11, నవంబర్ 2023, శనివారం

⚜ శ్రీ నిష్కలంక మహాదేవ్ మందిర్

 🕉 మన గుడి : నెం 236






⚜ గుజరాత్ : భావనగర్


⚜ శ్రీ నిష్కలంక మహాదేవ్ మందిర్ 


💠 ఎత్తైన కొండల్లోనో, సముద్ర తీరంలోనో, నది ఒడ్డులో ఆలయాలు ఉండటం తెలుసు.. కాని సముద్రం మధ్యలో ఆలయం అంటే కొంత ఆశ్చర్యం కలగకమానదు.. సముద్రం మధ్యలో ఆలయం ఉంటే భక్తులెలా దర్శించుకుంటారనే అనుమానం రావచ్చు.

కాని గుజరాత్‌ కొలియాక్ సముద్ర తీర ప్రాంతంలో ఓ ఆలయం మాత్రం ఎంతో స్పెషల్.. సముద్రం మధ్యలో ఉండటమే కాదు.. భక్తులు దర్శించుకునేందుకు వీలుగా.. ఆ ఆలయానికి చేరుకోవడానికి నిర్ధిష్ట సమయం ఉంటుంది.

ఆ టైంలో ఎటువంటి నీరు ఆలయం వద్ద ఉండదంటే అతిశయోక్తికాదు.


💠 నిష్కలంక అంటే...కళంకం లేని స్థితి..వ్యవహరికం లో పాపము లేని ఉన్నతస్థితి. పాపప్రక్షాళన పాండవులకు జరిగిన ప్రదేశం కాబట్టి నిష్కలంక మహాదేవ్ గా భక్తులు స్వామిని పిలుస్తారు.


💠 ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే పొద్దున్నే మనం అక్కడికి వెళ్ళామనుకోండి, అప్పటికి అక్కడ గుడి కనిపించదు. అక్కడ ఆలయం ఉందనడానికి సూచికగా ఓ ధ్వజస్తంభం మాత్రమే కనిపిస్తుంటుంది. తర్వాత మెల్లగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సముద్రం వెనక్కి వెళ్తూ ఉంటుంది. దాంతో ఆలయం పూర్తిగా కనిపిస్తూ వెళ్ళడానికి మార్గం దొరుకుతుంది. ఇక భక్తులు అక్కడికి నడుచుకుంటూ వెళ్ళి శివలింగానికి పూజలు చేస్తారు. 

ఇలా రాత్రి పదిగంటల వరకూ అక్కడే కాలం గడపొచ్చు. ఆ సమయం దాటితే మాత్రం అక్కడి నుంచి వెనక్కి వచ్చేయాల్సిందే! ఎందుకంటే మళ్ళీ సముద్రం ముందుకు వచ్చి ఆలయాన్ని నీటముంచుతుంది. 

అంటే మళ్లీ మర్నాడు మధ్యాహ్నం వరకు ఆలయం కనిపించదన్నమాట! అదీ అక్కడి విశేషం. ఆలయ ధ్వజస్తంభం ఎత్తు దాదాపు 20 మీటర్లు. అంటే దాదాపు ఆ ఎత్తువరకు నీళ్లు వచ్చేస్తాయి. 


💠 కొన్ని వందల ఏళ్ళుగా ఇక్కడ ఇలాగే జరుగుతోందట. ఈ పరమేశ్వర ఆలయాన్ని పాండవులు నిర్మించారన్నది స్థలపురాణ గాథ! పౌర్ణమి రాత్రి పోటు సమయంలో పదిగంటల వేళ సముద్రం బాగా ముందుకు వచ్చేయడం, మెల్లిగా ఆలయాన్ని తన గర్భంలో దాచేసుకునే దృశ్యం అక్కడి యాత్రికులకు ఎంతో కనువిందు చేస్తుంది...


💠  ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం రోజున ఇక్కడ అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. సముద్రం మధ్యలో ఈ ఆలయం నిర్మాణం ఎలా చేశారనేది నేటి తరం ఇంజినీర్లకు, సాంకేతిక నిపుణులకు అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. ఈ ఆలయాన్ని వీక్షించిన వారు ప్రాచీన భారతీయుల నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు.



 ప్రతిరోజూ మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సముద్రం పూర్తిగా వెనక్కి వెళ్లడంతో పూలు, పండ్లు, పూజా సామగ్రి అమ్మే వర్తకులు తమ సామాగ్రిని తోపుడు బండ్లపై వేసుకుని సముద్రంలో నడుచుకుంటూ ఆలయానికి చేరుకుంటారు. ఆ తరువాత ఆలయానికి వెళ్లే భక్తుల తాకిడి కూడా పెరుగుతుంది. రాత్రి 7 గంటల వరకూ భక్తులు మహాశివుడ్ని దర్శించుకోవడంతో పాటు.. ఈ ఆలయం వద్ద గడపవచ్చు. రాత్రి 7 గంటలు దాటిన తరువాత సముద్రం మళ్లీ ముందుకు రావడం ప్రారంభిస్తుంది. అర్ధరాత్రి దాటే  సమయానికి ఆలయం పూర్తిగా సముద్రగర్భంలో మునిగిపోతుంది.


🔅 ఆలయ చరిత్ర 🔅


💠. పురాణాల ప్రకారం సముద్రం మధ్యలో ఉండే నిష్కలంక మహదేవ్ ఆలయానికి ఎంతో ఘనమైన చరిత్రే ఉంది. 

మహాభారతం యుద్ధం సమయంలో పాండవులు కౌరవులపై యుద్ధాన్ని గెలిచినప్పటికి.. ఆ యుద్ధంలో సొంత బంధువులను చంపిన పాపాల నుంచి విముక్తి పొందడానికి పాండవులు శ్రీకృష్ణున్ని ఆశ్రయిస్తారు. 


💠 శ్రీకృష్ణుడు ఒక నల్లని ఆవుకు నల్లని జెండాను కట్టి అవి ఎంత దూరం వెళితే అంత దూరం వాటి వెంట వెళ్లమంటాడట. 

ఎప్పుడైతే ఆ ఆవు, జెండా తెల్లగా మారతాయో అప్పుడు ఆ పాపాల నుంచి విముక్తి దొరుకుతుందని శ్రీకృష్ణుడు చెబుతారని, దీంతో పాండవులు రోజుల తరబడి ఆవుల వెంటే నడిచేవారని పురాణాలు చెబుతున్నాయి. 

ఎంత దూరం నడిచినా వాటి రంగులో మార్పు రాలేదు. ఎప్పుడైతే చివరిగా ఆవు, జెండా కొలియాక్ సముద్ర తీరానికి చేరుకున్నాయో అప్పుడు ఉన్నట్టుండి అవి తెల్లగా మారతాయని, ఆ సమయంలో పాండవులు ఆ ప్రదేశంలోనే కూర్చుని పరమశివుని కోసం తపస్సు చేస్తారని, వారి భక్తికి మెచ్చిన శివుడు ఒక్కొక్కరి ఎదుట ఒక్కో స్వయంభువు శివలింగంగా అవతరిస్తాడని, దీంతో పాండవులు అమితానందపడి ఆ ఐదు శివలింగాలకు పూజలు నిర్వహించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

అదే ఈ దివ్యక్షేత్రం.


💠 పాండవుల పాపాలను కడిగిన ఈ పరమ పవిత్ర ప్రదేశం అప్పటి నుంచి నిష్కలంక్ మహదేవ్ గా ప్రసిద్ధి పొందినట్లు పురణ గాధల ద్వారా తెలుస్తోంది.


💠 ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో కెరటాలు చాలా ఉధృతంగా వస్తుంటాయి.

బాగా కావాల్సిన వారు ఎవరైనా మరణిస్తే వారి ఆస్తికలను ఇక్కడి నీటిలో కలపడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరి ముక్తి లభిస్తుందని చాలా మంది విశ్వాసం. 


💠 ఆలయం గోపురంపై సూచికగా ఎగిరే జెండాను సంవత్సరానికి ఒక్క సారి మాత్రమే మారుస్తారు. ఇప్పటి వరకూ తుపాన్లు, అలల వలన ఈ జెండా దెబ్బతినలేదంటే అతిశయోక్తి కాదు. 

దేవుడిపై భక్తి, పర్యటనల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఈ ప్రదేశం ఓ మరపురాని అనుభూతిని ఇస్తుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.

కామెంట్‌లు లేవు: