14, అక్టోబర్ 2023, శనివారం

నవగ్రహా పురాణం🪐* . *53వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *53వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*శనిగ్రహ జననం - 4*


సూర్యుడు లేని సమయం చూసుకుని , నారదుడు మందిరంలోకి వెళ్ళి ఛాయను కలుసుకున్నాడు. 


*"నేను నారదుణ్ణి ! నిన్ను చూస్తుంటే సాక్షాత్తుగా ఆ సంజ్ఞాదేవిని చూస్తున్నట్టే ఉంది. ఛాయాదేవీ !"*


ఛాయ ఆందోళనతో చూసింది. *"నేను... నేను...సంజ్ఞనే !"* అంది తొట్రుపాటుతో , 


*"నారాయణ ! మీ 'బింబ ప్రతిబింబాల' నాటకం నాకు తెలుసు ఛాయా ! నీ క్షేమం కోరి ఇలా వచ్చాను. సంజ్ఞ పథకంలో నువ్వు అమాయకంగా బలి అవుతున్నావు !"*


*"స్వామీ..."*


*"ఆ ! ఆమె బిడ్డల్ని ఎంత కాలం నీ బిడ్డలనుకుంటావు ? నువ్వు స్త్రీవి ! నీకూ నీ సంతతి ఉండాలి. సూర్యుడితో నువ్వు సాగిస్తున్న దాంపత్యం సార్థకం చెందాలంటే , ఆయన పనుపున , నీ కడుపున పిల్లలు పుట్టాలి. సంజ్ఞ బిడ్డలు సంజ్ఞ బిడ్డలే ! ఛాయ బిడ్డలవుతారా ?"*


*"సంజ్ఞ బిడ్డలు..."* ఛాయ సాలోనచగా అంది.


*"ఉంటారు ! ఎక్కడికి పోతారు ? పైగా నువ్వు సంతతిని పొందకూడదని సంజ్ఞ చెప్పలేదుగా ! సూర్య పత్నిగా నీ స్థానం పదిలం కావాలంటే నీకు , కనీసం ముగ్గురు నీ పిల్లలు కలగాలి. నీ భర్తను సంతాన భిక్ష అడుగు ! వస్తాను ! నారాయణ !"*


ఛాయ సాలోచనగా చూస్తూ ఉండిపోయింది.


*సంజ్ఞ బిడ్డలు సంజ్ఞ బిడ్డలే ! ఛాయ బిడ్డలవుతారా ?”* 


*"నీ స్థానం పదిలం కావాలంటే నీకూ కనీసం ముగ్గురు పిల్లలు కలగాలి !"*


*"నీ భర్తను సంతాన భిక్ష అడుగు !"*


*"నీ భర్తను సంతాన భిక్ష అడుగు !"*


నారదమహర్షి మాటలు ఛాయ గుండెలో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి... సంజ్ఞగా తాను ఇక్కడ సాగిస్తున్న నాటకం నారదుడికి తెలుసు. ఆ మహానుభావుడికి తెలిసిన రహస్యమేదీ చాలా కాలం పాటు రహస్యంగా ఉండదు.


పదుగురికీ తెలిసిపోయి , తమ రహస్యం బట్టబయలైపోయేలోగా తను జాగ్రత్త పడాలి. తన నటన తెలిసిపోయాక , సూర్యుడు తనను మందిరం నుండి బహిష్కరిస్తే తన జీవితం ప్రశ్నార్థకమే. సూర్యుడు ఇక్కడ ఉండనివ్వడు. ఆ నారద మహర్షి చెప్పింది నిజమే. తనకూ సూర్యుడికీ ఏదో శాశ్వత బంధం తీగలు సాగాలి. ఆ బంధం సంతానమే ! సందేహం లేదు !


నిజం చెప్పుకోవాలంటే - సంజ్ఞ కోసం తను త్యాగం చేస్తోంది ! తన అనురాగాన్నీ , అందాన్నీ , అక్క బర్తకు అంకితం చేసింది. ఆమె భర్తకు అనుమానం రాకుండా నిత్యమూ ప్రణయాగ్ని పరీక్షకు గురి అవుతూ - తను 'ఛాయ' అనే సత్యాన్ని మరిచిపోయి, తన నిజ వ్యక్తిత్వాన్ని చంపుకుంటూ , తన వారు కాని సంతానాన్ని తన వారుగా భావిస్తూ ఆ విధంగా తనను తాను మోసం చేసుకుంటోంది. తీవ్రంగా ఆలోచిస్తే తను ప్రమాదకరమైన జీవితం గడుపుతోంది. ఇది మహా సాహసం ! ఆ సాహసానికి ప్రతిఫలం ఉండాలి ! నిజమైన ప్రతిఫలం తనకు సంతానమే ! ఆ నారద మహర్షి రావడం మంచిదే అయ్యింది !


ఛాయ ఆలోచనల్లోంచి బైటపడింది. ఆలోచనల్ని చిలికి చిలికి నిర్ణయ నవనీతాన్ని వెలికి తీసింది ! ఛాయ తోటలోంచి మందిరంలోకి నడిచింది.


ఛాయ నిలువుటద్దం ముందు నిలబడి ముంగురుల్ని వేళ్ళతో సర్దుకుంది. సూర్యుడు చిరునవ్వుతో తన వైపు వస్తున్నాడు. ఛాయ అద్దంలో సూర్యుడి ప్రతిబింబాన్నే చూస్తూ తలలో తరుముకున్న పువ్వుల్ని ఒకసారి తడువుకుంది.


సూర్యుడి చేతులు ఆమె రెండు భుజాల మీద వాలాయి. తన తల మీద ప్రత్యక్షమై చిరునవ్వులు చిందిస్తున్న ఆయన అందమైన ముఖాన్ని ప్రతిబింబాన్ని చిరునవ్వుతో చూసింది ఛాయ.


*"సంజ్ఞ... నీ సౌందర్యం నన్నెప్పుడూ పారవశ్యమనే మైకంలో ఊయలలూగిస్తూ ఉంటుంది !"*


*"ఎప్పుడూ నన్ను మెచ్చుకోవడమే !"* ఛాయ నవ్వింది.


*"ఇప్పుడు నేను మెచ్చుకున్నది నిన్ను కాదు , నీ అందాన్ని !"* అద్దంలోంచి ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు సూర్యుడు. ఆయన గెడ్డం ఛాయ తలను సున్నితంగా నొక్కింది.


*"ఎప్పుడూ మెచ్చుకోవడమే ! ఇచ్చుకోవడమంటూ లేదు !"* ఛాయ అద్దంలోకి చూస్తూ నవ్వుతూ అంది.


*“నన్నే ఇచ్చుకున్నాక ఇవ్వడానికి మిగిలిందేముంది ?"* సూర్యుడు నవ్వాడు. 


ఛాయ చిలిపిగా నవ్వింది. *"మీరు మరిచిపోయారు ! గుర్తు చేయనా ? పుట్టింటి నుంచి వచ్చినప్పుడే , వచ్చినందుకే - మీరు నాకు బహుమతి ఇచ్చి ఉండాలి !”*


సూర్యుడు ఆమె భుజాలను సున్నితంగా నొక్కాడు. *"ఔను... ఇచ్చి ఉండాలి , లేకపోతే ఎప్పుడో అప్పుడు ఇచ్చి తీరాలి. ప్రస్తావన వచ్చింది కాబట్టి , ఇప్పుడే ఇచ్చి తీరాలి !"*


*"నిజంగా ?”* ఛాయ ప్రతిబింబాన్ని ప్రశ్నించింది.


*"నిజమో , కాదో అడిగి తెలుసుకో ! ఏది నువ్వు కోరే బహుమతి ?"* సూర్యుడు నవ్వుతూ అన్నాడు.


*"నేను కోరే బహుమతి - సంతతి !”*


సూర్యుడి ప్రతిబింబం ఆశ్చర్యంగా చూసింది. *"సంతతి... ఉన్నారుగా , సంజ్ఞా ! లేనిది అడుగు !"*


*"నాకు అదే కావాలి !"* ఛాయ నవ్వుతూ అంది.


సూర్యుడి చేతులు ఆమెను తన వైపు తిప్పుకున్నాయి. తల వాల్చి ఛాయ ముఖంలోకి చిరునవ్వుతో చూశాడు. ముఖం పైకెత్తి చూస్తున్న ఛాయ కళ్ళలో ఆశ జంట దీపాల్లా వెలుగుతోంది.


*"సంజ్ఞా ! నువ్వు దర్పణంలో ప్రతిబింబాన్ని అడిగావు. నేను నీ ప్రతిబింబానికి కాకుండా నీకే మాట ఇస్తున్నాను. నువ్వు కోరిన బహుమతి నీకు లభిస్తుంది !”*


ఛాయ చేతులు ఉద్రేకంతో సూర్యుడి చుట్టూ బిగుసుకున్నాయి. కళ్ళు అలాగే వెలుగుతూ చూస్తున్నాయి. ఆమె పగడాల పెదవులు కదిలాయి. *"ముగ్గురు ! ఇద్దరు పుత్రులూ ! ఒక పుత్రికా ! అనుగ్రహిస్తారుగా !”*


సూర్యుడు నవ్వాడు. *“నీ ముచ్చటను గ్రహించాను ! అనుగ్రహించకుండా ఎలా ఉంటాను ?"*


అద్దంలోంచి ఇద్దరి ప్రతిబింబాలు , ఒక్కటిగా , కదిలి అంతర్థానమైపోయాయి.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

కామెంట్‌లు లేవు: