*నూటపదహార్లు.*
శుభకార్యాలలో చదివింపులకిగాను నూట పదార్లూ-వెయ్యిన్నూటపదహార్లను ఇస్తుంటారుగదా! ఈ నూటపదారుకి ఏమైనా విశిష్ట ఉందంటారా? ప్రశ్నించారు హరిబాబుగారు. అదిగో అందుకే ఈ టపా, అవధరించండి.
భారతీయ సంస్కృతి అంతా ఎప్పుడూ పూర్ణాంకం గురించే చెబుతుంది, శతం,సహస్రం,శత సహస్రం ఇలా, దశాంశంలో. మరీ నూటపాదహారెక్కడనుంచి వచ్చి చేరిందన్నదే ఆలోచన, అదీ తెనుగునాటే, ఈ అలవాటూన్నూ.
తెనుగునాడు మూడు భాగాలుగా విడి ఉండేది పాలనలో. ప్రజలు మాత్రం ఒక చోటినుంచి మరోచోటికి రాకపోకలూ, వలసలూ బాగానే ఉండేవి. ఆ ప్రాంతాలకి పేర్లూ ఉన్నాయి., కోస్తా, రాయలసీమ ( దీన్నే సీడెడ్ జిల్లాలు అంటే వదలిపెట్టబడిన జిల్లాలు, అవి కడప, కర్నూలు,బళ్ళారి, అనంతపురం. తరవాత కాలంలో బళ్ళారిజిల్లా కర్నాటకలో జేరిపోయింది) ఇక మూడవది నైజాం రాష్ట్రం.
కోస్తా ప్రాంతం నిజంగానే కోస్తా! సముద్రపు ఒడ్డు. బ్రిటిష్ వారి ఏలుబడిలో ఉండేది. స్వదేశీ సంస్థానాలుండేవి. ఉర్లాం, బొబ్బిలి,విజయనగరం, పిఠాపురం, పెద్దాపురం, నూజివీడు, వేంకటగిరి ప్రముఖమైన సంస్థానాలు. ఇక నైజాంలో కూడా సంస్థానాలున్నా గద్వాలుకున్నంత పేరు మిగిలినవాటికి లేదు. ఈ సంస్థానాధీశులంతా కవులను పండితులను పోషించేవారు, వార్షికాలూ ఇచ్చేవారు. ఇలా ఇచ్చే వార్షికాలు నూరు రూపాయలుగా ఉండేవి. ఈ మొత్తం నిజాంలో ఉన్న సంస్థానాలవారు పండితులకిస్తే అవి నిజాం హాలీ రూపాయలై ఉండేవి. నైజాం రూపాయల్ని హాలీ రూపాయలనేవారు. కోస్తా రాయలసీమ నుంచి నైజాం వైపు సంస్థానాలకి వెళ్ళిన వారికిచ్చిన నూరు హాలీ రూపాయలు బ్రిటిష్ పరగణాలో కొచ్చేసరికి నూటికి తగ్గేవి. కారణం ఏడు హాలీ రూపాయలు ఆరు బ్రిటిష్ రుపాయలకు మారకం అయేవి కనక. కాలం నడుస్తోంది. అటు సంస్థానాధీశుల లోనూ ఇటు గ్రహీతలలోనూ నూరు రూపాయలు పూర్ణాంకం చేరటం లేదనే వ్యధ ఉండిపోయింది. మార్గం కనపడలేదు.
చివరగా తేలినదేమంటే నూట పదారు హాలీ రూపాయలకి నూరు బ్రిటిష్ రూపాయలొస్తాయి గనక ఇటునుంచి వెళ్ళిన పండితులకు సత్కారంగా నూటపదార్లు ఇవ్వడం మొదలయింది. అక్కడ నూట పదహార్లు పుచ్చుకోవడం అలవాటైనవారు ఇక్కడా కోస్తాలో, రాయలసీమలో నూటపదహార్లు, ఇవ్వడం, పుచ్చుకోవడం అలవాటు చేసుకున్నారు, అప్పటివరకూ ఉన్న అలవాటు పూర్ణాంకానికి బదులుగా. ఇలా నూటపదార్లు - వెయ్యిన్నూటపదహార్లు అలవాటులో మిగిలిపోయాయి. నేటి కాలానికి అర్ధనూటపదహార్లు కూడా ఉన్నాయి. పెట్టడం పెద్దలనాటినుంచీ లేదుగాని పుచ్చుకోడం పూర్వీకులనుంచీ అలవాటేనన్న సామెతగా.
శతమానం భవతి, శతాయుః…అశీర్వచనం
నూరు సంవత్సరములు ఆయుస్సు కలుగుగాక.
శతం జీవ శరదో వర్ధమానా… ఆశీర్వచనం.
నూరు శరత్తులు వర్ధిల్లుదువుగాక……ఇలా పూర్ణాకం చెప్పడమే మన అలవాటు.
ఇదీ నూటపదహార్ల కథ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి