*పంచాయతనం అంటే.... ?*
ఆదిశంకరుల వారు భారతదేశంలో అనేక అవైదిక మతాలు ఉన్నటువంటి సందర్భంలో వారందరితో వాదించి ఓడించి అందులో చిట్టచివరిగా ఆరు మతాలను స్థాపన చేయడం జరిగింది.
ఆరు మతాలు అంటే మహమ్మదీయ మతము, క్రైస్తవపతము అని కాదు...
గాణా పత్యము,
శైవము,
సౌరము,
వైష్ణవము,
శాక్తేయము,
కౌమారము.
ఈ ఆరింటిని షణ్మతాలు అంటారు.
*అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే...!*
గణపతి,
శివుడు,
విష్ణువు,
అమ్మవారు,
సూర్యుడు,
కార్తికేయుడు...
ఈ ఆరు మతాలను శంకరులు స్థాపించారు కనుక ఆయనను షణ్మతాస్థాపనచార్యుడు అంటారు.
ఎవరైనా సరే ప్రతిరోజు ఇంట్లో గణపతి, అమ్మవారు, విష్ణుమూర్తి, సూర్యనారాయణ, శివుడు ఈ ఐదుగురిని తప్పకుండా పూజించాలి అని శాస్త్రం తెలియజేస్తుంది.
ఇక కార్తికేయుడు అగ్నిస్వరూపం కనుక అగ్ని ఆరాధన మన సనాతన ధర్మంలో మొదటి నుంచి ఉంది కనుక కార్తికేయునికి అగ్ని ఆరాధనతో సంబంధం ముడి పెట్టడం జరిగింది.
కార్తికేయుని వదిలివేస్తే ఇక మిగతా 5 దేవతామూర్తులను అందరూ తప్పకుండా ప్రతినిత్యము ఆరాధించి తీరవలసిందే.
ఈ ఐదు మూర్తులను పంచాయతనము అని అంటారు.
శివుడు మధ్యలో ఉండి మిగతా మూర్తులు చుట్టూ ఉంటే ....
అంటే ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువ్యము ఈ స్థానంలో ఇతర మూర్తులు ఉండి మధ్యలో శివుడు ఉంటే అది శివపంచాయతనము అవుతుంది.
మధ్యలో అమ్మవారు ఉండి మిగతా మూలలో ఇతర మూర్తులు ఉంటే అది అంబికా పంచాయతనము అంటారు...
మధ్యలో విష్ణుమూర్తి ఉండి చుట్టూ ఇతర మూర్తులు ఉంటే దానిని విష్ణు పంచాయతనము అంటారు.
మధ్యలో గణపతి ఉండి చుట్టూ ఇతర దేవతామూర్తులు ఉంటే అది గణపతి పంచాయతనము అవుతుంది.
అదేవిధంగా మధ్యలో సూర్యనారాయణ మూర్తి ఉండి చుట్టూతా ఇతర మూర్తులు ఉంటే అది సూర్యపంచాయతనము అవుతుంది.
ఎవరు ఏ విధంగానైనా గాని ఈ పంచాయతన పూజను ఆచరించుకోవచ్చు.
ఇది విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది.
మనము కొన్ని ఆలయాలకు దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ శివపంచాయతనము మనకు కనబడుతూ ఉంటుంది.
శివలింగము మధ్యలో ఉండి చుట్టూ మిగతా మూర్తులు ఉండడం గమనించి ఉంటారు. అలాంటి పూజ విశిష్టమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అని శాస్త్రం చెప్తుంది.
నిత్యము ఈ పంచాయతనస్మరణ ఈ పంచాయతన శ్లోకములను పఠించడం చేత ఆ పంచాయతన దేవత ఆరాధన ఫలితము మనకు దక్కుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి