14, అక్టోబర్ 2023, శనివారం

పితృదేవతలు-సంక్షిప్త చరిత్ర

 *పితృదేవతలు-సంక్షిప్త చరిత్ర, బ్రహ్మదత్తుని కథ-(శ్రీ హరివంశం పురాణము, పితృకల్పము)*

 

     *శ్రాద్ధ సమయంలో తప్పక ఈ కథను స్మరించడం లేదా పారాయణము చేయాలని శాస్త్రం* . 


            *బ్రహ్మదత్తుని పూర్వజన్మ వృత్తాంతము* 


    శ్రాద్ధం వల్ల కీర్తి, యోగము ఐహిక సుఖములు కలుగుతాయి.


        *బ్రహ్మదత్తుడు* తన ఏడు జన్మలకు ముందు తన పితరులకు పెట్టిన శ్రాద్ధం వల్ల పొందిన గొప్ప ఫలితం తెలియజేసే కథను శ్రీమార్కండేయుడు భీష్మునికి తెలియజేసాడు. పూర్వం భరద్వాజుని పుత్రులు యోగులయ్యారు. కానీ కొంత కాలం తర్వాత చెడు పనులు,దుష్టసహవాసం వల్ల యోగభ్రష్టులయ్యారు. తరువాతి  జన్మలో  కౌశిక వంశంలో విశ్వామిత్రునికి ఏడుగురు పుత్రులుగా జన్మించారు. వారు వాగ్దుష్టుడు, క్రోధనుడు, హింస్రదుడు, పిషూణుడు, కలి, కసృమ, పితృవర్తి.  తండ్రి మరణిచాక గర్గముని ఆశ్రమం లో  గర్గుని శిష్యులుగా చేరారు.   ఒకనాడు గురువుగారు ఆజ్ఞ ఇవ్వగా ఆవులను మేపటానికి అడవికి తీసుకెళ్ళారు. దారితప్పి తిండి లేక నాలుగు రోజులపాటు పస్తులున్నారు. తీవ్రమైన ఆకలిబాధను తట్టుకోలేక వారికి చెడుబుద్ధి ప్రాప్తించి వారు మంచో, చెడో తెలియక ఆవును చంపి తిందామని అనుకుంటారు. అందులో పితృవర్తి, ఇలా గోహత్య చేయడం తప్పు. కానీ పితృశ్రాద్ధం చేసి గోవును  సమర్పించి ఆహరం స్వీకరిద్దాము అంటాడు. అందుకు అందరూ అంగీకరించి శాస్త్రోక్తంగా శ్రాద్ధమును నిర్వహిస్తారు. తరువాత ఆశ్రమం చేరి గురువైన గర్గుని దగ్గర ఆవును పులి తినేసిందని అబద్ధం చెపుతారు.  కొద్దికాలం గడిచాక వారు మరణిస్తారు.   


       " *సప్తవ్యాధా దశార్ణేషు"*  

                  గోహత్య కారణంగా వారు మరుజన్మలో కిరాతకునికి దశార్ణదేశంలో ఏడుగురు పుత్రులుగా పుట్టారు. వారి పేర్లు: నిర్వైరుడు,నిర్వృత్తి,శాంత, నిర్మన్యు , కృతి, వైద్యసోమ, నృవర్తి.  ఏడుమందికి పూర్వజన్మలో శ్రాద్ధం పెట్టిన పుణ్యఫలం చేత వారికి పూర్వజన్మ స్మృతి ఉన్నది. ఏ మాత్రం హింస చేయకుండా ఉండేవారు. తల్లిదండ్రుల సేవ చేసేవారు. ధర్మాత్ములు అయ్యారు.  యోగాభ్యాసంతో ప్రాణాలు విడిచారు.


     " *మృగాకాలంజరే గిరౌ"* 


         తరువాతి జన్మలో కాలంజర అనే పర్వతం దగ్గర ఏడు జింకలుగా పుట్టారు. వారి పేర్లు ఉన్ముఖ, నిత్యవిత్రస్త, దబ్ధకరణి , విలోచన, పండిత, భస్మర, నాది. వీరు ఈ జన్మలో కూడా  యోగ ఉపాసన చేసి ఆయుష్షు తీరాక జింకగా దేహం చాలించారు. 

.  

       "చక్రవాకా శరద్వీపే"

           తరువాతి జన్మలో శరద్వీపంలో ఏడుగురు చక్రవాక పక్షులుగా జన్మించారు. వారి పేర్లు నిస్పృహ, నిర్మమ, క్షాంత, నిర్ద్వంధ,  నిష్పరిగ్రహ, నిరృతి, నిభృత. ఈ జన్మలో కూడా పూర్వజన్మ స్మృతి వలన తమ తప్పు తెలుసుకుని ఆహారనియమాలు పాటించి యోగాభ్యాసం చేసి  శరీరాన్ని విడిచిపెట్టారు.  


           " *సరసి మానసే"* 


             ఆ  తరువాతి జన్మలో ఏడుగురు హంసలుగా జన్మించారు. వారు సుమన, సుచివాక్, శుద్ధ, పంచమ, చిత్రదర్శి, సునేత్ర, స్వతంత్ర.  అవన్నీ  మానససరోవరం దగ్గర  తపస్సు చేసుకొంటుండగా, ఆ సరోవరానికి వచ్చిన కాంపిల్య దేశ రాజు  అతని మంత్రుల భోగాలు చూసి మూడు హంసలు మాత్రం ఆశ పొందాయి.  తరువాత పశ్చాత్తాప పడ్డాయి. మూడు హంసలు ఎలాగైనా మమ్మలని మరుజన్మలో  మాయనుండి కాపాడమని మిగిలిన నాలుగు హంసలను వేడుకుంటాయి.    తరువాతి జన్మలో ఆ  మూడు హంసలు  ఒకరు  బ్రహ్మదత్తుడు అనే రాజుగా ఇద్దరు  కండరీక, పాంచాల అనే మంత్రులు గా పుట్టారు.  ఈ జన్మలో కూడా సకల విద్యలను నేర్చుకొన్నారు. వారికి పూర్వజన్మ స్మృతి లేదు.  దేవలముని పుత్రిక సన్నతిని బ్రహ్మదత్తుడు వివాహం చేసుకొన్నాడు. రాజు,మంత్రులు సకల భోగభాగ్యాలు అనుభవిస్తూ కాలం గడిపారు. 

 ఒకసారి అంతఃపురంలో ఉండగా ఒక మగచీమ, ఆడచీమతో మాట్లాడుతున్న సంభాషణ చూసి బ్రహ్మదత్తుడు నవ్వాడు. ఆ విద్య గురించి ఎవ్వరికైనా చెబితే మరణిస్తావని ఋషి తెలియచేస్తాడు. అందుకే ఆ సంభాషణ గురించి సన్నతికి చెప్పలేదు. అయినా సన్నతి నీకు మరణం వచ్చినా పర్లేదు వాటి సంభాషణ చెప్పాల్సిందే అని పట్టుపట్టింది. ఇంత కఠినమైన భార్యను  చూసి బ్రహ్మదత్తునికి వైరాగ్యం వచ్చి అడవికి మంత్రులతో సహితంగా తపస్సు  చేసుకోడానికి వెళతాడు .     


     " *తేఽభిజాతా కురుక్షేత్రే బ్రాహ్మణా వేదపారగాః"* 


     హంసలుగా ఉన్న మిగిలిన నలుగురు యోగాభ్యాసంతో తమ దేహత్యాగం చేసి కురుక్షేత్రంలో ఒక పేద బ్రాహ్మణునికి  పుత్రులుగా పుట్టి పూర్తి వైరాగ్యంతో ఉంటారు. వారు తపస్సు చేయదలచి ఇల్లు విడుస్తుండగా వారి తండ్రిగారి పోషణనిమిత్తం తమ తండ్రిని రాజుగారి దగ్గరకు పంపుతూ ఈ రెండు శ్లోకాలు రాజు,మంత్రులు ఉండగా వారి ఎదుట చదవమని చెప్తారు . తపస్సు చేయడానికి వెళ్ళిన బ్రహ్మదత్తుడు విష్ణుదర్శనం చేసుకొని మంత్రులతో సహా తిరిగి రాజ్యానికి విచ్చేస్తారు. అప్పుడు ఆ పేద బ్రాహ్మణుడు రాజు మరియు మంత్రుల ఎదుట 


శ్లో౹౹ 1. *సప్తవ్యాధా దశార్ణేషు మృగాకాలంజరే గిరౌ | చక్రవాకా శరద్వీపే హంసాః సరసి మానసే* ||

   2. *తేఽభిజాతా కురుక్షేత్రే బ్రాహ్మణా వేదపారగాః | ప్రస్థితా దీర్ఘమధ్వానం యూయం కిం అవసీధత* ||


             "ఓ మహారాజా! దశార్ణదేశంలో ఏడుగురు కిరాతులు, కాలంజన పర్వతమందు ఏడుమృగాలు, శరద్వీపంలో ఏడు పక్షులు, మానససరోవరం లో ఏడు హంసలై పుట్టాయి. వాటి నుండి మేము నలుగురం కురుక్షేత్రంలో ఒక వేద పండితునికి పుట్టి చాలా దూరం వెళ్ళి మిమ్మల్ని వెతికాము. చాలా కష్టపడి చూచాము". అని చదవగానే వారికి పూర్వజన్మ వృత్తాంతం గుర్తుకు వచ్చి రాజు, మంత్రులు మూర్ఛపోతారు.  తరువాత బ్రాహ్మణులకి తగిన ధనం ఇచ్చి, సన్మానం చేసి పంపిస్తారు. 


    రాజు  అంతఃపురం వెళ్ళి తన భార్య సన్నతి దగ్గర నీవే నన్ను కఠిన మాటలతో  తిరస్కరించకపోతే నేను విష్ణుదర్శనం అయ్యేది కాదు అంటాడు. అప్పుడు సన్నతి, ఓ రాజా మీరు లౌకిక విషయలు, సుఖభోగాలకు అలవాటుపడి ఆ పరమాత్మను మరచిపోతున్నారు. అందుకే ఆ విధంగా కఠినంగా వ్యవహరించాను. ఆ శ్లోకాలు, చీమల సంభాషణ కూడా నాకు తెలుసు అంటుంది. ఆశ్చర్యపడిన బ్రహ్మదత్తుడు నీవు ఎవరు అని ప్రశ్నిస్తాడు. రాజా మీరు ఏడుగురు గర్గ శిష్యులుగా ఉన్నప్పుడు అడవిలో ఆకలితో ఉన్నప్పుడు చంపి శ్రాద్ధం పెట్టిన గోవును నేను అంటుంది. బ్రహ్మదత్తుడు ఆశ్చ్ర్యపోతాడు.   గోవు అజాతశత్రువు. గోవును హింసించినా, బాధించిన మాత్రు వాత్సల్యం తో ప్రేమిస్తుంది. సృష్టిలో ఇంతకన్న గొప్ప జంతువు ఉండదు. అప్పుడు సన్నతి ఓ రాజా,  మిమ్మల్ని తరింపచేయడానికి మీ భార్యగా ఈ జన్మలో మీకు కలిగాను. తరువాత ఆ ఏడుగురు యోగాభ్యాసం చేసి శరీరం విడిచిపెట్టారు. గోహత్య, గోహింసకు పరిహారం లేదు. అయినా భక్తితో శ్రాద్ధం పెట్టిన పుణ్యంచేత వారు జ్ఞానం పొంది యోగాభ్యాసం తో  సద్గతులు పొందగలిగారు.   


            ఈ కథను విన్నా, పారాయణం చేసినా పశుపక్ష్యాది జన్మలు పొందరు. అంత్యకాలంలో యోగాభ్యాసం చేసి తరిస్తారు. పితృదేవతల అనుగ్రహము సంపూర్ణంగా ఉంటుంది.

కామెంట్‌లు లేవు: