11, నవంబర్ 2024, సోమవారం

శ్రీ కందాడై రామానుజాచార్యుల జీవిత విశేషాలు

* పరమపదించిన మన న్యూ నాగోలు కాలనీ వాస్తవ్యులు ఆధ్యాత్మికవేత్త శ్రీ కందాడై రామానుజాచార్యుల జీవిత విశేషాలు - ఓ సమీక్ష*

సంస్కృతంలో పోగుపడిన భారతీయ సనాతన ధర్మశాస్త్ర విజ్ఞానాన్ని పిడికిట పట్టి, తెలుగు వారి లోగిళ్ళ ముందు రాశిగా పోసిన వ్యాకరణ పండితుడు డాక్టర్‌ కందాడై రామానుజాచార్య (81) ఇకలేరు. ధర్మ అధ్యయనం, ధర్మ ప్రబోధమే ఊపిరిగా తుది వరకు వారు జీవించిన వైనం అందరికి చిరపరిచితమే.

సనాతన ధర్మ ప్రబోధకుడు కందాడై గారు టీటీడీ సంస్కృత కళాశాల అధ్యాపకుడిగా, ప్రిన్సిపాల్‌గా సేవలు ఒనరించారు. అష్టాదశ పురాణాలపై ప్రబోధాలు ఎన్నో చేసారు. వేద సాహిత్య రచనలో ప్రావీణ్యులైనటువంటి వారు ఇక మన మధ్యలో లేరు.

అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సుమతి, కుమారుడు వనమాలి, కుమార్తె హరిప్రియ ఉన్నారు. మరో కుమారుడు మురళి ఏడాది క్రితం గుండెపోటుతో కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే.  

రామానుజాచార్య స్వస్థలం ఉమ్మడి నల్లగొండ జిల్లా చీదేళ్ల. తన పదో ఏట హైదరాబాద్‌, సీతారాంబాగ్‌లోని వేదాంతవర్ధిని సంస్కృత పాఠశాలలో వేదాభ్యాసాన్ని ప్రారంభించారు. కోయిల్‌ కందాడై శఠకోప రామానుజాచార్య శిష్యరికంలో వ్యాకరణ విద్యను అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ (సంస్కృతం) పూర్తిచేశారు. అలంకార మణిహారం అనే అంశంపై చేసిన పరిశోధనకు గాను పీహెచ్‌డీలో బంగారు పతకాన్ని అందుకున్నారు. 

టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో అధ్యాపకుడిగా, ప్రధానాచార్యుడిగా, ప్రత్యేక అధికారిగా 2004 వరకు సేవలందించారు. టీటీడీ ధర్మప్రచార మండలి సభ్యుడిగా కొంతకాలం కొనసాగారు. అష్టాదశ పురాణాలపై మూలగ్రంథం ఆధారంగా ప్రవచనాలు ఇవ్వగలిగిన కొద్దిమంది ధర్మప్రచారకర్తలలో కందాడై ఒకరు.

వారి వేద సాహిత్య సేవ వర్ణనాతీతము. రామాయణ, మహాభారత, భాగవతాలు, పురాణ, ఇతిహాసాలపై కందాడై కొన్ని వందల ప్రవచనాలిచ్చారు. పలు టెలివిజన్‌, వార్తా పత్రికల్లో *ధర్మ సందేహాలు* పేరుతో వేల మంది అనుమానాలకు సశాస్త్రీయ వివరణతో సమాధానాలిచ్చారు. ఎన్నో సనాతన ధర్మశాస్త్ర గ్రంథాలను సంస్కృతం నుంచి తెలుగులోకి తనదైన వ్యాఖ్యానంతో అనువదించారు. వాటిల్లో భాగవతం, పద్మపురాణం, నారద పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం, హరివంశ మహా పురాణం, పరాశర స్మృతి, తెలుగు మాసాల వైశిష్ట్యాన్ని తెలిపే రచనలు ప్రచురితమయ్యాయి. ఏకాదశి వైభవంలోని పన్నెండు వేల శ్లోకాలను తెలుగులోకి అనువదించారు.  

వారు దివంగతులు కావడం భక్తి ప్రపంచానికి ఓ తీరని లోటే. కాని మానవ జీవితం అశాశ్వతం కదా. పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పుతుందా. రామానుజాచార్యులు గారు కూడా ఈ మానవ పుట్టు గిట్టుకలకు అతీతులు కారే. వారు చేసిన భగవత్కార్యాల సేవలే వారిని ఇక మీదట శ్రీవారి పాదపద్మముల చెంత సేద తీర్చమని ఆజ్ఞాపించింది కాబోలు. అలాంటివారికి అనారోగ్యమన్నది ఓ మిషనే. నిష్క్రమించే సమయం ఆసన్నమయినట్టుంది. వెడలిపోయారు. 

కాని వారు చేసిన ధర్మప్రబోధాలు, వేద సాహిత్య సేవ, దర్మశాస్త్రాల అనువాదాలు ఇలా ఎన్నెన్నో వారిని మన మదిలో చిరకాలం ఉండేటట్టు చేయగలిగినవి.

ఇందు మూలంగా వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాలు తెలియజేస్తున్నాను.

 

కామెంట్‌లు లేవు: