%%% ఆలోచనాలోచనాలు %%% ----౦0 శ్రమ -- సోమరితనం 0౦---- ***** శరీరయాత్రాపిచతే, నప్రసిద్ధ్యేన కర్మణా!--- భగవద్గీత. ( ఏ పని చెయ్యకుండా కూర్చుంటే దేహయాత్ర కూడా సాగదు, ఓ అర్జునా!) ***** సర్వమాత్యయికం కార్యం, శృణుయాన్నాతి పాతయేత్! కృచ్ఛ్రసాధ్యమతికాస్త మసాధ్యం వా విజాయతే!! (చెయ్యాల్సిన పనిని వాయిదా వెయ్యకుండా వెంటనే పూర్తి చెయ్యాలి, తప్ప తాత్సారం చెయ్యకూడదు. జాగుసేత వలన ఆ కార్యం అసాధ్యం అయ్యే ప్రమాదం ఉంది.) ***** సోమరిపోతుకు చదువు రాదు. విద్యలేనివానికి ధనమెక్కడిది? ధనహీనునకు మిత్రులెక్కడ? మిత్రులు లేనివానికి సుఖం ఎక్కడిది? ( అలసస్య కుతో విద్యా? --- తెలుగు అనువాదం. ***** సోమరిపోతు తన కుటుంబానికే కాదు; ఈ లోకానికి కూడా బరువు చేటు; ***** మంచి పనులను చెయ్యడానికి బద్ధకించకండి. ఆలస్యం అనర్థాలకు మూలం. ఆనకట్టలు లేని నదుల నీళ్ళు ఉప్పుసముద్రం పాలేకదా? ***** జీవితంలో ఎన్నడూ తప్పులు, పొరబాట్లు చెయ్యనివారు మరణించిన వారే కదా! గత నాలుగు వేల సంవత్సరాలుగా ఒక్క తప్పుకూడా చెయ్యని ఒక వ్యక్తిని నేను ఇటీవలే చూచాను. అతడెవరోకాదు. ఈజిప్ట్ పిరమిడ్లలో విశ్రాంతి తీసుకొంటున్న మమ్మీ!( శవం.) ***** కృషి చెయ్యకుండా ఎవరూ, దేనినీ సాధించలేరు. చివరకు వరాలిచ్చే దేవతలు కూడా (రాక్షసుల సహాయంతో) పాలసముద్రాన్ని అనంతకాలం మథించిన అనంతరమే అమృతాన్ని పొందారు. ***** సోమరితనం వచ్చి వ్యక్తి భుజాలపై కూర్చుంటే, చిప్ప పట్టుకొని అడుక్కుతినేదాకా అది క్రిందికి దిగదు. ***** జీవిస్తున్న మనిషి తనకుతాను కట్టుకొంటున్న సమాథినే లోకం "" సోమరితనం"" అనే అందమైన పేరుతో పిలుస్తూఉంటుంది. ***** సోమరితనం ద్వారా సులువుగా జరిగే పనులు జటిలమవుతాయి. శ్రమించడం ద్వారా జటిలమైన పనులు సులువుగా నెరవేరుతాయి. ***** తేనెతుట్టెలో పనిచేసే తేనెటీగలు శ్రమను వినోదంగా పరిగణిస్తాయి. తినికూర్చొని, సంతానోత్పత్తి మాత్రమే చెయ్యగలిగిన " మగ ఈగలు" కరువు కాలంలో చంపివేయబడతాయి. ***** శ్రమించడం ద్వారా , శరీరం ఆరోగ్యాన్ని, మనస్సు నిర్మలత్వాన్ని, హృదయం సంతృప్తిని, జేబులు నోట్లకట్టలను పొందుతాయి. ***** మీలోని ప్రతిభ బంగారం అయితే, మీరు ఇష్టపడే శ్రమ దానిని మీరు ధరించే అందమైన ఆభరణంగా మారుస్తుంది. ***** సోమరితనం కాపురానికి రాగానే అప్పటి వరకు మీకు తోడుగా ఉన్నటువంటి " ఆనందం" విడాకులు తీసుకొంటుంది. ఇది ప్రకృతి ఏర్పరచిన నియమం. ***** పనిచేసే వ్యక్తిని ఒక దయ్యమే బాధిస్తుంది. అది "పని దయ్యం." శ్రమించని వ్యక్తిని పదివేల దయ్యాలు బాధిస్తూవుంటాయి. ***** మిమ్మల్ని సోమరితనం మోసగించడానికి అవకాశం ఇవ్వకండి. మీరు దానికి " నేడు" ను మాత్రమే ఇచ్చారనుకోండి. అది "రేపు" ను కూడా వాడుకొనేంత నేర్పరి. ***** సోమరితనం, దరిద్రం అక్కాచెల్లెళ్ళు. వాటిమధ్య పరుగుపందెం ఏర్పాటుచేస్తే, దరిద్రం ముందు వెళ్ళి, చెల్లెలు సోమరితనానికి " ఆహ్వానం" పలుకుతుంది. ***** లోకంలో అన్ని జాతుల వారు, మతాలవారు, భాషలవారు, ప్రాంతాలవారు తమతమ సంఘాలను ఏర్పరచుకొని బలంగా, దృఢంగా ఉంటారు, ఒక్క సోమరిపోతులు తప్ప. ఎందుకంటే వారు సంఘంగా ఏర్పడాలంటే ఉన్నచోటునుండి , ఎంతోకొంత కదలాలి కదా! అది వారితో అయ్యేపని కాదు. ***** శ్రమలోనే ఆరోగ్యం ఇమిడివుంటుంది. " రన్నింగ్ లో ఉన్న వాహనపు బాటరీ" దానంతట అదే ఛార్జ్ అవుతూవుంటుంది. షెడ్ లో ఉన్న కొత్త కారైనా తిరగకపోతే బాటరీ దానంతట అదే "డౌన్" అవుతుంది. మనిషి లో దాగివున్న "" శక్తియుక్తులు'" కూడా ఇటువంటివే! కాబట్టి " సోమరితనానికి" వీడ్కోలు పలికి, "శ్రమశక్తి" ని ఆహ్వానిద్దాం. తేది 14--10--2023, శనివారం, శుభోదయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి