నావు కదా! బాహ్యేంద్రియాలతో నిన్ను అనుభవించవచ్చుకదా! అంటే అదీ అసాధ్యమే. మనస్సుకందిన విషయాన్నే కదా బాహ్యేంద్రియాలతో అనుభవింపగల్గేది.
“షదిల్” (“సద్”) అనే ధాతువుకు 1. (విశరణము) శిథిలము,
2. గతి
3. అవసాదము (దుఃఖము) అనే మూడు అర్థాలు ఉన్నాయి.
శిథిలము:- విశరణము:- స్థూల వస్తువునైతే సూక్ష్మంగా విభజించి శిథిలము చేయవచ్చు కాని నీవు "అణోరణీయాన్" అణువులకంటే అణువు అన్నట్లు "సుసూక్ష్మమైన” వాడివి. నిన్ను శిథిలము చేయడము అసాధ్యము కదా!
“గతి” అంటే “చలనము” అని అర్ధము. నిన్ను ఒక చోట లేకుండా మరొక చోటికి మారుద్దామంటే అది కూడ కుదరదు. ఎందుకంటే నీవు విభుడవు. సర్వ వ్యాపివి. అంతట వ్యాపించి ఉన్నవాడివి ఎక్కడైనా ఒకచోట లేకుండా చేయడం కుదరదుకదా!
నీకు అవసాదమును (నిర్మూలనమును) కలుగచేద్దామంటే నీవు లేకుండా పోయే వాడివి కాదు. నీవు నిత్యుడవు.
వాలి వధకు కోపించిన వానరులందరు కలిసి నిన్ను దుఃఖ పరచాలనుకొన్నా అది సాధ్యముకాదు.
నీవు ఆశ్రితులందరికి అత్యంత సులభుడవు. అనాశ్రితులందరికి అత్యంత దుర్లభుడవు
" *మహాజనో యేన గతః స పంధా”* అన్నట్లు భక్తి మార్గంలో పయనించే వారందరికి పట్టుగొమ్మ
“ *తర్కోప్రతిష్ఠః”* - హేతువాదంతో నిన్ను లేవని నిరూపిద్దామంటే “ధర్మస్య తత్వం నిహితం గుహాయాం” వేదగుహలో స్థిరంగా నిహితమై ఉన్న నిన్ను లేడని నిరూపించడం ఎవ్వరి తరముకాదు.
ఇక నిన్ను సాధించడమెలా? బాధించడమెలా? అందువలననే నీవు "నిత్యం, విభుం, సర్వగతం, సుసూక్ష్మం” అయినవాడివి. " *దురాసదుడవు”.*
తార దర్శించిన శ్రీరామ పరత్వము మరికొంత ......
**
*త్వమప్రమేయశ్చ, దురాసదశ్చ,* *జితేంద్రియశ్చోత్తమ ధార్మికశ్చ*। *అక్షయ్య కీర్తి శ్చ, విచక్షణశ్చ* *క్షితిక్షమావాన్, క్షతజోపమాక్షః।*
*జితేంద్రియశ్చ....* జయించబడిన ఇంద్రియములు కలవాడు.
నీవు ఇంద్రియములను జయించినవాడివి. నీవు వాలి రావణులవలె ఇంద్రియములకు లోబడి పరదారలను ఆశించే వాడివా? కాదు.
మహేంద్రుడంతటి వాడు అహల్యా జారుడయ్యాడు. ప్రజాపతి అయిన చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా ఆత్మ తనయ అయిన సరస్వతికి వశుడయ్యాడు. తారకాధిపతి అయిన చంద్రుడు గురుపత్ని అయిన తారవిషయంలో చోరుడయ్యాడు. విశ్వామిత్ర మహాముని మేనక విషయంలో చపలుడయ్యాడు.
కాని నీవు వాలిని చంపి కూడ రుమను సుగ్రీవునికి అప్పగించావు. సహజంగా సౌందర్య వంతులయిన స్త్రీ పురుషులు పరస్పరము ఆకర్షణకు లోబడుతారు. అప్సరసలను మించిన అందముగల నేను, భార్యా విహీనుడవైన నీకు ఇంత దగ్గరలో ఉన్నా నన్ను కన్నెత్తి కూడ చూడడంలేదు. “నరామః పరదారాన్వై చక్షుర్భ్యామపి పశ్యతి" రాముడు పరస్త్రీలను కన్నెత్తి కూడ చూడడు" అనే మాట సత్యమైనది.
ధర్మబద్ధంగా మాత్రమే అర్థకామాలను అనుభవిస్తావు. వాలిని నిరసించి ఆయన రాజ్యాన్ని ఆయన తమ్ముడైన సుగ్రీవునికే అప్పగించావు. నీవు జితేంద్రియడవు ప్రభు.
రాముడు జితేంద్రియుడు, ఇంద్రియములను జయించినవాడు..
"పశ్యత్యచక్షుః, సశృణోత్యకర్ణః, అపాణిపాదో జవనోగృహీతా" పరమాత్మకు ఈ ప్రపంచాన్నంతటిని చూడడానికి కనులు అక్కరలేదు. సర్వ శబ్దాలను వినడానికి కర్ణాలు అవసరంలేదు. అందరికంటే ఆయన వేగంగా కదులుతాడు. అయితే అలా కదలడానికి ఆయనకు కాళ్లు అక్కరలేదు. సర్వాన్ని గ్రహిస్తాడు (పట్టుకొంటాడు). కాని అందుకు హస్తాలు అవసరం లేదు. ఆయన ఇంద్రియాధీనుడు కాదు. "సర్వేంద్రియైర్వినా సర్వం సర్వత్ర పశ్యతి". ఏ ఇంద్రియావసరము లేకుండానే ఆయన అన్నిటిని అధీనంలో
ఉంచుకొంటాడు.
*ఉత్తమ ధార్మికశ్చ*
ఉత్తమమైన ధర్మము కలవాడు.
రాముడు జితేంద్రియుడు కావచ్చు. కాని వైర కారణమేమి లేకుండానే వాలిని వధించాడే? ఆయన ధార్మికుడెలా అవుతాడు?
సాధారణంగా వైర కారణం లేకుండా ఏ ప్రాణిని సంహరించినా అది హింసే. అది అధర్మమే.
కాని పరులకు ఉపకారం చేయడంలో ఏ ప్రాణినైనా హింసిస్తే అది అధర్మము కాదు. "తనను కాటువేయలేదు కదా" అని తన ఇంట్లో ప్రవేశించిన నాగు బామును ఎవ్వరైనా వదలివేస్తారా? విషప్రాణిని చంపడం హింస అవుతుందా? అధర్మమవుతుందా?
"ఆనృంశంస్యం పరో ధర్మః" అన్నట్లు భూతదయ సామాన్య ధర్మము కావచ్చు. కాని
ఆశ్రిత రక్షణము అంతకు మించిన ధర్మము. ఉత్తమ ధర్మము.
1.తన స్వార్థం కొరకు ధర్మాన్ని ఆచరిస్తే అది స్వార్ధ ధర్మము. అది అథమ ధర్మము. తన కొరకు, పరులకొరకు కూడ కలిపి ధర్మాన్ని ఆచరిస్తే అది మధ్యమ ధర్మము. తన కొరకు ఎంతమాత్రము కాకుండా పరులకొరకే ధర్మాచరణ కావిస్తే అది ఉత్తమ ధర్మము. చెట్టు చాటు నుండి అధర్మంగా వాలిని హత్య కావించాడనే నిందను భరించికూడ, సుగ్రీవుని కొరకు వాలిని వధించడం రాముని ఉత్తమోత్తమ ధర్మము.
(2) వర్ణాశ్రమ ధర్మాలను పాటించడం సామాన్య ధర్మము. చతుర్విధ భక్తులకు రక్షణ కల్పించడం అంతకంటే మించిన (ఉత్) ధర్మము. జ్ఞానులకు ఆశ్రితులకు సర్వదా సర్వథా శరణునివ్వడం దానిని మించిన "ఉత్తర" ధర్మము. ఆచార్యోపాయంతో అమ్మగారి పురుషకారంతో భక్తులకు వశం కావడం ఉత్తమ ధర్మము.
(3) వధను వైర కారణంగా చేయడం సామాన్య ధర్మము. వధను పాప పరిహారార్థము చేయడం ఉత్తమ ధర్మము. వాలి చేసిన సోదర భార్యాపహరణ పాపాన్నుండి అతనిని విముక్తుని చేయడం కొరకే అతనిని వధించానని వాలికి రాముడు సమాధానమిచ్చాడు.
"రాజభిర్ధృతదండాస్తు। నిర్మలాః స్వర్గ మాయాంతి”
రాజుల ద్వారా దండింపబడ్డవారు, తమ పాపాలనుండి నిర్మలులై స్వర్గానికి వెళ్లుతారని రాజనీతిని వాలికి రామచంద్రుడు వివరించాడు.
ఇక శాకామృగాలను చండపంలో చాటునుండి చంపినా తప్పు లేదని వేట ధర్మాన్ని శ్రీరాముడు వివరించాడు.
తార దర్శించిన శ్రీరామ పరత్వము మరికొంత .....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి