29, జనవరి 2024, సోమవారం

గోవు వెనక వెళ్ళడమెందుకు

 🙏 శ్రీ గురుభ్యోనమః 🙏


🕉️గోవు వెనక వెళ్ళడమెందుకు?🕉️


పరమాచార్య స్వామివారు విజయయాత్రలలో భాగంగా, వివిధ ప్రాంతాలలో నివసిస్తుండేవారు. అలాంటి సమయాలలో కొందరు భక్తులు, తమ ఇళ్ళకు రమ్మనో లేదా అక్కడి దేవాలయాలకు రమ్మనో అభ్యర్తిస్తుంటారు.


భక్తులు రమ్మని ప్రార్తిస్తున్నది దేవాలయానికే అయితే పరమాచార్య స్వామివారు దాదాపుగా వారి అభ్యర్థనను మన్నించి అక్కడకు వెళ్లి, దేవాలి దర్శనం చేసుకుని, దగ్గరలోని ఒక స్థలంలో మకాం చేసి, కొద్దిసేపో లేదంటే ఒకరోజో అక్కడ ఉంది భక్తులకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తుంటారు. కొన్నిసార్లు ఏదైనా ఉపన్యాసం కాని లేదా సామాన్య విషయాలు చర్చించడం కాని జరుగుతూ ఉంటాయి.


ఒకసారి పరమాచార్య స్వామివారు తమిళనాడు మొత్తం విజయయాత్ర చేస్తున్నారు. యాత్రలో భాగంగా తిరుచిరాపల్లిలో కొన్నిరోజుల పటు మకాం చేశారు. ప్రతిరోజూ స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేవారు.

ఆ భక్తజన సమూహంలో తిరుచ్చిలోని ఒక కళాశాల ప్రధానాచార్యులు కూడా ఉన్నారు. వరుసలో అతని వంతు రాగానే మహాస్వామివారికి నమస్కరించి, ఎన్నోరకాల పళ్ళు పూలు సమర్పించాడు. మహాస్వామివారి దివ్యపాదములు తన కళాశాలను తాకాలని, విద్యార్ధులని అనుగ్రహించాలని ప్రార్థించాడు.


కాని మహాస్వామివారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అతని ప్రార్థనకు మౌనమే స్వామివారి సమాధానం అయ్యింది. అతను మాత్రం రోజూ వచ్చి స్వామివారిని అర్థించేవాడు.


చివరగా ఒకరోజు కరుణాసాగరులైన మహాస్వామివారు అతనిపై తమ దయను ప్రసరింపజేశారు. పటికబెల్లం, కుంకుమ ప్రసాదం ఇస్తూ, స్వామివారు అతనితో, “రేపు ఉదయం మీ కళాశాలకు వస్తాను. ఒక ఆవు, దూడతో నీవు నీ భార్య సిద్ధంగా ఉండండి” అని ఆజ్ఞాపించారు.


ఆ భక్తుని సంతోషానికి అవధులు లేవు. “ఖచ్చితంగా అలాగే చేస్తాను పెరియవా” అని మహదానందంతో వెళ్ళిపోయాడు.


చెప్పినట్టుగానే ఉదయం స్వామివారు కళాశాలకు వెళ్ళారు. అతను ఆవు, దూడ, పూర్ణకుంభంతో సహా స్వామివారికోసం ఎదురుచూస్తున్నాడు. మహాస్వామివారి పూర్ణకుంభాన్ని స్వీకరించి, కళాశాల ద్వారం వద్దకు వచ్చి నిలబడ్డారు.


స్వామివారు ఆ భక్తునితో, “నువ్వు ఎక్కడేక్కడైతే నేను రావాలి అనుకుంటున్నావో, అక్కడకు నువ్వు ఆవు, దూడను ముందు తీసుకుని వెళ్ళు, నేను అనుగమిస్తాను” అని తెలిపారు.


స్వామివారి ఆదేశం ప్రకారం అతను భార్యతో కలిసి ఆవు దూడను ముందు తీసుకుని వెళ్తూ ఉంటె స్వామివారు ఆవు వెనుకగా వస్తున్నారు. మొత్తం కలియతిరిగిన తరువాత స్వామివారు ఆ భక్తునితో, “సంతృప్తిగా ఉందా?” అని అడుగగా, అతను తనకు కలిగిన ఆనందాన్ని మాటలలో చెప్పడం కుదరక, కళ్ళ నీరు కారుస్తూ, హృదయం ఉప్పొంగి, తనకు స్వామివారు కలిగించిన అదృష్టానికి, వారి దయకు కృతజ్ఞతగా నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. 


తమ వసతికి తిరిగొచ్చిన స్వామివారు సాయింత్రం భక్తులతో మాట్లాడుతూ, ఉదయం తాము కళాశాలకు వెళ్లోచ్చిన విషయం ప్రస్తావనకు రావడంతో ఒక వ్యక్తి స్వామివారిని, “పెరియవా, కళాశాలో మీరు ఆవు వెనుకగా ఎందుకు వెళ్ళారు?” అని అడిగాడు.


స్వామివారు చిరునవ్వుతూ, “అతను నాపై అత్యంత భక్తిభావం కలవాడు. నేను వస్తే అది కళాశాలకు మంచి అని నమ్మి నన్ను ఆహ్వానించాడు. కాని అది ఆడపిల్లలు చదివే కళాశాల. వారు అన్ని రోజులలోను కళాశాలకు వస్తారు. వారు దూరం ఉండాల్సిన సమయాలలో కూడా కళాశాలకు వస్తారు. అందుకే నేను ఒక ఆలోచన చేశాను. అతని కోరికను తీర్చాలి. నా అనుష్టానం, నియమపాలన కూడా కాపాడబడాలి. దానికి పరిష్కారం ఒక్కటే. మన శాస్త్రాలలో ఉన్నదాని ప్రకారం, ఎటువంటి అశౌచమైనా, ఎటువంటి స్థలమైనా గోవు డెక్కల నుండి వచ్చే ధూళి తగిలితే, ఆ స్థలం పవిత్రమవుతుంది. అందుకే ఆవును ముందు వదిలి నేను దాన్ని అనుసరించాను” అని బదులిచ్చారు.


స్వామివారు చెప్పిన విషయాన్ని విన్నవారందరూ స్థాణువులై నిలబడిపోయారు. ఇంతటి ధర్మసూక్ష్మము ఉంటుందా అని మనం అనుకోవచ్చు. ధర్మాన్ని, ఆశ్రమ నియమ పాలనను ఇంతగా పాటించే జీవితం ఉంటుందా అని మనం అనుకోవచ్చు. ఇలా దయను కూడా ధర్మంతో ముడిపెట్టి పాలించేవారు కంచి పరమాచార్య స్వామివారు కాక ఇంక ఎవరు ఉంటారు?


🌹👏🌹

జయ జయ శంకర

హర హర శంకర

🌹👏🌹


అపార కరుణాసింధుం 

జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం

ప్రణమామి ముదావహం

కామెంట్‌లు లేవు: