మహాలయము (బ్రహ్మలోక ప్రాప్తి)
భాద్రపద కృష్ణ (పాడ్యమి) ప్రతిపద మొదలుకొని (అమావాస్య) దర్శ పర్యంతము 15 దినములు. (తిథి అధికమైనచో 16, క్షయమయినచో 14 దినములు) మహాలయములు. దీనినే మహాలయపక్షమని వ్యవహారము.
అశక్తుడైనచో పంచమిగాని, షష్టిగాని, అష్టమిగాని, ద్వాదశిగాని, ఏకాదశి గాని మొదలుకొని అమావాస్య వరకు చేయవలయును. ఇంకనూ అశక్తుడైనచో నిషిద్ధము గాని మరియొక దినమందు (ఒక్కమారే చేయుట) సకృన్మహాలయము చేయవలయును.
పాడ్యమి మొదలుకొని పక్ష మహాలయములు చేయువారు చతుర్దశిని విడువకూడదు. తక్కిన పంచమ్యాది (పంచమి, షష్టి, అష్టమి, దశమి, ఏకాదశి) దర్శాంత పక్షము లైదింటను చతుర్దశి విడచి మిగిలిన దినము లందు మహాలయములు చేయవలయును.
సకృన్మహాలయమందును చతుర్దశి కూడదు. మరియు పాడ్యమి, షష్ఠి, ఏకాదశి, శుక్రవారము, జన్మనక్షత్రము, దానికి దశమము 19వ నక్షత్రము, రోహిణి, మఖ, రేవతియు సకృన్మహాలయములకు నిషిద్ధములు.
కొన్ని గ్రంథములలో సప్తమి, త్రయోదశి ఆదివారము, మంగళవారములు నిషేధమని యున్నది. పితృ మృత తిథియందు సకృన్మహాలయము చేయుచో దానికి నిషిద్ధము లేదు.
శ్లో॥ అశక్తః పితృ పక్షేషు కరో త్యేకదినే యతః నిషిద్ధేపి దినే కుర్యా త్పిండదానం యథావిథి ॥
తాత్పర్యము : అశక్తుడు పక్షమంతటికి ఒక్కరోజునే చేయును. కనుక నిషిద్ధ దినమందైననూ యథావిధి శ్రాద్ధము చేయవచ్చును. ఇది మృతతిథి విషయము. అట్టి సందర్భము రానిచో నిషేధము లేని దినమందు చేయవలయును. అపుడును ద్వాదశి, అమావాస్య, అష్టమి, భరణి, వ్యతీపాత వీనిలో ఒకటి సంభవించినచో మృతతిథి యైనను నిషేధము లేదు.
సన్యాసులకు మహాలయము అపరాహ్ణ వ్యాప్తి గల ద్వాదశియందు పిండదానముతో చేయవలెను. మరియొక తిథియందు చేయకూడదు. చతుర్దశి మృతతిథి అయిననూ ఆ దినమందు మహాలయము కూడదు. "శ్రాద్ధం శస్త్ర హతస్యైవ చతుర్దశ్యాం ప్రకీర్తిత" అను వచనము ప్రకారము చతుర్ధశి యందు శస్త్ర హతునకే శ్రాద్ధము చేయవలయును. ఇతర శ్రాధ్ధమేమియు చేయరాదు. పూర్ణిమయందు మృతి అయిన వానికి పూర్ణిమయందు మహాలయము చేయరాదు. కృష్ణపక్షమందు మహాలయము కావున, అందు పూర్ణిమ లేదు కావున, చతుర్దశి గాని, పూర్ణిమ యందుగాని మృతుడైన వానికి ద్వాదశి, అమావాస్య మొదలగు తిధులందు చేయవలెను.
శ్లో॥ ఆదౌ మధ్యేవసానే వా యత్ర కన్యాం వ్రజేద్రవి:
సపక్ష స్సకల శ్రేష్ఠ స్సశ్శ్రాద్ధ ష్షోడశకం ప్రతి ॥
తాత్పర్యము : ఈ మహాలయ పక్షమందు మధ్యయందు గాని, అంతమున గాని సూర్యుడు కన్యారాశియందు ప్రవేశించినచో శ్రేష్ఠము. కాని నిమిత్తము కాదు.
అమావాస్యలోగా మంచిదినము లభించని ఎడల ఆశ్వయుజ శుక్ల పంచమిలోగా జరిపించ వచ్చును. అప్పుడును సంభవించనిచో వృశ్చిక సంక్రాంతి పర్యంతములో వ్యతీపాతాది పర్వదినమందు మహాలయము చేయవచ్చును.
మృతాహమనగ ఆబ్దిక శ్రాద్ధమును, మహాలయ శ్రాద్ధమును పక్వాన్నము
చేతనే చేయవలయును గాని అపక్వ (బియ్యము) తండులాదులచే చేయ కూడదు ఎందువలన అనగా
శ్లో॥ మహాలయే గయాశ్రాద్దే మాతా పిత్రో ర్మృతేహని కృతో ద్వాహో . పికుర్వీత పిండదానం యథావిథి ॥
తాత్పర్యము : మహాలయ శ్రాద్ధమును, గయా శ్రాద్ధమును, తల్లి, తండ్రుల ఆబ్దికమును వివాహితుడైననూ యథావిధిగా పిండదానము చేయవలయును.
ఈ మహాలయ శ్రాద్ధమందు పార్వణత్రయ ముద్దేశించి చేయ వలయును. పార్వణ త్రయమనగా
1. పితృ పితామహ, ప్రపితామహులు
2. మాతృ మాతామహ, మాతృ ప్రపితామహులు
3. సపత్నీక మాతా, మాతామహ, ప్రపితామహులు
ఈ పార్వణ త్రయమును భార్య మొదలగు నేకోద్దిష్ట పితృ గణ సహిత సర్వ పితృ దేవతల నుద్దేశించి చేయుట ఒక పక్షము.
సపత్నిక పిత్రాది త్రయమనియు, సపత్నిక మాతామహాది త్రయ మనియు పార్వణ ద్వయముగ షడ్దైవతల మాత్రము ఉద్దేశించి చేయుట రెండవ పక్షము.
షడ్దైవతలను ఏకోద్దిష్ట గణము నుద్దేశించి చేయుట మూడవ పక్షము, ఇందొక పక్షమున ప్రతిదినమును మహాలయము చేయునది. పంచమ్యా పక్షము లందుమా చేయునది. సకృన్మహాలయము చేయుచో సర్వ పితృదేవతల నుద్దేశించి చేయవలయును.
ఎట్లు అనగా:
"పితృ పితామహ ప్రపితామహానాం, మాతృ తత్సపత్నీ పితామహి తత్స పత్నీ ప్రపితామహీ తత్సపత్నీ నామస్మత్సాపత్న్య మాతు దితివా మాతా మహ మాతుః పితామహ మాతుః ప్రపితామహానాం, సపత్నికానాం యధా నామ గోత్రాణాం వసు రుద్రాదిత్య రూపాణాం పార్వణ విధినా పత్న్యాః పుత్రస్య కన్యాయా: పితృవ్యస్య మాతులస్య భ్రాతుః పితృష్వసు: మాతృష్వ సురాత్మ భగిన్యా: పితృవ్య పుత్రస్య జామాతు ర్భాగి నేయస్య శ్వశురస్య శ్వశ్ర్వా ఆచార్యస్య ఉపాధ్యాయస్య గురోః సఖ్యుశ్శిష్యస్యై తేషాం యధానామ గోత్రాణాం పురుష విషయే సపత్నికానాం, స్త్రీ విషయే సభర్తృక పాపత్యా నామేకోద్దిష్ట విధినా మహాలయా పరపక్ష శ్రాద్ధం. సకృన్మహాలయ పరపక్ష శ్రాద్ధం వా సదైవం సద్యః కరిష్యే" అని మహాలయము చేయవలయును.
పైన యుద్దేశించిన వారిలో ఎవ్వరైన జీవించియున్న ఎడల వారిని విడిచి అన్యుల నుద్దేశింపవలయును. మాతామహాదుల స్త్రీలు జీవించి యున్నచో 'సపత్నీకానాం' అను శబ్దమును విడువవలెను. భర్త జీవించి యున్నచో స్త్రీకి 'సభర్తృక' శబ్ద ఉచ్చారణమక్కరలేదు. శ్లో॥ మహాలయే గయా శ్రాద్ధే వృద్దౌ చా న్వష్ట కాసు చ నవదైవ తమ త్రేష్టం శేషం షాట్పౌరుషం విదుః అన్వష్టకాసువృద్ధౌచ ప్రతి సంవత్సరే తథా మహాలయే గంగాయాం చ సపిండీ కరణాత్పురా మాతు శ్శ్రాద్ధం పృథక్కార్య మన్యత్ర పతినా సహ ॥
తాత్పర్యము : మహాలయము, గయా శ్రాద్ధము, నాందీ శ్రాద్ధము, అన్వష్టకా శ్రాద్ధములు. వీటియందు మీద చెప్పినటుల తొమ్మండుగురు పితృదేవతలు, తక్కిన శ్రాద్ధములందు నలుగురు ఉండవలయును. మరియు ప్రత్యాబ్దిక మందును, సపిండీకరణమునకు ముందు చేయు శ్రాద్ధమందును మాతృశ్రాద్ధము వేరుగా చేయవలయును. తక్కిన శ్రాద్ధములు తండ్రితో కలిపి చేయవచ్చును.
కొందరు మాతా మాహాదులతో వారి భార్యలను కలుపక వేరుగ నుద్దేశించి పారణ చతుష్టయమని అనుచున్నారు. అప్పుడు 12 పితృ దేవతలని సిద్దించును. ఇట్లు మహాలయమందు ఉద్దేశించిన దేవతలనే గంగాతీర్ణ శ్రాద్ధమందు నిత్య తర్పణమందును ఉద్దేశింపవలయును.
మహాలయమందు విశ్వేదేవులు 'ధురీ విలోచనులు' అనబడుదురు. ఇచ్చట విభవము కలిగినచో విశ్వదేవతలకు ఇద్దరు విప్రులను, మూడు పార్వణములకు ఒక్కొక్కదానికి ముగ్గురు చొప్పున తొమ్మిదిమందిని, భార్యా మొదలగు ఏకోదిష్ట గణములలో ప్రతిదేవత కొక్కొక్క బ్రాహ్మణుని నిమంత్రణ చేయవలయును. అశక్తుడైనచో విశ్వదేవుల కొకరిని, పార్వణ త్రయమునకు ముగ్గురను, ఏకోదిష్ణ గణమంతటికిని ఒక బ్రాహ్మణుని, ఇట్లు అయిదుగురను నిమంత్రించునది.
విశ్వదేవులకిద్దరు విప్రులను నియమించుకొని నప్పుడు పితృ పార్వణము లకు తొమ్మిదిమంది కావలయును. కాని ముగ్గురు కాకూడదు. ఇట్లు తొమ్మిది మందిని పార్వణములకు నియమించునప్పుడు, విశ్వదేవులకు ఒక్కరిని నిమంత్రించరాదు. ఇంకనూ అశక్తుడైనచో పారణ ద్వయమునకు ఒక బ్రాహ్మణుని నియమించవచ్చును. మహాలయ అంతమున విష్ణువు నిమిత్తము ఒక బ్రాహ్మణుని నియమించవలెను.
కౌస్తుభమందు జీవన్మాతృకుడైనచో సపత్నీమాతకు ఏకోద్దిష్టమే గాని పార్వణ మక్కరలేదని యున్నది. సవతి తల్లు అనేకమంది అయినచో సర్వ మాతల నుద్దేశించి ఒక్క బ్రాహ్మణుని నియమించవలయును. పిండము ఒక్కటియే అర్ఘ్యపాత్రము వేరువేరుగ ఈయవలయును. తన తల్లిని కూడ కలిపినచో తనతల్లితో పాటు సవతి తల్లులందరికినీ ఒక బ్రాహ్మణుని నిమంత్రించి అర్ఘ్యము, పిండము చేసిన పార్వణము అగును కాని ప్రత్యేకముగ ఉద్దేశింప అవసరము లేదు. లేదా సపత్నీమాత లందరకును ఏకోద్దిష్టమైననూ చేయవచ్చును. లేక ఒక సపత్నీ మాతకైననూ ప్రత్యేకముగ ఏకోద్దిష్టమైననూ చేయవచ్చును.
మహాలయమందు పార్వణ త్రయము నిమిత్తమే. యగ్నౌకరణము గాని ఏకోద్దిష్టము గాని అక్కరలేదు కాని చేసిననూ తప్పు లేదు. కాని చేయు నప్పుడు ఏకోద్దిష్ట గణార్ధమై యగ్నౌకరణాంతము (మట్టిపాత్ర) పృధక్పాత్ర యందు గ్రహింప వలయును. మహాలయమందు సర్వ పార్వణములకును ఏకోద్దిష్టమునకును, పిండదాన ముత్తరణమగు సకృదాచ్చిన్న బర్హిసు ఏకముగానే గ్రహించవలయును. (అమావాస్యలలో)దర్శాదులలో ప్రతి పార్వణమునకు భిన్నముగానే అది యుండును. తక్కిన శ్రాద్ధప్రయోగమును అనేక మాతలగుచో అభ్యంజనాది మంత్రము శ్రాద్ధ సాగరమందు గాని తమతమ గృహ్య సూత్రమున గాని తెలుసుకొనవలయును,
సకృన్మహాలయము చేయునప్పుడు శ్రాద్ధాంగమయిన తిల తర్పణము పరదినమందే, సర్వ పితౄద్దేశము చేసి ప్రాతస్సంధ్యకు పూర్వమే గాని, అనంతరము గాని బ్రహ్మ యజ్ఞాంగ తర్పణము గాక వేరుగా చేయవలెను. ప్రతిపదాది, పంచమ్యాది పక్షముల యందు విప్రుల విసర్జించిన పిమ్మట శ్రాద్దపూజితులైన పితల నుద్దేశించి అప్పుడే తర్పణము చేయవలెను.
భార్య రజస్వలయైనచో మహాలయ శ్రాద్ధము కూడదు. కాలాంతర మందు చేయవచ్చును. అమావాస్య యందు రజో దోషమైననూ ఆశ్వియుజ శుక్లపంచమి లోగా జరుపవచ్చును. ప్రతిపదాది పక్షములలో ప్రారంభ దినమందు పాకము కాకముందు పత్ని రజస్వల అయినచో ఉత్తరోత్తర పక్షము స్వీకరింపవలయును. ప్రారంభమైన పిదప రజస్వల యైనచో
ఆమెను గృహాంతరమందు నిరోధించి మహాలయము జరిపింప వలెను. ఇట్లు విధవస్త్రీ భర్తకు చేయునప్పుడును ఇదే విధముగా చేయవలెను.
"మమ భర్తృ పితృ పితామహ ప్రపితామహానాం, మమ భర్తృ మాతృ పితామహీ ప్రపితా మహీనాం, మమ పితృ పితామహ ప్రపితామహానాం, మమ మాతృ పితామహి ప్రపితామహీనాం, మమ మాతామహి మాతృ పితామహ మాతృ ప్రితామహానాం, మమ మాతామహి మాతృ పితామహి మాతృ ప్రపితామహీనాం తృప్త్యర్ధం సకృన్మహాలయా పరపక్ష శ్రాద్ధం కరిష్యే" అని స్వయముగ సంకల్పించి యవి కృతముగ తక్కిన ప్రయోగ మంతయు బ్రాహ్మణునిచే చేయించవలయును.
బ్రాహ్మణుడు "---- నామ్న్యా యజమానాయా భర్తృ పితృ పితామహ, ప్రపితామహ" అని ఉచ్చరించుచు క్రియను చేయించవలెను. ఆశక్తి అయినచో "భర్త్రాదిత్రయము, స్వపిత్రాదిత్రయము, స్వ మాత్రాదిత్రయము, స్వమాతామహాది త్రయము సపత్నిక అని పార్వణ చతుష్టయమునకే యుద్దేశించి చేయవలెను. ఇంకనూ ఆశక్తి అయినచో "స్వ భర్త్రాది స్వయం పిత్రాదిత్రయం" అని పార్వణద్వయమునే ఉద్దేశించవలెను.
మహాలయము జీవత్పితృకుడు సహితము తండ్రి సన్యసించినను పాతిత్యాది దోష యుక్తుడైననూ తండ్రియొక్క పిత్రాదుల నందరినీ ఉద్దేశించి పిండ దానములు లేకుండగ సంకల్ప విధిచే శ్రాద్ధము చేయవలెను.
శ్లో॥ వృద్ధౌ తీర్ధే చ సన్యస్తే తా తేచ పతితే సతి యేభ్య ఏవ సితా దద్యాత్తే భ్యో దద్యా త్స్వయం సుతాః ॥
తాత్పర్యము : నాందీ శ్రాద్ధాదులందును, తీర్ధ శ్రాద్దమందును, తండ్రి సన్యసించినను, పతితుడైనను, తండ్రియొక్క పిత్రాదుల నుద్దేశించి కొడుకు శ్రాద్ధము చేయునది.
శ్లో ll ముండనం పిండదానం చ ప్రేతకర్మచ సర్వశః న జీవ త్పితృకః కుర్యాద్గుర్విణీ పతిరేవచ ॥
తాత్పర్యము : క్షౌరము, పిండదానము సర్వ విధములైన ప్రేత కర్మలు జీవత్పితృకుడును, గర్భిణీపతియు చేయకూడదు.
పిండ దానాది విస్తారము చేయుట కశక్తుడైనచో సంకల్ప విధి చేయ వచ్చును. కాని సంకల్పవిధి యందు అర్ఘ్య దానము, సమంత్రకావాహనము, అగ్నౌకరణము, పిండదానము, స్వధావాచన సంకల్పము, ఓం స్వధేత్యాధికమైన స్వధావాచన ప్రయోగము చేయకూడదు.
అనేక బ్రాహ్మణులు లభించనిచో దేవస్థానమందు సాలగ్రామాది దేవతామూర్తిని స్థాపించి శ్రాద్ధము చేయవలెను. బొత్తిగ బ్రాహ్మణుడు లభించనిచో దర్భల చేత వటువును చేసి శ్రాద్ధము. తల్లితండ్రుల మృతి యందు ప్రథమాబ్దమున మహాలయము (చేయవచ్చును లేక మానవచ్చును) వైకల్పికము. మలమాసమందు మహాలయము చేయకూడదు. ఈ మహాలయ పక్షమందు (తల్లితండ్రుల ఆబ్దికము) ప్రత్యాబ్దికము ప్రాప్తించినచో మృతవిధి యందు వార్షిక శ్రాద్ధము చేసి మరియొక దినమందు మహాలయము జరిపింపవలయును. (అమావాస్య) దర్శయందు ప్రత్యాబ్దిక మైనచో పూర్వము వార్షికమున అనంతరమున సకృన్మహాలయమును. తదనంతరమున దర్శ శ్రాద్ధమును భిన్నభిన్న పాకములచే చేయవలెను. సకృన్మహాలయము మాత్రము వచ్చిననూ పూర్వము మహాలయము తదనంతరమున దర్శ శ్రాద్ధము చేయునది. మృతతిథి యందు సకృన్మహాలయమను పక్షమున దర్శకువలె ఆ తిథి అపరాహ్ణ వ్యాప్తి కావలయును.
- ధర్మసింధు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి