29, జనవరి 2024, సోమవారం

నైమిశారణ్యం

 *నైమిశారణ్యం*

*పురాణాల పుట్టిల్లు నైమిశారణ్యం. గురువులకు, తపస్వులకు నిలయం. వేదకాలం నుంచి నైమిశారణ్యంలో ఎప్పుడూ ఏవేవో దివ్య క్రతువులు, జ్ఞాన సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. మూడులోకాలలోని తీర్థాలలో ఉత్తమమైనది నైమిశారణ్యం. ఈ దివ్య తీర్థాన్ని దర్శిస్తే సకల తీర్థాలనూ సేవించిన ఫలితం లభిస్తుంది.*


 కురుక్షేత్రంలో ఒక క్రోసెడు దూరం నడిచినా, నైమిశారణ్యంలో ఒక అడుగు నడిచినా, యజ్ఞం చేసిన ఫలం లభిస్తుందని మహాభారతంలోని అరణ్యపర్వం చెబుతుంది. నైమిశారణ్యం ఎనిమిదో వైకుంఠం అని తులసీదాసు రామచరిత మానస్ చెబుతోంది. 


1. దండకారణ్యం, 

2. సైంధవారణ్యం, 

3. జంబుకారణ్యం, 

4. పుష్కరారణ్యం, 

5. ఉత్పలారణ్యం, 

6. బదరికారణ్యం, 

7. జాంగలారణ్యం, 

8. ఉత్తరారణ్యం, 

9. నైమిశారణ్యం 


అనే తొమ్మిది అరణ్యాలలో ఇది ఉత్తమమైనది.


*నైమిశం ఇలా పుట్టింది*


పాంచాల రాజ్యానికి, కోసల దేశానికి మధ్యలో 84 క్రోసులు అంటే 252 కి.మీ. దూరం వ్యాపించిన సువిశాల అరణ్యమే *"నైమిశారణ్యం.* అనాదికాలం నుంచి మన రుషులకు తపోస్థలి. శౌనకాది మహామునులు ఇక్కడ చిరకాలం తపస్సులు చేశారు. యజ్ఞయాగాలు నిర్వహించారు. ఇక్కడ ప్రతి చెట్టు, ప్రతి పుట్ట పవిత్రమైనవే.


 పూర్వం కలియుగం ప్రారంభంలో రుషులు, మునులు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి, “స్వామీ! రాబోయే కలియుగం సకల అనర్థాలకూ మూలం కదా! మాకు కలిప్రభావం లేని ప్రదేశాన్ని సూచించండి. మేమంతా అక్కడికి వెళ్లి తపస్సు చేసుకుంటాం” అని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన మనస్సు ద్వారా ఒక దివ్యచక్రాన్ని సృష్టించి భూమిపైకి పంపాడు. “మహాత్ములారా! మీరంతా ఆ చక్రాన్ని అనుసరిస్తూ వెళ్లండి. ఆ చక్రం నేమి (ఇరుసు) ఎక్కడ ఆగుతుందో అదే మీరు కోరుకునే పుణ్యప్రదేశం" అని చెప్పి పంపించాడు. అలా బ్రహ్మ వదిలిన చక్రం ఇరుసు ఆగిన ప్రదేశమే *నైమిశారణ్యం.*


 ఈ అరణ్యంలో శౌనక మహర్షి 84 వేలమంది మునులతో కలిసి భాగవత పారాయణ చేశాడని చెబుతారు. వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు కూడా ఇక్కడే ఒక యాగాన్ని చేసి మహాభారత పారాయణ చేశాడు. శ్రీరాముడు అశ్వమేధయాగం ఇక్కడే చేశాడు. ఇక్కడే లవకుశుల్ని కలుసుకున్నాడు.


*దర్శనీయ స్థలాలు:*


*చక్రతీర్థం:*


 బ్రహ్మదేవుడి చక్రం ఆగిన స్థలంలోనే చక్రతీర్థం అనే పుష్కరిణి ఏర్పడింది. నైమిశారణ్యంలో ఇది సుప్రసిద్ధ తీర్థం. ఇది వృత్తాకారంగా అందంగా కనిపిస్తుంది. ఈ దివ్యతీర్థంలో స్నానం చేసినవారికి వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని ప్రతీతి. అమావాస్య, సోమవారం కలిసి వచ్చిన రోజున సోమావతీ అమావాస్య (జూలై 17) అంటారు. ఆ రోజున ఎవరైతే చక్రతీర్థంలో స్నానం చేస్తారో వారి మనోవాంఛలన్నీ తప్పకుండా సిద్ధిస్తాయి. అందుకే, ఈ పుణ్యతిథినాడు లక్షలాదిమంది నైమిశారణ్యానికి వచ్చి, చక్రతీర్థంలో స్నానాలు చేస్తారు. ఈ చక్రతీర్థమే భూమండలానికి మధ్యభాగం అని మహాభారతం శాంతిపర్వం (343.2) చెబుతోంది. ఈ తీర్థం పక్కనే ప్రాచీనమైన శివాలయం కూడా ఉంది. స్వామిపేరు *భూతేశ్వరుడు.*


*వ్యాసగద్దె :*


భగవాన్ వేదవ్యాస మహర్షి వేదవిభజన చేసిన ప్రదేశమే ఈ వ్యాసగద్దె. వ్యాసుడు ఇక్కడే ఒక్కటిగా ఉన్న వేదరాశిని నాలుగు వేదాలుగా విభాగం చేశాడంటారు♪. జైమిని, వైశంపాయనుడు, పైలుడు, అంగీరసుడు వంటి శిష్యులకు వేదవిద్యను ఇక్కడే ప్రబోధించాడు. అష్టాదశ పురాణాలను అందించాడు. ఈ వ్యాసగద్దెను చక్కటి పట్టువస్త్రంతో అలంకరిస్తారు. ఈ గద్దె పక్కనే వ్యాస, శుకమహర్షుల పాలరాతి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఈ వ్యాసగద్దె సమీపంలోనే మరికొన్ని మందిరాలు కూడా ఉన్నాయి. ఇది చక్రతీర్థానికి అరకిలోమీటరు దూరంలోనే ఉంది.


*సూతగద్దె :* 


 సూత పౌరాణికుడు ఎనభై ఎనిమిది వేలమంది మునులకు పురాణాలను వినిపించాడు. అంతేకాదు మన ఆంధ్రదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాన్ని మొదటిసారిగా సూతమహర్షి శౌనకాది మునులకు బోధించిన స్థలం కూడా ఇదే. ఈ ప్రదేశంలో సూతమహర్షి పాలరాతి విగ్రహాన్ని ఒక మందిరంలో ప్రతిష్ఠించారు. ప్రస్తుతం ఒక పెద్ద దేవాలయంగా దీన్ని తీరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.


*శౌనక యాగశాల:* 


 సూతగద్దె సమీపంలోనే పూర్వం శౌనకాది మహామునులు దీర్ఘసత్రయాగం చేసిన ప్రదేశం ఉంది. ఇక్కడ ఒక ప్రాచీనమైన యాగశాల మనకు కనిపిస్తుంది.


*లలితా శక్తిపీఠం:* 


పవిత్రమైన నైమిశారణ్య క్షేత్రంలో సతీదేవి హృదయభాగం పడిందని చెబుతారు. దక్షయజ్ఞ వాటికలో ప్రాణాలు కోల్పోయిన సతీదేవి శరీరాన్ని శ్రీహరి తన చక్రంతో 108 భాగాలుగా ఖండించగా అవన్నీ భూమండలంలో 108 ప్రదేశాల్లో పడి శక్తిపీఠాలుగా మారిపోయాయి. తంత్రగ్రంథాలలో ఈ పీఠాన్ని *ఉడ్డీయనీ పీఠం* అంటారు. నైమిశారణ్యంలో కొలువున్న అమ్మవారిని *లింగధారిణీ* అనే పేరుతో ఆరాధిస్తారు. అయితే లలితాపీఠంగా ఇది ప్రసిద్ధి చెందడం విశేషం. దసరా నవరాత్రులు, చైత్ర నవరాత్రుల్లో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. చక్రతీర్థం నుంచి సుమారు ఒక కి.మీ. దూరంలో శక్తిపీఠం ఉంటుంది. 


ఇంకా నైమిశారణ్యంలో బాలాజీ మందిరం, దేవరాజన్ మందిరం, గోమతీ నది, దధీచి కుండం, రుద్రావర్త కుండం హత్యారణ్య కుండం తప్పకుండా చూడవలసినవి.

కామెంట్‌లు లేవు: